ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాపై మీ సందేహాలు.. డాక్టర్ సమాధానాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 01:49 PM

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తుమ్మితే కరోనా వచ్చినట్లేనా? దగ్గితే కరోనా ఉన్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర్. ఏ శ్రీనివాస చారి గారి నుంచి సమాధానాలు అందిస్తున్నారు. 


ప్రశ్న: మందులేని ఈ కరోనా రాకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి? ముఖ్యంగా ఈ వానా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


జవాబు: ఏ కాలంలో అయినా మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరుచూ చేతులు కడుక్కోవడం లాంటివి చేయడం ద్వారా కరోనా నుంచి కాపాడుకోవచ్చు.


ప్రశ్న:గొంతులో ఇబ్బందిగా అనిపిస్తోంది. కుచ్చుకున్నట్లుగా ఉంటోంది. కరోనా లక్షణమా?


జవాబు:శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం లాంటి ఇతర సమస్యలు ఉంటేనే కరోనా గురించి ఆలోచించాలి. దగ్గరలోని వైద్యుడిని సంప్రదించి వారు సూచించిన మందులు వాడండి.


ప్రశ్న:తోట కూర, పాల కూర, బచ్చల కూరలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయా?


జవాబు:కేవలం ఇవి మాత్రమే కాదు, ఆకుకూరలన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అవి తినడం ఆరోగ్యానికి మంచిది.


ప్రశ్న:ఈ వైరస్ జీవమా?, నిర్జీవమా? శరీరంపై పడ్డ తుంపర్లు లోపలికి ఎలా చొచ్చుకుని పోతాయి? చేతిపై వైరస్ పడితే.. ఆ చేయి నోటికి తాకితేనే కరోనా వస్తుందా? లేక పోతే రాదా?


జవాబు: కరోనా వైరస్ జీవమే. మన శరీరంలోకి రెండు రకాలుగా వైరస్ వెళ్తుంది. కరోనా వచ్చిన వ్యక్తి తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చిన తుంపర్లు గాలి పీల్చినప్పుడు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ మన చేతి మీద పడిన సమయంలో ముక్కు, మొహం భాగంలో పెట్టుకుంటే లోపలికి వెళ్తుంది. పైన చెప్పినట్లుగా సామాజిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం ద్వారా కరోనా రాకుండా చూసుకోవచ్చు.


ప్రశ్న:బండి హ్యాండిల్ పై కరోనా ఉంటే శానిటైజర్ తో తుడిస్తే పోతుందా? గాలిలో తుంపర్లు ప్రయాణిస్తాయి అంటున్నారు? తుంపర్లు ఘన పరిమాణం కదా? గాలిలో ఎలా నిలుస్తాయి?


జవాబు:శానిటైజర్ తో తూడిస్తే వైరస్ చనిపోతుంది. గాలి ప్రవాహం అధికంగా ఉన్న ప్రదేశంలో తుంపర్లు కింద పడకుండా కొద్ది సేపు గాలిలో ఉండే అవకాశం ఉంది.


ప్రశ్న:నాకు డెలివరీ అయ్యి 16 రోజులు అవుతుంది, మా బాబుకు అప్పుడప్పుడు తుమ్ములు వస్తున్నాయి, ఇది కరోనా అంటారా?


జవాబు:సాధారణంగా వచ్చే తుమ్ములే కావొచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడితే పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లండి.


ప్రశ్న:చనిపోయిన వ్యక్తి శరీరంలో వైరస్ ఎంత సేపు యాక్టీవ్ గా ఉంటుంది?


జవాబు:ఇంత సమయం అని ఖచ్చితంగా చెప్పలేం. అందుకోసమనే కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండా అత్యంత జాగ్రత్తతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.


ప్రశ్న:నాకు దగ్గు, జ్వరం లేదు, అప్పుడప్పుడు జలుబు చేస్తుంది. ఈ సమస్య ఏమంటారు?


జవాబు: సాధారణ సమస్యే కావొచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రమే కరోనా గురించి ఆలోచించండి.


ప్రశ్న:రెండు నెలల నుంచి జలుబు వస్తోంది, పోతోంది. వారం ఉంటుంది. వారం పోతోంది. కొంచెం నీరసంగా ఉంటుంది. చాల భయంగా ఉంటుంది?


జవాబు: రెండు నెలలు అంటున్నారు కదా? కరోనా అయ్యే అవకాశం లేదు. దగ్గరలోని డాక్టరును సంప్రదించి మందులు వాడండి.


ప్రశ్న:సర్ చెస్ట్ పెయిన్, దగ్గు ఉంది బ్రీతింగ్ కొంచెం స్లో అవుతుంది. సైనస్ ఉంది. కరోనా లక్షణాలేనా?


జవాబు: దగ్గు, బ్రీతింగ్ సమస్య కాబట్టి ఆలస్యం చేయకుండా ఒక సారి డాక్టరును సంప్రదించండి.


ప్రశ్న:నాకు రెండు నెలల నుంచి దగ్గు ఉంది? దగ్గుతో రెండు రోజుల నుంచి తల నొప్పి, ఛాతి నొప్పిగా ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు వేసుకున్నా తగ్గడం లేదు ఏమై ఉంటుంది?


జవాబు: డాక్టరు దగ్గరికి వెళ్లి వారి సూచనల ప్రకారం టీబీ తదితర పరీక్షలు చేయించుకోండి.


ప్రశ్న:15 రోజులుగా గొంతులో మా అన్నయ్యకు నొప్పి. రెండు రోజులుగా అధికంగా ఉంది. ఏమంటారు?


జవాబు: సాధారణ సమస్యే కావొచ్చు. ఎంతకూ తగ్గకపోతే డాక్టరును సంప్రదించండి.


ప్రశ్న:ఈగ, దోమల ద్వారా కరోనా వస్తుందా?


జవాబు:వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం కొద్ది మేర ఉంటుంది. పరిసరాల్లో దోమలు, ఈగలు లేకుండా చూసుకోవడం మంచిది.


ప్రశ్న:నాకు వారం నుంచి గొంతులో కఫం లాగా ఉంటుంది?


జవాబు: ఈ సమస్యతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే దగ్గరలోని డాక్టరును సంప్రదించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa