రావణాసురుడు దేవతలని సైతం భయపెట్టే అతి భయంకరుడు. ఈ లంకాధిపతి గొప్ప శివభక్తుడు కూడా. అయితే కఠోర తప్పసుతో వరం పొందిన రావణాసురుడు రాముడి చేతనే ఎందుకు చంపబడ్డాడు. అసలు అయన పొందిన వరం ఏంటి? రావణ సంహారం కోసం దేవతలు ఎవరు ఎవరిని ఏవిధంగా జన్మించేలా చేసారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.దశరథుని పుత్రకామేష్ఠియాగంలో తమ హవిర్భాగాలు స్వీకరించేందుకు దేవ గంధర్వ సిద్ధులూ, మహర్షులూ బయల్దేరుతూ దివ్యలోకంలో పరమేష్ఠితో సమావేశమయ్యారు. లంకాధీశ్వరుడు రావణుని గురించి చెప్పి, అతన్ని సంహరించే మార్గం ఆలోచించమన్నారు. ఎందుకంటే సురాసుర, యక్ష, కిన్నర, గంధర్వాదులచే మరణం లేకుండా రావణుడు బ్రహ్మ వరాన్ని పొందుతాడు. కానీ అల్పులని భావించి నర, వానరులని ఉపేక్షిస్తాడు. దానినే అవకాశంగా తీసుకొని బ్రహ్మ నరుని చేతే రావణుణ్ణి సంహరించేందుకు ఇదే సరైన మార్గం అని భావిస్తాడు.ఇది ఇలా ఉంటే సంతతికోసం దశరథుడు యజ్ఞం చేస్తుంటాడు. ఆ ఇంట మానవునిగా మాధవుణ్ణి జన్మించమని వేడుకుందాం అని పరమాత్ముని కోసం ధ్యానం చేయండని బ్రహ్మసహా అక్కడ ఉన్న దేవతలంతా ధ్యానించసాగారు. కాస్సేపటికి సర్వజ్ఞుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నుడై వారితో ఇలా పలికాడు. మీ అభీష్టాన్ని అనుసరించి దుష్టరావణుణ్ణి పుత్ర బంధు బలగాల సహా హతమారుస్తాను. లోక రక్షణకోసం సత్యసంధుడైన దశరథునికి నా తేజస్సుతో నలుగురు కుమారులుగా అవతరిస్తాను. మీరూ తగు సన్నాహాలు చెయ్యండి. నిర్భయంగా ఉండండి అని అభయం ఇచ్చాడు నారాయణుడు.అప్పుడు బ్రహ్మ మనం కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నాయని దేవతలకి చెబుతాడు. గతంలో నేను ఆవలిస్తే మహాపరాక్రమవంతుడు ఎలుగుబంటు వీరుడు జాంబవంతుడు జన్మించాడు. మీరు కూడా మీమీ అంశలతో బలిష్టులైన ఋక్ష, వానర వీరులను భూమిపై అసంఖ్యాకంగా సృష్టించండి అంటూ సూచిస్తాడు. దశరథుని క్రతువులో హవిర్భాగాలు స్వీకరించేందుకు అక్కణ్ణుంచి బయల్దేరారు.భక్తి శ్రద్ధలతో పవిత్రాహుతులు హోమగుండంలో వేస్తున్నాడు దశరథుడు. మంత్రోచ్చారణ జరుగుతోంది. మంట మహారూపు దాల్చి పరాక్రమంతుడయిన ఒక వేల్పు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో సువర్ణపాత్ర ఉంది. దశరథుణ్ణి ప్రసన్నంగా చూశాడతను. అప్పుడు ఆయన దశరథా! నీ యజ్ఞం సఫలమైంది. నేను ప్రజాపతిని! నీ కోరిక తీర్చేందుకు దేవతలు అందజేసిన పాయసాన్ని తీసుకుని వచ్చా స్వీకరించు. దీనివల్ల మహాతేజోవంతులయిన నలుగురు కుమారులు నీకు జన్మిస్తారు. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు అని చెప్పి అందిస్తాడు.అప్పుడు అందులో కొంత కౌసల్యకు అందజేశాడు. మిగిలిన దానిలో కొంత సుమిత్రకు ఇచ్చాడు. ఇంకా మిగిలిన దానిలో కొంత కైకకు ఇచ్చి, శేషభాగాన్ని చూశాడు. ఆ శేషాన్ని తిరిగి సుమిత్రకు అందజేశాడు. పాయసాన్ని ఆరగించిన కౌసల్య, సుమిత్ర, కైకలు గర్భవతుయ్యారు. దశరథుడు దీక్ష విరమించాడు. భార్యలతో నగరానికి చేరుకున్నాడు. పిల్లలకోసం నిరీక్షించసాగాడు. బ్రహ్మసంకల్పంతో రామునికి సహాయంగా ఉండేందుకు ఇంద్రునివల్ల వాలి, సూర్యునివల్ల సుగ్రీవుడు, ఈ ఇద్దరూ వానరరాజు ఋక్షరజునికి కుమారులుగా జన్మించారు. అయితే వాయువు అంశతో కేసరి భార్య అంజనీదేవికి వజ్రశరీరంతో, వాయువేగాలతో ఆంజనేయుడు జన్మించాడు. ఇంకా బృహస్పతి అంశతో తారుడు, వరుణునకు సుషేణుడు, అగ్నికి నీలుడు, విశ్వకర్మకు నలుడు, అశ్వినీదేవతలకు మైంద ద్వివిదులు వానరులుగా జన్మించారు. వీరేగాక ఇంకా దేవతల అంశతో యక్ష, కిన్నర, గంధర్వకాంతలకు మహావీరులైన ఋక్ష, వానరులు జన్మించి, కొండలూ, కోనల్లో పెరిగారు. ఈ విధంగా రావణ సంహారానికి నారాయణడు శ్రీరాముడిగా మనిషి అవతారం ఎత్తగా, దేవతల అనుగ్రహంతో వానర సైన్యం జన్మించి చివరకు రావణ సంహారం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa