ఒకప్పుడు రతనాల సీమగా చెప్పుకునే రాయలసీమ నేడు రాళ్లదిబ్బలుగా దర్శనమిస్తుంది. రాయలసీమలో లక్షలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారిపోతున్నాయి. జలవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని ఒడిసిపట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బంగారం పండే భూములన్నీ బీడు భూములుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో రైతులకు సాగునీరు..ప్రజలకు తాగునీరు లేక నేటికి ఇబ్బందులు పడుతున్నారు.
తాగు, సాగునీటి సమస్యను అధిగమించేందుకు గత ప్రభుత్వాలు గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించాలని భావించాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు..కడప జిల్లాలో అనేక ప్రాంతాలు సస్యశ్యామలంగా మారుతాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని సి.బెళగల్ మండలంలో తుంగ భద్రనదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదన వచ్చింది. అసలు ఈ గుండ్రేవుల ప్రాజెక్టు ప్రతిపాదన ఎలా వచ్చింది. ఎక్కడ నిర్మిస్తారు.
ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో ఎన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించవచ్చు అనేది తెలుసుకుందాం. కర్నూలు జిల్లా సుంకేసుల వద్ద తుంగభద్ర నదిపై 1865లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1.20 టీఎంసీల సామర్ధ్యంతో సంకేసుల జలాశయాన్ని నిర్మించింది. అయితే ఈ బ్యారేజీకి అనుసంధానంగా కర్నూలు-కడప (కేసీ) కెనాల్ నిర్మించారు. తొలుత జలరవాణా కోసం నిర్మించిన ఈ కేసీ కెనాల్ అనంతరం సాగునీటి కాలువగా మారిపోయింది.
కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ (కేడబ్ల్యూడీటీ) అవార్డు 31.90 టీఎంసీలు నీటి వాటా కేటాయించింది. దీని పరిధిలో కర్నూలు, కడప జిల్లాలో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కడప జిల్లాలోని మైదుకూరు, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో 75 వేల ఎకరాలకు నేరుగా, మరో 30 వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు. కేసీ కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం 2,800 క్యూసెక్కులు. సుంకేసుల జలాశయం నీటి నిల్వ సమర్థ్యం కేవలం 1.20 టీఎంసీలే. తుంగభద్రకు వరదవస్తేనే కేసీ కెనాల్ కు సాగునీరు అందుతుంది. అయితే గత 15ఏళ్లుగా తుంగభద్రకు వరద నీరు తగ్గిపోతోంది. దాంతో పంట కీలక దశలో సాగుతడులు అందక పైర్లు ఎండిపోతున్నాయి.
ఈ సమస్యను అధిగమించేందుకు సాగునీటి నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరాయుడు సుంకేసుల రిజర్వాయర్ ఎగువన గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి రూపకల్పన చేశారు. గుండ్రేవుల జలాశయం నిర్మాణం జరిగితే 20 టీఎంసీలు నిల్వ చేయోచ్చు. తుంగభద్రనదికి వరదలేనప్పుడు ఈ నీటిని వినియోగించుకోవచ్చు. 2013 నవంబర్ 1న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.100 జారీ చేసి సర్వే కోసం రూ.51.95 లక్షలు మంజూరు చేసింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ సర్వే చేసి రూ.2,890 కోట్లతో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపింది. సుంకేశులకు ఎగువన ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు రూ.2890 కోట్ల అంచనా వ్యయంతో జీవో నంబర్ 154 కూడా విడుదలైంది. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గుండ్రేవులను తక్షణం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ అది పట్టాలెక్కలేదు. అయితే ఎన్నికల సమయంలో ఆగమేఘాలమీద జీవో విడుదల చేశారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అది కాస్త మరుగన పడిపోయింది. ఇకపోతే పాదయాత్ర సందర్భంగా గుండ్రేవుల ప్రాజెక్టును ఒక ఏడాదిలోనే నిర్మించి తీరుతామని జగన్ హామీ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. గతంలో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు రూ.4300 కోట్లతో ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపారు.
గుండ్రేవుల రిజర్వాయర్ చేపడితే కర్నూలు జిల్లాతో పాటు సీమ జిల్లాలో పంటభూములకు, పల్లెలకు సాగునీటి, తాగునీటికి ఢోకా ఉండదని ఇరిగేషన్ నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం కేసీ కాల్వకే కాకుండా ఆర్‌డిఎస్‌కు కూడా ఉపయోగకరంగా ఉండటంచేత అటు తెలంగాణ సరిహద్దు ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు పట్ల మొగ్గుచూపుతూ వచ్చారు. కర్నూలు, కడప జిల్లాతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కొందరు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 7 గ్రామాలు ముంపుబారిన పడే అవకాశం ఉంది. అలాగే ఆ రాష్ట్రంలో 7,421 ఎకరాలకు ముంపు ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పాలనామోదం ఇచ్చినా తెలంగాణ అనుమతితోనే ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఇరు రాష్ట్రల ప్రభుత్వాలు చర్చించుకుని ప్రాజెక్టును నిర్మిస్తే తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీరుకు కొదువ ఉండదు. అంతేకాదు బీడు భూముల్లో బంగారం పండించవచ్చుు అని రైతులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa