ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగు మచ్చల సమస్య వేదిస్తోందా.. అయితే ఇలా చేయండి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 05:04 PM

మంగు మచ్చలను ఆయుర్వేదంలో వీటిని ‘వ్యంగ’ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా బుగ్గలు, ముక్కు ఇరువైపులా వస్తుంటాయి. భుజాలు, మెడ, వీపు మీద కూడా ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు అందంగా ఉన్న వ్యక్తులను సైతం అందహీనంగా మార్చేస్తాయి. వీటికి సాధారణ మచ్చలను తగ్గించే చిట్కాలను పాటిస్తే సరిపోదు. ఈ మచ్చలు శరీరతత్వాన్ని బట్టి మారుతుంటాయి. వయస్సుతోపాటు చర్మంపై పడే ప్రతికూలతల వల్ల ఈ మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. మొటిమలు వ్యాప్తి, పుట్టుమచ్చలు కూడా ఇందుకు కారణం. కొందరిలో హరోన్ల సమతుల్యత లోపం వల్ల, మరికొందరికి వంశపారంపర్యంగా ఈ మచ్చలు ఏర్పడతాయి. ఇవి నొప్పిని బాధను కలిగించవు. కానీ, మానసికంగా కుంగదీస్తాయి.

శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం ఎక్కువగా తయారైతే.. ‘హైపర్ పిగ్మెంటేషన్’కు దారి తీస్తుంది. అవి ఒకే చోట పేరుకుపోవడం వల్ల మంగు మచ్చలు వస్తాయి. సూర్య కిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి తగలడం వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది. జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం, అనుధార్మికత, ఔషదాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. అయితే, ఈ మచ్చలను చూసి మీరు కుంగిపోవద్దు. వీటిని తగ్గించేందుకు కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళ దుంపలపై ఉండే తొక్కను తొలగించి సన్నగా తురమండి. దాన్ని పలచని గుడ్డలో వేసి రసం వచ్చేలా పిండండి. ఆ దూదిని ఆ రసంలో ముంచి మచ్చలపై పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి. ముఖంపై ఉండే మచ్చలను తగ్గించడంలో టమోటా ఉత్తమంగా పనిచేస్తుంది. టమోటా గుజ్జును మచ్చలకు రాసుకుని 20 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో కలబంద అందుబాటులో ఉంటే మచ్చలపై రాస్తూ ఉండండి. కలబందను కేవలం ముఖానికే కాకుండా ముఖం మొత్తం రాసుకున్నా మంచిదే.

ఒక గిన్నెలో రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. అలాగే, రోజ్ వాటర్ లేకపోతే నిమ్మరసం, తేనె కలిపి రాసినా చాలు. ఇలా రోజూ చేస్తే మంగు మచ్చలు త్వరగానే మాయమవుతాయి. టమోటా రసంలో కాస్త గంధం పొడిని కలపండి. ఆ మిశ్రమంలో ముల్తాని మట్టిని కలిపి పేస్టులా చేయండి. అనంతరం ఆ పేస్టును ముఖంపై ఉన్న మచ్చలపై రాయండి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. వారంలో రెండు లేదా మూడు రోజులు ఈ చిట్కాను పాటిస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. గేదె పాల వెన్నను రోజూ మచ్చలపై రాసినా మంగు మచ్చలు మాయమవుతాయి. అలాగే, గేదె పాలల్లో కాస్త పసుపు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. మేకపాలలో జాజికాయను అరగదీసి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మంగు మచ్చలు కనిపించవు. ఎర్ర కందిపప్పు ఫౌడర్‌లో పాలు వేసి, నెయ్యి వేసి మంగు మచ్చలపై రాస్తే త్వరగానే ఉపశమనం లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa