మంత్రాలయం అంటే శ్రీ గురు రాఘవేంద్ర స్వామియే గుర్తుకు వస్తారు. మంత్రాలయము అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. రాఘవేంద్ర స్వామికి మరొక పేరు వేంకటనాథుడు. తిమ్మన్న భట్టు, గోపికాంబల రెండవ సంతానంగా వేంకట నాథుడు జన్మించాడు. మంత్రాలయం అసలు పేరు 'మాంచాలే'. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. ఆయన శ్రీ హరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి దైవసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి.రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది. రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుని మరో అవతారంగా భావిస్తారు. రాఘవేంద్ర స్వామి శ్రీరాముని మరియు పంచముఖ హనుమంతుడు యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు. ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. 1671 లో మంత్రాలయంలో స్వామి జీవ సమాధి చెందారు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంతో పాటు రాఘవేంద్ర స్వామి బృందావనం, సార్వభౌమ విద్యా పీఠం, మాంచాలమ్మ దేవాలయం, శివలింగం మరియు పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి.
పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం మంత్రాలయం నుండి 5కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడు ప్రధాన ఆరాధ్య దైవం. ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఉండటం. విగ్రహానికి గరుడ, నరసింహ స్వామి, హయగ్రీవ, హనుమాన్ మరియు వరాహ స్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ అయిదు తలలు ఉంటాయి. ఈ దేవాలయంలోని ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని ప్రతీతి. పంచముఖి అనగా ఐదు ముఖాలు కలవాడు అని అర్థం. పంచముఖాలు కలిగిన దేవుళ్ళ ఆలయాలు చాలా అరుదుగా కనబడుతాయి. పూర్వనామం గాణదాల అనే పేరు కలిగిన పంచముఖి గ్రామం కర్నాటక లోని రాయచూరు జిల్లాలో తుంగభద్రా నదికి ఇటువైపు మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ కి చెందినది. అటువేపు గాణదాల కర్ణాటక రాష్ట్రానికి చెందినది. చుట్టూ కొండలు, అందమైన ప్రకృతి, సమీపంలో తుంగభద్రా నదితో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఈ ప్రదేశంలో హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ఇది పంచముఖిగా ప్రసిద్ది చెందినది. పంచముఖి ఆంజనేయుని విగ్రహం ఐదు ముఖాలు, పది ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంటాడు. పంచముఖ ఆంజనేయస్వామిగా కొలిచే అవతారంలో హనుమంతుడు, నరసింహుడు, గరుడుడు, వరాహుడు, హయగ్రీవుడు ఉన్నారు. హనుమంతుడు రావణుని సంహార సమయంలో పంచముఖి అవతారాన్ని ఎత్తారని ప్రసస్థి.
కంభరామాయణంలో హనుమంతుని గురించి చాలా చక్కగా వివరించారు. పంచభూతాలకి ప్రతి రూపం కూడా ఈ ఆంజనేయ స్వామి. గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు వీటిని తనలో ఇముడ్చుకున్నాడు. పవన తనయుడు, ఆకాశ మర్గాన సముద్రాన్ని దాటి ఆవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసుకుని అగ్నితో లంకాదహనం చేశాడు. అలాగే సుందరా కాండలో కూడా హనుమంతుని ధీర లక్షణాలను ఐదవ ఖండంలో చాలా చక్కగా వివరించారు. అలాగే పంచముఖ ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే ఆంజనేయుడు మనోభీష్టాలు తీర్చే వానిగాను, దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అభీష్ట సిద్ధిని, పడమర దిక్కుని చూసే మహావీరుడైన గరుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కుని చూసే వరాహ స్వామీ ధన ప్రాప్తిని, ఊర్థ ముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యాప్రాప్తిని అందిస్తారని ప్రతీతి. ఐదు రకాలైన భక్తి భావాలున్నాయి. నామం, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం. శ్రీరాముడిని హనుమంతుడు ఐదు రకాలుగా కొలుస్తాడు. ఎప్పుడూ శ్రీరామ నామం స్మరిస్తూర, కీర్తిస్తూ, రాముని కరుణ ప్రేమకై పరితపిస్తూ(యాచన)తనని తాను అర్పించుకున్నాడు. ఇంతటి శక్తివంతమైన, మహిమాన్వితమైన ఈ శ్రీ పంచముఖి ఆలయాన్ని తప్పక దర్శించవలసిన ప్రదేశం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa