హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో కొలువుదీరిన అమ్మవారు జ్వాలాముఖీ అమ్మవారు. ఈ అమ్మను భక్తులు జ్వాలాజీ, జ్వాలాదేవి, జ్వాలాముఖీదేవి అని పలు నామాలతో పిలుస్తారు. 51 శక్తిపీఠాలలో ఈ ఆలయమూ ఒకటి. సతీదేవి నాలుక ఈ ప్రాంతంలో పడింది. జ్వా అంటే అగ్ని. అమ్మవారు ఇక్కడ జ్వాలా రూపంలో ఉంటారు. సహజవాయువు వల్ల ఇక్కడి జ్వాల నిరంతరం మండుతూనే ఉంటుంది. ఎంత మండినా తరుగులేని విధంగా ఇక్కడ వాయువు వెలువడుతుంది. అదే అమ్మవారి మహిమ అంటారు భక్తులు. అమ్మ ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో ఉంటుంది. ఎప్పుడూ జ్వాల వెలుగుతూనే ఎలా ఉంటుందనేది ఒక మిస్టరీగానే ఉంది.
జ్వాలాముఖి ఆలయం గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒక పశువులకాపరి ఉండేవాడు. తన ఆలమందలో ఒక పశువు ఒట్టిపోయిన గొడ్డులా చుక్క పాలిచ్చేదికాదు. అంతకు ముందు వరకు కూడా సమృద్ధిగా పాలిచ్చిన ఆ ఆవు అకస్మాత్తుగా అలా ఎందుకైందో తెలియక ఒకసారి ఆ ఆవు వెంటే అడవులలోకి వెళ్ళాడు. ఈ ప్రాంతానికి ఆవు రాగానే ఒక బాలిక ఆ దట్టమైన అడవులలోంచి వచ్చి ఆవుపాలన్నీ తాగేసి జ్వాలారూపంలో కొండలోకి వెళ్ళిపోవడం గమనించాడు. అది గమనించిన పశువులకాపరి దేశాన్నేలే రాజువద్దకు వెళ్ళి తాను చూసిన విషయాన్ని నివేదించాడు. రాజుగారు కూడా పశువులకాపరి చెప్పిన ప్రాంతానికి వెళ్ళి పవిత్రజ్వాలను దర్శించుకున్నాడు. ఆ చోట ఆలయం కట్టి అర్చకులను నియమించి పూజలు చేయించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కాలంలో పాండవులు అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు. మొగల్‌సామ్రాట్ అక్బర్ కాలంలో జీవించిన ధ్యానూభగత్ రాజాహ్వానంపై అంతఃపురానికి వెళ్ళి జ్వాలాజీ గొప్పతనాన్ని వివరిస్తూ అమ్మ తలచుకుంటే ఏదైనా చేస్తుందని చెప్పాడు.
అందుకు అక్బర్ ఆ సమయంలో తన వద్దే ఉన్న గుర్రం తల నరికేశాడు. అమ్మసాయంతో దాన్ని తిరిగి అతికించి బతికించమని చెప్పాడు. భగత్ అమ్మను ప్రార్థించాడు. కానీ అమ్మ పలకలేదు. దాంతో భగత్ తన తలను కోసి అమ్మకు నివేదించాడు. దాంతో అమ్మ సింహవాహినిగా దర్శనమిచ్చి భగత్‌ను బతికించడమేకాదు గుర్రం తలను అతికించి బతికించింది. ఇక్కడికి వచ్చే భక్తులకు అమ్మ అనుగ్రహం కావాలంటే ఇన్ని కష్టాలు లేకుండా చూడాలని భగత్ కోరాడు. తన కోసం ఎవ్వరూ తలలు కోసుకోనక్కర్లేదని, తలలు బద్దలు కొట్టుకోనూ అక్కర్లేదని అమ్మ చెప్పింది. అంతటి త్యాగానికి బదులుగా కొబ్బరికాయ కొడితే చాలునని, వారిని అనుగ్రహిస్తానని చెప్పింది. ఇక్కడ అమ్మవారు మహాకాళిజ్వాలా, అన్నపూర్ణజ్వాలా, చండీమాతాజ్వాలా, హింగళా భవానీ జ్వాలా, వింధ్యవాసినీజ్వాలా, మహాలక్ష్మిజ్వాలా, మహాసరస్వతీజ్వాలా, మా జ్వాలీజీ, మా జ్వాలాజీ అని 9 రకాలుగా దర్శనమిస్తారు. 9 రకాల ఆకారాలతో, 9 రకాల రూపాలతో ఉండే ఈ అమ్మ ఒకొక్క రూపానికి ఒకొక్క రంగు ఉంటుంది. అమ్మవారి రంగు, శక్తికి తగ్గట్టే ఆమె ముందు మండే జ్వాల రంగులు మార్చుకుని, శక్తిని మార్చుకుని మండుతుంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ‘జై జ్వాలా మా’ అంటూ నినాదాలు చేస్తూ అమ్మవారిని కీర్తిస్తుంటారు. అయితే ఆలయంలో దీపం ఎలా వెలుగుతోందనేది మాత్రం ఒక మిస్టరీగానే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa