వలస కూలీల కోసం బస్సులు నడపాలని సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఈ విషయంపై చర్చించారు. ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న వలస కూలీలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోనున్నారు. వారి కోసం బస్సులు నడిపేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. బస్సుల్లో పాటించాల్సిన ప్రోటోకాల్స్ తయారు చేయాలని సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో తమ సొంత గ్రామాలకు ఎండలో వెళుతున్నవారిని చూసి చలించిపోయినట్లు తెలిపారు. నడిచి వెళుతున్న వలస కార్మికులు ఎక్కడ కనిపించినా బస్సుల్లోకి ఎక్కించుకోవాలన్నారు. వారిని రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలని తెలిపారు. వలస కూలీలను టికెట్లు కూడా అడగవద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్స్ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించారు. రెస్టారెంట్లు, మాల్స్‌లో క్రమంగా తిరిగి కార్యకలాపాలు మొదలయ్యేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ ఎగ్జిట్‌పై వైద్యపరంగా అనుసరించాల్సిన విధానాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు.