నర్సింగ్ వృత్తి గురించి మాట్లాడుకోగానే తొలుత గుర్తుకు వచ్చే పేరు ప్లోరెన్స్ నైటింగేల్. నర్సింగ్ వ్యవస్థకు ఆమె కేంద్ర బిందువు. తన విధి నిర్వహణలో ఎన్నో వేల మందిని కాపాడారు. తన సేవా దృక్పథంతో నర్సింగ్ వృత్తికే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది ఈ వృత్తిలోకి వచ్చారు. ఇంగ్లాండ్ దేశంలోని ఫ్లోరెన్స్ పట్టణంలో 1820 మే 12న ఓ సంపన్నుల కుటుంబంలో నైటింగేల్ జన్మించారు. ముందునుంచీ సామాజిక సేవ చేయాలన్న బలమైన ఆకాంక్ష కలిగిన నైటింగేల్ నర్సింగ్ వృత్తిని ఎన్నుకున్నారు. తల్లిదండ్రులు అందుకు అంగీకారం తెలపకున్నా ఆమె వెనకడుగు వేయలేదు. శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరిన కొన్నాళ్లకు ఇంగ్లాండ్‌లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో క్షతగాత్రులైన ఎంతోమంది సైనికులకు సపర్యలు చేశారామె. రాత్రిపూట లాంతరు పట్టుకుని ఆ వెలుతురులోనే యుద్ధ క్షేత్రంలోని క్షతగాత్రులను గుర్తించి సేవలందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగారు. యుద్ధం తరువాత కూడా మిలటరీ ఆసుపత్రుల్లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. రోగులకు సేవలందించేందుకు జీవితాంతం కృషి చేశారు. ఈ సేవలను మరింత విస్తృత పరిచేందుకు 1860లో సెయింట్ థామస్ ఆసుపత్రిలో నర్సింగ్ ఎడ్యుకేషన్ స్కూల్ ప్రారంభించారు. వృత్తిపరంగా ఆమె చూపిన నిబద్ధత, సేవా దృక్పథానికి గుర్తుగా ఆమె పుట్టిన రోజును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుతున్నారు.