డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య(1880 -1959)
Intro: తెలుగు జాతికి మణిపూసలైన మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఈ రోజు మనం -శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య- గురించి తెలుసుకొందాం…
భోగరాజు పట్టాభి సీతారామయ్య 1880 నవంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా గుండుగోలను గ్రామంలోనిరుపేదబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.పాలుగారే పసివయసులో ఒంటిమీద కనీసం చొక్కా కూడా లేకుండా చలికి వణుకుతూ బడికి వెళుతున్న పట్టాభిని చూసి గ్రామస్తులు జాలి పడేవారు.
తల్లిదండ్రులకు పుస్తకాలు కొనే స్థోమత లేకపోవడంతో తోటి విద్యార్థుల పుస్తకాలను చదివి, వాటినే రోజంతా మననం చేసుకునేవారు. ఇంటి ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లుగా మెసలుకోవడం ఆయనకు బాల్యం నుంచే అలవాటైంది. ఇంటికి కావలసిన కట్టెలు కూడా నెత్తిన పెట్టుకుని మోసుకొచ్చేవారు. అది చూసి నవ్విన తోటి విద్యార్థితో ‘నేను నా ఇంటి పనులు చేసుకోవడానికి సిగ్గు పడను. అనవసర భేషజాలకు పోయి డబ్బు వృథా చేయను. మీరు నవ్వినందున నాకొచ్చే నష్టం లేదు’ అని సమాధానమిచ్చిన ధీశాలి ఆయన. ప్రతిభా పాటవాలతో సంపాదించుకున్న ఉపకార వేతనంతో చదువు సాగించారు. తర్వాత పిల్లనిచ్చిన మామ సహాయంతో మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేసి, బందరులో ప్రాక్టీసు పెట్టారు. హస్తవాసి గల వైద్యుడిగా పేరుపొంది ఆ రోజుల్లోనే లక్షల ఆదాయాన్ని గడించారు.
ఒకరోజు సీతారామయ్య గారు వారింటి అరుగుపై కూర్చొని ఉండగా ఎదురుగా ఉన్న వైశ్యుల ఇంట్లో సోదరుల మధ్య గలాటా ప్రారంభమైంది. డబ్బు దాచడంలో వచ్చిన తగాదా అని తెలుసుకుని, తన దగ్గిర దాచడానికి అంగీకరించారు. అప్పటికప్పుడే వారి పేరు మీద ఖాతాలు ప్రారంభించి జమా ఖర్చులు రాశారు.అలా వీధి అరుగు మీద ప్రారంభమైన ఆర్థిక సంస్థ తర్వాత ఆంధ్రాబ్యాంకుగా అవతరించింది.బందరు ప్రముఖులు సమకూర్చిన లక్ష రూపాయల మూలధనంతో 1923 నవంబర్ 23న అధికారికంగా ఆంధ్రాబ్యాంకు ప్రారంభమైంది. ప్రజల నుంచి చిన్నమొత్తాలు సేకరించి రైతులకు రుణాలు ఇచ్చేవారు.1980లో ఆంధ్రాబ్యాంకును జాతీయం చేశారు.
తెలుగు గడ్డపై జన్మించిన ఏకైక జాతీయ బ్యాంకు ఇదొక్కటే. దేశంలోనే తొలిసారిగా 1981లోనే క్రెడిట్‌కార్డులను జారీ చేసిన ఘనత ఆంధ్రాబ్యాంకుదే. బయోమెట్రిక్ ఎటీఎంలు, విద్యా రుణాలను కూడా ఆంద్రాబ్యాంకే ప్రారంభించింది. నేడు దేశవ్యాప్తంగా 3 వేల శాఖలు, 30 వేల సిబ్బంది ఉన్నారు. లక్ష రూపాయలతో మొదలైన వ్యాపార ప్రస్థానం ఇప్పుడు లక్ష కోట్లను అధిగమించింది. డిపాజిట్ల సేకరణలో ఆసియాలోనే తొలి స్థానంలో ఉంది. సగం రుణాలను వ్యవసాయ రంగానికి కేటాయించి నేటికీ పట్టాభి స్ఫూర్తిని కొనసాగిస్తోంది.
ఆంధ్రాబ్యాంక్ తో బాటు ఈయన ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెని (1925), హిందు స్తాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనిలను కూడా స్థాపించారు. తరువాతి కాలంలో ఈ రెండు సంస్థలు ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి.
రాజకీయ ప్రస్థానం :
చదువు పూర్తైన తర్వాత మచిలీపట్నంలో డాక్టరుగా ప్రాక్టీసు చేస్తున్న సమయంలో గాంధీజీచే ప్రభావితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పట్టాభీ గాంధీజీకి అతి సన్నిహితంగా ఉండేవాడు. 1939లో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ అధ్యక్ష పదవికి అతివాద అభ్యర్ధి అయిన సుభాష్ చంద్రబోస్ కువ్యతిరేకముగా, మహాత్మా గాంధీ అభిమతానికి దగ్గరైన వాడిగా పట్టాభిని పోటీలో నిలబెట్టారు. అయితే నేతాజీ పెరుగుతున్న ప్రాబల్యం మరియు పట్టాభి స్వాతంత్ర్యానంతరం, తమిళ ఆధిపత్యమున్న కొన్ని జిల్లాలను భావి తెలుగు రాష్ట్రములో కలపటానికి మద్దతునిస్తున్నాడన్న భావన ఈయన ఓటమికి కారణమయ్యింది. పట్టాభి ఓటమి తన ఓటమిగా గాంధీజీ భావించి బాధపడ్డాడు. ఆ తరువాత మళ్ళీ 1948లో జరిగిన కాంగ్రెస్ అద్యక్ష ఎన్నికలలో పురుషోత్తమ్‌దాస్ టాండన్ పై గెలిచి స్వతంత్రభారత తొలి కాంగ్రెస్ అద్యక్షుడిగా అవతరించారు.అటు తరువాత 1952-57 కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా సేవలందించారు.దేశంలో యే మూల పని చేసిన ఆయన వేష, భాషల్లో ఎప్పుడూ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉండేది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదవి విరమణ తరువాత 1957లో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న తన కుమారుని వద్దకు వచ్చి అక్కడే కన్నుమూశారు. పట్టాభి ఒక స్వాతంత్య్రం సమరయోధుడే కాదు. ఆయన ప్రచురణకర్త. వైద్యవృత్తిని ప్రజా శ్రేయస్సుకోసం ఉపయోగించారు. ఆరోగ్యసూత్రాలతో పుస్తకం రాశారు. ఆర్థిక వ్యవహారాలను అధ్యయనం చేశారు.ఆంధ్రాబ్యాంక్ వంటి వ్యవస్థకు రూపకల్పన చేశారు. అవటపల్లి నారాయణరావుగారు (జర్నలిస్టు, చరిత్రకారుడు) పట్టాభి మేధాశక్తి, అందులోని ఆర్థిక కోణం నుంచి చూస్తూ ఒక చిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘‘పట్టాభిని ఎరిగినవాళ్లు ఆయన బ్రాహ్మణ శిరస్సు, వైశ్య హృదయం గల మనిషి అని చెప్పుకుంటారు.’’
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa