విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైన ఘటన పై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) సుమోటోగా కేసు స్వీకరించింది. గ్యాస్ లీకై 12 మంది మరణించగా 300 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఘటనకు దారి తీసిన కారణాలపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని సూచించింది.అదే విధంగా ఎల్జీ పాలిమర్స్ ప్రాథమిక నష్టపరిహారం కింద రూ.50 కోట్లను జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని ఎన్జీటి ఆదేశించింది. ఈ ప్రమాదం పై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ పీసీబీ, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి ఎన్జీటి నోటిసులు జారీ చేసింది.