డిమాండ్ తక్కువగా ఉండడం వల్ల ఆటో రంగ అమ్మకాలు మందకొడిగా ఉన్నాయి. సంవత్సరానికి 2.5 నుంచి 3 శాతం మాత్రమే పెరుగుదల నమోదుచేస్తూ మార్కెట్లో కొత్త కార్ల విక్రయాలు నిరుత్సాహ పరుస్తున్నాయి. మరోవైపు వాడిన కార్ల మార్కెట్లో 15 నుంచి 18 శాతం పెరుగుదల కనిపిస్తుంది. దాదాపు 5 సంవత్సరాల క్రితం వరకు కొత్త కార్ల కంటే వాడిన కార్ల అమ్మకాలు తక్కువగానే ఉండేవి. అయితే ప్రస్తుతం ఇందుకు భిన్నంగా పాతకార్ల మార్కెట్, కొత్త కార్ల మార్కెట్ కంటే దేశీయంగా1.3 రెట్లు, అంతర్జాతీయంగా 2.5 నుంచి 3 రెట్లు పెరుగుదలను కనబరుస్తుంది. పెరుగుతున్న పాత కార్ల మార్కెట్ల విక్రయాలకు అనుగుణంగా, వీటి కొనుగోలు కోసం రుణం తీసుకునే వారి సంఖ్య కూడా 12-18 శాతం పెరిగిందని బ్యాంకర్లు చెబుతున్నారు. మీరు కూడా వాడిన కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇందుకు రుణం తీసుకోవాలనుకుంటున్నరా? అయితే మీరు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పాత కారు కొనుగోలు చేయాలి
కారు క్వాలిటీ ఆధారంగా రుణం: కారు వినియోగం, ఎంత మంది ఉపయోగించారు, ఎన్ని సార్లు బదిలీ అయ్యింది, ఎంత మైలేజ్ తిరిగింది, అనే అంశాలపై కారు విలువ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఒక సంవత్సరం క్రితం ఒకే సమయంలో కారు కొనుగోలు చేశారు. అయితే ఒకవ్యక్తి రూ. 50 వేల కిలోమీటర్లు తిరిగితే, మరొక వ్యక్తి 10వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగాడు. తిరిగిన మైలేజీలో వ్యత్యాసం ఉండడం వల్ల కారు విలువలో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఈ కారణాల వల్ల కొత్త కారుకు వర్తించే వడ్డీ రేట్ల కంటే 100-250 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ వర్తిస్తుంది.
పత్రాలను పరిశీలించాలి: పాత కారు కొనుగోలు చేసేప్పుడు, దానికి సంబంధించిన పత్రాలన్నింటిని నిశితంగా పరిశీలించాలి. ఆర్‌సీ పుస్తకం క్లీన్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంస్థలు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడవు. అందువల్ల ఆస్తికి సంబంధించిన పత్రాలలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా సరైన విధంగా ఉంటేనే రుణం మంజూరు చేస్తాయి. రుణం ఇచ్చేందుకు ముందు అంతర్గత ప్రమాణాల ఆధారంగా కారుకు సంబంధించిన పత్రాలను, కారు విలువను విడివిడిగా అంచనా వేస్తారు.
కారు పాతదైతే రుణాలు ఎలా ఉంటాయి: సాధారణంగా 10 సంవత్సరాల పాతదైన కారుకు రుణం ఇవ్వరు. ఒకవేళ రుణం ఇచ్చినా వడ్డీ ఎక్కువగా ఉంటుంది. మీరు 2012లో తయారైన కారును కొనుగోలు చేస్తే, ఈ రోజుకు కారు వయసు 7 సంవత్సరాలు. రుణం తిరిగి చెల్లించేందుకు 3 సంవత్సరాల కాలవ్యవధి తీసుకుంటే, కాలవ్యవధి పూర్తయ్యే నాటికి కారు వయసు 10 సంవత్సరాలు ఉంటుంది. సాధారణంగా కంపెనీలు 8 సంవత్సరాల వరకు మాత్రమే అనుమతిస్తాయి. అయితే ఇది బ్యాంకుకు అనుగుణంగా మారుతుంటుంది.
కారు కొనుగోలుకు ముందు ఏం చేయాలి?: పాత కారును కొనుగోలు చేసే ముందు, కారు నాణ్యత, విలువ, పత్రాలు మొదలైన వాటిని తనిఖీ చేయండి. రుణం తీసుకోవాలనుకుంటే వడ్డీ రేట్లను తెలుసుకోండి. కొత్త కారు రుణ వడ్డీ రేట్ల కంటే పాత కార్లకు మంజూరు చేసే రుణాలకు ఎక్కువ వడ్డీ రేట్లు విధిస్తారు. అయిన్నప్పటికీ మీరు రుణం తీసుకోవాలనుకుంటే క్రెడిట్‌స్కోరు ఉపయోగించుకోండి. మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే తక్కువ వడ్డీ రేట్లతో రుణం మంజూరు చేయవలసిందింగా బ్యాంకులను కోరవచ్చు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa