ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీరని ఆయేషామీరా ఆత్మఘోష...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 27, 2020, 10:35 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007 డిసెంబర్ 27న అర్ధరాత్రి తర్వాత బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరాను హత్య చేసి హాస్టల్లో పడేశారు. 28వ తేదీ ఉదయం ఆయేషా మృతదేహాన్ని గుర్తించిన తోటి విద్యార్ధినులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పట్లో ఆయేషా మీరా హాత్య పెను సంచలనంగా మారింది. అయితే ఆయేషా మీరా హాత్యపై మాత్రం ఇప్పటికీ మిస్టరీ వీడలేదు. ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో ఆయేషా ఆత్మ ఘోషిస్తోంది. 12 యేళ్ల తర్వాత ఆయేషా మీరా మృతదేహానికి సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య ఆధ్వర్యంలో ఎనిమిది మందితో కూడిన వైద్యుల బృందం నాలుగు గంటల పాటు రీ పోస్టుమార్టమ్ నిర్వహించారు. సీబీఐ టీంలోని ఫోరెన్సిక్ బృందం సేకరించిన ఆధారాలు, అవశేషాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి శనివారం తరలించారు. రీపోస్టుమార్టమ్‌లో లభించిన ఆధారాలు, మృతదేహం నుంచి సేకరించిన అవశేషాలను అధికారులు ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి సీలు చేశారు. అయేషా మీరా హత్య కేసులో కీలకంగా ఉన్న ఎముకలు, పుర్రె చిట్లిన గాయాలను గుర్తించినట్లు తెలిసింది. అయేషా మృతికి కారణాలపై సీబీఐకి ఫోరెన్సిక్ బృందం నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా సీబీఐ తదుపరి విచారణను చేపట్టనుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో బీ ఫార్మసీ చదువుతున్న ఆయేషామీరా 2007 డిసెంబర్‌ 27వ తేదీ అర్థరాత్రి దారుణ హత్యకు గురైంది. దీంతో అప్పట్లో విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. అయేషా హత్య కేసులో దోషులకు శిక్ష విధించాలని డిమాండ్ చేశాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన సత్యంబాబును అనుమానించి 2008 ఆగస్టులో అరెస్టు చేశారు. పోలీసు దర్యాప్తు ఆధారంగా అయేషా హత్య కేసు విచారించిన విజయవాడ మహిళా సెషన్స్‌ స్పషల్ కోర్టు 2010లో సత్యంబాబుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై సత్యంబాబు హైకోర్టుకు వెళ్లారు. దీంతో 2017 మార్చి 31న సత్యంబాబును నిర్దోషిగా తేల్చి తీర్పు వెల్లడించింది. 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తరువాత సత్యంబాబు విడుదల అయ్యారు. దీంతో ఆయేషా మీరా హత్య కేసులో అసలు నిందితులకు శిక్ష పడలేదని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ప్రమేయంతో వాస్తవాలు బయటకు రాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో్ పిటిషన్ విచారించిన హైకోర్టు 2018 నవంబర్‌ 29వ తేదీ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో 2019 జనవరి నుంచి సీబీఐ ఆయేషా మీరా హత్యకేసు విచారణ ప్రారంభించింది. అందులోభాగంగానే శనివారం తెనాలి సబ్ కలెక్టర్ దినేశ్ కుమార్, తహసీల్దార్ రవిబాబు సమక్షంలో సీబీఐ ఫోరెన్సిక్ బృందం పోస్టుమార్టమ్ నిర్వహించింది. మరీ సీబీఐ విచారణలోనైనా అసలు హంతకులు బయట పడతారా..? ఆయేషా మీరాకు న్యాయం జరుగుతుందా..? లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa