కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్ సోకకుండా అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ ఇక్కడే ఓ సమస్య వచ్చి పడింది. దాదాపు నెల రోజులకు పైగా పనిపాట లేకుండా ఇంట్లోనే ఉండడంతో గృహహింస పెరిగిపోతుంది. ఆ దేశం ఈ దేశం అని లేకుండా అన్ని దేశాల్లో ఇదే సమస్య ఉంది. భర్తలు భార్యలను అనుమానించడం,కొట్టడం లేదా ఇంట్లో ఎక్కువ పని చేయించుకోవడం చేస్తున్నారట. కొంత మంది భార్యలు భర్తల ఫోన్లు చూసి నంబర్లు ఎక్కడివని, ఆమె ఎవరని ప్రశ్నిస్తున్నారట. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు పెద్దగా అవుతున్నాయట. అదే విధంగా ఆర్దిక ఇబ్బందులు,గతంలో జరిగిపోయిన విషయాలు ప్రస్తుతం చర్చించుకోవడం వల్ల కూడా గొడవలు జరుగుతున్నాయట. ప్రస్తుతం వైన్స్ లు,బార్లు బంద్ ఉన్నా అక్రమంగా మద్యం ఏరులై పారుతుంది. దీంతో కొంత మంది ఉదయం నుంచే తాగడం ప్రారంభిస్తున్నారట. ఇది కూడా గృహహింసకు కారణమవుతుంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ గృహహింసను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ప్రముఖంగా ఉన్న కుటుంబాలలో కూడా ఈ గృహహింస కొనసాగుతుందట. వారు వీరు అనే తేడా లేకుండా అన్ని ఇళ్లలో పంచాయతీలు అవుతున్నాయట. భార్య భర్తల మధ్యే కాకుండా అత్తా కోడళ్ల మధ్య మరియు ఆస్తుల కోసం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందుకే అంటారేమో ఎక్కడ ఉండే వాడు అక్కడే ఉండాలని. అదే విధంగా ఎంత దూరం ఉంటే అంత ప్రేమలు పెరుగుతాయని. మరీ దగ్గరైనా కష్టమేనన్న పెద్ద వారి మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. అదే విధంగా కొంత మంది ఒంటరి మహిళల వీక్ నెస్ ను ఆసరాగా చేసుకొని కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. యూపీలో ఓ రేషన్ షాప్ డీలర్ కామత్వాన్ని ప్రదర్శించాడు. ఒంటరిగా ఉన్న మహిళను చెరబట్టాడు. లాక్ డౌన్ కారణంగా 25 సంవత్సరాల మహిళ ఇంట్లో ఒంటరిగా చిక్కుకుపోయింది. ఆమె భర్త పనికోసం వెళ్లి పంజాబ్ లో చిక్కుకుపోయాడు. భర్త ఉన్నప్పుడు ఆయనే రేషన్ తీసుకొని వచ్చేవాడు. కానీ, భర్త పంజాబ్ లో చిక్కుకుపోవడంతో ఆమె రేషన్ కోసం వెళ్ళింది. భర్త పంజాబ్ లో చిక్కుకుపోయాడని అందుకే తాను వచ్చినట్టు చెప్పింది. ఆమె పై కన్నేసిన రేషన్ షాప్ డీలర్ రేషన్ ఇవ్వడం కుదరదని చెప్పాడు. దీంతో చేసేదిలేక ఆమె ఇంటికి వచ్చేసింది. మరుసటి రోజు ఆమె ఇంటికి డీలర్ వచ్చాడు. రేషన్ డోర్ డెలివరీ ఇవ్వడానికి అధికారులు అంగీకరించారని,తనకు దాహంగా ఉంది నీళ్లు కావాలని అడిగాడు. వంట గదిలోకి వెళ్లిన ఆ మహిళ పై రేషన్ డీలర్ అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమానులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో రేషన్ షాప్ డీలర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా ప్రస్తుతం వలస కూలీలు ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయారు. దీంతో కొంత మంది యజమానులు వలస కూలీలలోని మహిళల పై కన్నేసి వారిని వేధిస్తున్నారట. ప్రస్తుతం పని లేదు కాబట్టి తమ కోరిక తీరిస్తే కూలీ ఇస్తామని చెబుతున్నారట. కుటుంబాలతో పాటు పని చేసే ప్రదేశాల్లో మహిళల పై వేధింపులు కొనసాగుతున్నాయి. ఓ వైపు కరోనాను జయించడానికి దేశమంతా కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే..మరో వైపు ఇదే అదనుగా భావించిన కొందరు దుర్మార్గులు మహిళలు, అమ్మాయిలు, బాలికలపై పలు దాడులకు పాల్పడుతున్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 16 వరకు జాతీయ మహిళా కమిషన్ కు అందిన 587 ఫిర్యాదుల్లో 239 ఫిర్యాదులు గృహహింసకు సంబంధించినవే. దీని పై స్పందించిన జాతీయ మమిళా కమిషన్ లాక్‌డౌన్ కారణంగా గృహ హింసపై ఫిర్యాదు చేయలేకపోయిన మహిళలు 7217735372లో వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. అదే విధంగా చైల్డ్ హెల్ప్‌లైన్ నంబరు 1098, మహిళా హెల్ప్‌లైన్ నంబరు 181 కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గృహహింస పెరిగిపోవడం పై రాష్ట్రాల సీఎంలు కూడా స్పందించారు. ముందుగా కేరళ సీఎం దీని పై స్పందించారు. కేరళలో గృహహింసను ఎదుర్కొనే మహిళలు 94000 80292 నంబరుకు వాట్సాప్ చేసి గృహహింస ఫిర్యాదులు చేయవచ్చని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వేదికగా ఆయన వెల్లడించారు. అదే విధంగా తెలంగాణలో వారు గృహహింసను ఎదుర్కొంటే డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏపీ సీఎం జగన్ ఓ అడుగు ముందుకు వేసి జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు. అనంతపురం – 8008053408, కర్నూలు – 9701052497, చిత్తూరు - 9959776697, కడప - 8897723899,కృష్ణ - 9100079676, ప్రకాశం - 9490333797, విజయనగరం - 8501914624, తూర్పుగోదావరి - 9603231497, పశ్చిమ గోదావరి - 9701811846, గుంటూరు – 9963190234, నెల్లూరు - 9848653821, విశాఖపట్టణం – 6281641040, శ్రీకాకుళం – 9110793708. వీటితో పాటు 181 నంబర్ కూడా అందుబాటులో ఉండనుంది. ఒక్క భారత్ లోనే కాదు. అమెరికా,ఫ్రాన్స్,ఇటలీ,జపాన్,జర్మనీ,ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా గృహహింస పేట్రోగుతుంది. అమెరికాలో జాతీయ గృహహింస నిరోధక సంస్థ హాట్‌లైన్‌కు రోజుకు సగటున 2 వేల కాల్స్ వస్తున్నాయి. అన్ని దేశాల సర్కార్ లు ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే తప్పా ఈ గృహహింస ఆగేలా లేదు. క్షణికావేశంలో గొడవలు జరిగి దంపతులు విడిపోతే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్దకంగా మారే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకముందే సర్కార్ మేల్కొనాల్సిన అవసరం ఉంది. వేలాది మంది మహిళలను ఈ విపత్తు నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa