ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తమ శ్రేణి సంపాదకులలో మణి కిరీటం-ముట్నూరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 23, 2020, 02:02 AM

శ్రీ ముట్నూరి కృష్ణారావు (1879 -1945)తెలుగు జాతికి మణిపూసలైన మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఈ రోజు మనం -శ్రీ ముట్నూరి కృష్ణారావు - గురించి తెలుసుకొందాం…ఆంద్రప్రదేశ్ లోని ఉత్తమ శ్రేణికి చెందిన సంపాదకులలో మణి కిరీటం వంటివారు శ్రీ ముట్నూరి కృష్ణారావు పంతులు. వేదాంతము, దేశభక్తి, సాహిత్యము త్రివేణి సంగమం ఆయన సంపాదకీయాలలో ఉరికెత్తుతూ తెలుగువారినిముంచెత్తుతూ ఉండేవి. హిమవన్నారము వంటి ఆయన రూపం, మంచు వంటి తెల్లని దుస్తులు ధరించి, తెల్లని తలపాగా చుట్టి ఆయన ఠీవిగా నడుస్తుంటే బందరులో ప్రజలు దారిలో తప్పుకోనేవారుట.శ్రీ ముట్నూరి కృష్ణారావు 1879 లో కృష్ణా జిల్లా దివి తాలూకా ముట్నూరు గ్రామంలో జన్మించారు. పుట్టిన వెంటనే తల్లిని పోగొట్టుకున్నారు. మరి కొంతకాలానికి బాల్యంలోనే తండ్రిని కూడా పోగొట్టుకున్నారు. పినతండ్రి పంచన చేరి ఆయన వద్ద పెరిగారు. ప్రాధమిక, ఉన్నత విద్య అంతా బందరులోనే గడిచింది. బందరులోని నోబుల్ కళాశాలలో ఎఫ్. ఏ కోర్సులో చేరారు. అక్కడ వీరికి ఉపాధ్యాయులుగా బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఉండేవారు. నాయుడి గారి ఉన్నత భావాలు, సంఘ సంస్కరణాభిలాష, దురాచారాల నిర్మూలన... మొదలైన భావాలు కృష్ణారావు గారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి.నాయుడు గారితో వీరు కూడా బ్రహ్మ సమాజం ఉపన్యాసాలకు వెళ్ళేవారు. అచిరకాలంలోనే మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. బందరులో విద్యాభ్యాసము తర్వాత కృష్ణారావు గారు మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో బి. ఎ. లో చేరారు. అక్కడే ఈయనకు పట్టాభి సీతారామయ్య సహాధ్యాయిగా పరిచయమయ్యాడు. సాహితీ వ్యాసంగం ఎక్కువ అవటం చేత డిగ్రీని పొందకుండానే 1903 లో బందరుకు తిరిగి వచ్చారు. కృష్ణా జిల్లా తరఫున వెలువడే కృష్ణా పత్రికకు 1903 లో సహాయ సంపాదకులుగా పని చేశారు.అలా పని చేసే సమయంలోనే 1905 లో గుంటూరు మండలం విడిపోయిన సందర్భంలో కొండా వెంకటప్పయ్యగారు గుంటూరు వెళ్లిపోవడంతో ఆనాటి నుంచి కృష్ణారావు గారు కృష్ణాపత్రికకు సంపాదకులయారు.ఆ పత్రిక అతి కొద్దికాలంలోనే ఆనాటి మరొక ప్రముఖ పత్రిక అయిన ఆంధ్రపత్రికకు పోటీగా తయారయ్యింది.పోటీని తట్టుకోలేక ఆంధ్రపత్రిక నిర్వాహకుడు అయిన శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు కృష్ణారావు గారికి నెలకు 500 రూపాయల జీతాన్ని ఆశగా చూపి, తన పత్రిక వైపు ఆకర్షించుకోదలచారు. కానీ, కృష్ణారావు గారు ఆయన చూపిన ఆశలకు లొంగలేదు, కృష్ణాపత్రికలోనే కొనసాగారు. మరొకవైపు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కృష్ణాపత్రికను ఒక రాజకీయ పత్రికగా మార్చాలని విశేష ప్రయత్నాలు చేసారు. కానీ, కృష్ణారావు గారు కృష్ణాపత్రికను ఒక సాహిత్య పత్రికగా కొనసాగిస్తూ, మరణించే వరకూ ఆ పత్రికలోనే పనిచేసారు.అలా తెలుగు భాషపట్ల, తెలుగు సాహిత్యంపట్ల ఆయన తన ప్రేమను చాటుకున్నారు. 1907 నుండి 1945 వరకు, అనగా 38 సంవత్సారాలు ఒక వ్యక్తి ఒక పత్రికకు సంపాదకునిగా పనిచేయటం నేటికీ ఒక రికార్డు. కృష్ణా పత్రిక జాతీయోద్యమ కాలంలో చురుకుగా వ్యవహరించింది. ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యతను శ్రీ ముట్నూరి ఒక తపస్సుగా పరిగణిస్తూ పత్రిక నడిపేవారని పత్రికారంగ ప్రముఖులు చెబుతుంటారు. కృష్ణాపత్రికలో వచ్చే వార్తలపై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉండేదట. ఎడిటర్ అనే ఇంగ్లిష్ పదానికి తెలుగు మాటగా ‘సంపాదకుడు’ స్థిరపడిపోయాడు. ‘సంచార విజ్ఞాన సర్వస్వ’మనిపించుకున్న కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఈ మాటను తొలిసారి ప్రయోగించారంటారు. సంపాదకుడంటే, నిర్వచనంగానూ, నిదర్శనంగానూ కనిపిస్తారు కృష్ణారావు గారు.కృష్ణారావు గారు చాలా గంభీరమైన వ్యక్తి. కాని హాస్యోక్తులు విసురుతూ వుండేవారు.ఒకరోజు కృష్ణారావు గారు ఒక సంపన్న గృహస్తుని ఇంటికి అతిధిగా వెళ్ళారు. ఆ ఇంటి యజమాని పూజలో ఉన్నారు. పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత, ఆయన బయటకు వచ్చి ఆ పూజా జలాన్ని ఎక్కువగా కృష్ణారావు గారి శిరస్సు మీద చల్లారు. దానికి కృష్ణారావు గారు, "ఆయన నా మీద తీర్థం ఎక్కువగా ఎందుకు అభిషేకించారో తెలుసా! నా తల ఆయనకు ఒక శివలింగంగా కనబడటం వలన" అని అన్నారు. అక్కడున్న మిగిలిన మిత్రులు కడుపుబ్బ నవ్వారు. కృష్ణారావు గారిది పూర్తిగా బట్టతల. అందుచేతనేమో! ఆయన ఎప్పుడూ తలపాగాతో ఉండేవారు.ఒకసారి కృష్ణారావు గారికి అనారోగ్యం చేయటం వలన మిత్రులు ఆయనను వెంటనే ఒక హాస్పిటల్ లో చేర్చి, తరువాత వారి శ్రీమతికి కబురుపెట్టారట! ఆవిడ హాస్పిటల్ లో మంచం మీద ఉన్న కృష్ణారావు గారిని చూసి భోరున ఏడుపు లంకించుకుంది. అప్పుడు కృష్ణారావు గారు భార్యతో, "అప్పుడే రిహార్సల్ మొదలు పెట్టావా?" అని అన్నారట. అంత విషాదకర సన్నివేశాన్ని కూడా వినోదంగా మార్చిన సరస సంభాషణా చతురుడు కృష్ణారావు గారు. అటువంటి మహనీయుడు 1945లో తనువు చాలించారు.పత్రికల స్థాయి, ప్రమాణాలు తగ్గి, ప్రతి పత్రిక ఏదో ఒక రాజకీయ పార్టీకి కరపత్రంగా తయారయిన ఈ రోజుల్లో పత్రికా సంపాదకులు- -- సంపాదకులకు ఇంపారెడు గౌరవాన్ని తెచ్చిన కృష్ణారావు గారి నీతి , నిజాయితీలను ఆదర్శంగా తీసుకోవాలి. 'Journalism for sale' అని అప్రతిష్ట పాలైన పత్రికలు,శ్రీ కృష్ణారావు గారి నీతి, నిజాయితీలను ఆదర్శంగా తీసుకొని పత్రికల ప్రతిష్టను పునరుద్ధరించాలి అని కోరుకుందాం!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa