భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,985 కు చేరింది. అందులో 3260 మంది డిశ్చార్జ్ కాగా 603 మంది మరణించారు. కరోనా ప్రభావంతో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్ డౌన్ కాలంలో ఒక్కోక్కరిది ఒక్కో గాథ. తినడానికి తిండి లేక అల్లాడుతున్న వారు ఎందరో. స్వంత ఊరికి చేరాలనే ఆశతో తనువు చాలించిన వారు మరెందరో.పరిస్థితుల వల్లనో లేక కాలం కలిసిరాక విధి ఆడిన నాటకమో తెలియదు కానీ వారు వ్యభిచార రొంపిలోకి దిగారు. సాధారణ రోజుల్లో వారి ఏరియాలు నిత్యం విటులతో కిటకిటలాడేవి. వారు ఇచ్చే పదో పరకో వారికి ఆధారం. కొంత మంది ఇష్టం లేకున్నా కుటుంబం కోసం వ్యభిచార కూపంలోకి దిగిన వారున్నారు. చీకటి బతుకుల్లో వారి జీవితాలు నలిగిపోతున్నా బాధను దిగమింగుకొని, సమాజం ఛీ కొడుతున్నా పడుతూ బతుకుతున్నారు. అటువంటి వారికి లాక్ డౌన్ ఆకలి బాధను తెచ్చిపెట్టింది.ఢిల్లీలోని నజాఫ్ గఢ్ ప్రాంతం, కోల్‌కతాలోని కాళీఘాట్,బీహార్,ముంబైలలో రెడ్‌లైట్ ఏరియాలు వ్యభిచార పనులకు కేరాఫ్ అడ్రస్ లు. ఇప్పుడు అటువంటి ప్రాంతంలో వేశ్యలుగా మారిన మహిళలు మాకు బువ్వ పెట్టకున్నా మా పిల్లలకు ఇంత బువ్వ పెట్టండని వేడుకుంటున్నా కనికరించే వారు లేరు.గత నెల రోజులుగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో రెడ్ లైట్ ఏరియాల్లో వారి బిజినెస్ కొనసాగడం లేదు. వేశ్యల దగ్గరికి వెళితే కరోనా ఎక్కడ కాటేస్తుందోనని విటులు భయపడుతున్నారు. అదే విధంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించే వారు కూడా కరోనా భయంతో వారిని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు. రెడ్ లైట్ ఏరియా ప్రాంతాల్లో వారి ఇండ్లు చాలా చిన్నవి. కాళ్లు,తల తగిలేంత ఇరుకు గదుల్లో వారు జీవనం సాగిస్తుంటారు. వారికి రోజువారి డబ్బులే ఆధారం.‘ఇంట్లో నలుగురు పెద్దాళ్లం ఉన్నాం. 20 రూపాయలు పెట్టి కిలో గోధుమ పిండి కొని తెచ్చాం. కూరగాయల కొరత ఉంది. టమోటా, మిరప కాయలుండగా, గోధుమ రొట్టే పిల్లల తిండికే అయిపోయింది. నాకు రేషన్ కార్డు ఉంది. రేషన్ తెచ్చాను. అప్పుడే అయిపోయింది. అన్నం పంచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మేము ఎక్కడికి వెళ్లడం లేదు. తిండీ లేదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఆకలితో చస్తున్నాం’ అని ఢిల్లీ నజాఫ్ గడ్ రెడ్ లైట్ ఏరియా ప్రాంతానికి చెందిన సీమా అనే ఇద్దరు పిల్లల తల్లి ఓ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది.‘తాను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పటికీ ఎడారై ఎందరికో ఓయాసిస్....’ అయ్యేది వేశ్య అంటూ ఓ దివంగత కవి నాలుగు ముక్కల్లో వేశ్యల దుర్భర జీవితాన్ని కళ్ల ముందు ఆవిష్కరించారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో వారి జీవితాలు పూర్తిగా బుగ్గవుతున్నాయి. సాధారణంగానే వేశ్యలు అంటే సమాజంలో అందరికి చిన్నచూపు. వారు వివిధ కారణాలతో వేశ్య వృత్తిలోకి దిగుతుంటారు. కొందరు కుటుంబం గడవక వస్తే, మరికొంత మంది మోసం చేయడం ద్వారా వస్తుంటారు. ఇంకొంత మందిని దుర్మార్గులు కిడ్నాప్ చేసి వేశ్య గృహాలకు అమ్మడం ద్వారా వస్తుంటారు.వేశ్య గృహాలు ఉన్నాయని తెలిసినా వాటిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఆ ప్రాంతాల పరిధిలోని పోలీసులు, అధికారులు చోద్యం చూస్తూ గడుపుతున్నారు. వారు నిజంగా వారి విధి నిర్వహణ సరిగా చేస్తే అసలు వేశ్య గృహాలే ఉండవు. వారందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. సాధారణ రోజుల్లో వారే మత్తుగా భావించే విటులు నేడు వారిని దెయ్యాలలా చూస్తున్నారు. సర్కార్ ఇప్పటికైనా పటిష్ట చర్యలు తీసుకోని వేశ్యగృహాల్లో ఉన్న మహిళలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే వారు కళ్లముందే ప్రాణాలు వదిలే అవకాశం లేకపోలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa