భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,116 కు చేరింది. అందులో చనిపోయిన వారి సంఖ్య 519గా నమోదైంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 2,302 మంది కోలుకున్నారు. తెలంగాణలో 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. 21 మంది చనిపోయారు. ప్రస్తుతం 651 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో మొత్తం 647 పాజిటివ్ కేసులు నమోదు కాగా 65 మంది డిశ్చార్జ్ అయ్యారు. 17 మరణించారు. ప్రస్తుతం 565 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ కు నేటి నుంచి కొన్ని సడలింపులను కేంద్రం ఇచ్చింది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఎటువంటి సడలింపులు లేవని ప్రకటించారు. అయితే ఈ కరోనా పోరులో మరో కొత్త సమస్య వచ్చింది. ప్రధానంగా పట్టణాల్లో ఈ సమస్య ఘోరంగా ఉంది. చాలా మంది ఉపాధి నిమిత్తం పట్టణాలు, వేర్వేరు ప్రాంతాలకు వలస వచ్చి జీవిస్తున్నారు. వారు అద్దె ఇళ్లలో జీవనాలు సాగిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి లేకపోవడంతో వారు అద్దెలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అయితే కొంత మంది ఇంటి యజమానులు మాత్రం ఇవన్ని పట్టకుండా తమ అద్దె చెల్లించాల్సిందేనని కిరాయిదారుల పై ఒత్తిడి తెస్తున్నారు. ఓ వైపు పనులు లేక వారు పస్తూలుంటుంటే ఇంటి అద్దె ఎక్కడి నుంచి తేగలరు. ఈ అద్దెలు కట్టలేక చాలా మంది ఇండ్లు ఖాళీ చేసి మూట ముల్ల సర్దుకొని కాలినడకన వారి స్వగ్రామం బాట పట్టారు. వారు గ్రామాలకు వెళుతున్న క్రమంలో తినటానికి తిండి లేక నరకయాతన పడుతున్నారు. ఎంతో మంది తనువు చాలించారు. అయితే ఈ కిరాయి అనేది అడగకుంటే వారు ఉన్న ఇంట్లోనే ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా చాలా మంది చిన్నా చితకు పనులు చేసే మధ్య తరగతి వారు. కొన్ని సంస్థలు ఆర్ధిక ప్రభావం నేపథ్యంలో ఉద్యోగులను తొలగించడం జరిగింది. ఇప్పుడు వారి పరిస్థితి ఎటు అర్దం కాని స్థితి. చాలా కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. మరి కొన్ని కంపెనీలు 50 శాతం మాత్రమే వేతనాలు చెల్లించాయి. దీంతో మధ్య తరగతి జీవులు రూం రెంటు ఎలా కట్టాలి, ఇళ్లు ఎలా గడవాలి అని మదన పడుతున్నారు. ప్రస్తుతం కుటుంబమంతా ఇంటికే పరిమితమైంది. దీంతో ఎటు నుంచి చూసిన ఆదాయ వనరులు లేవు. గ్రామాలల్లో అయితే స్వంత ఇల్లు ఉంటది కాబట్టి ఎలాగోలా ఉన్నదో లేనిదో వేసుకొని తిని బతకొచ్చు. కారం నూనె వేసుకొని తిని బతికినా ఇంటి గుట్టు బయట పడకుండా బతకొచ్చు. కానీ పట్టణాల్లో పరిస్థితి అలా ఉండదు. ఏది కొందామన్నా 10 రూపాయలు కావాల్సిందే. అటు కడుపు నిండా తినలేకా ఇటు ఆకలిని చంపలేక అప్పులు చేసి మధ్యతరగతి జీవులు బతుకుతున్నారు. కరోనా దెబ్బ వల్ల అప్పులు ఇచ్చే వాళ్లు కూడా కరువయ్యారు. ఈ విపత్కర సమయంలో మనిషికి మనిషి సాయం అవసరం. ఇంటి యజమానులు మానవతా ధృక్పథంతో వ్యవహరించాల్సిన సమయమిది. పెద్ద మనస్సుతో తోటి మానవున్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పైసలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. కానీ మనుషుల మధ్య చేసుకున్న సాయం ఎప్పటికి నిలిచి ఉంటుంది. కాబట్టి ఇంటి యజమానులు కిరాయిదారులను అద్దె కోసం ఒత్తిడి చేయకుండా మానవతా ధృక్పధంతో వ్యవహరించాలి. కొంత మంది యజమానులు లాక్ డౌన్ కాలం వరకు రూం రెంట్ వసూలు చేయమని ప్రకటించారు. అందరూ యజమానులు అదే విధంగా ఈ లాక్ డౌన్ కాలానికి రూం రెంట్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. చాలా మంది విద్యార్దులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నారు. వారు లాక్ డౌన్ కారణంగా ఇంటికి రాలేకపోయారు. చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వారు మరియు కోచింగ్ లు తీసుకునే వారే ఎక్కువ మంది ఉన్నారు. వారందరికి కూడా ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. హస్టల్ వాళ్లు కడుపు నిండా అన్నం పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారికి ఖర్చు చెల్లించాల్సిందే. అయితే ప్రభుత్వం మానవతా ధృక్పథంతో ఈ 3 నెలల కాలానికి హాస్టల్లో ఉండే వారికి అయ్యే ఖర్చును చెల్లిస్తే బాగుంటుందని విద్యార్ది సంఘాల నాయకులు కోరుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మార్చి,ఏప్రిల్,మే నెలల అద్దెను వాయిదా వేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వాయిదాల రూపంలో అద్దెను చెల్లించాలన్నారు. ఇది ఏ మాత్రం ఉపశమనం కానీ అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి. ఈ 3 నెలల కాలానికి రూం రెంట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే అంతా హర్షించే వారేమో కానీ వాయిదా రూపంలో చెల్లింపులు అయినా అది సగటు మానవునికి భారమే తప్ప లాభం లేదు. ఎలాగంటే నెలకు రూ.4000 అద్దె అయితే 3 నెలల కాలం వాయిదా వేస్తే 12 వేల రూపాయలు అయ్యే అవకాశం ఉంది. అప్పుడు అంతా ఒకేసారి చెల్లించలేరు దీంతో అంతా అప్పో సప్పో చేసి ఇప్పుడే కడుతారు తప్ప వాయిదా వేయరు. ఇంట్లో ఉన్న యజమానులు ఊకూంటారా కడుతావా లేక రూం ఖాళీ చేస్తావా అని బెదిరిస్తారు. కావున తెలంగాణ సీఎం ప్రకటించిన నిర్ణయం వల్ల ఎటువంటి లాభం లేదు. అదే విధంగా చాలా మంది చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటూ అద్దె షాపులు పెట్టుకున్నారు. వారికి కూడా ఎటువంటి ఉపశమనం లేదు. లక్షలాది మంది రోడ్ల పై పడవద్దంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్చి,ఏప్రిల్,మే నెలలకు సంబంధించిన రూం అద్దెలను పూర్తిగా రద్దు చేయాలి. వ్యాపారాలు లేవు కాబట్టి షట్టర్ల కిరాయిలు కూడా రద్దు చేయాలి. అలా అయితే సామాన్యునికి కాస్త ఊరటగా ఉండొచ్చు. లాక్ డౌన్ ఇంకెంత కాలం కొనసాగుతుందో అన్న దాని పై స్పష్టత లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ మరికొంత కాలం సాగవచ్చని స్పష్టమవుతుంది. అందుకే ప్రభుత్వాలు మరోసారి రూం కిరాయిల పై ఆలోచించి వారికి ఉపశమనం కలిగేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే లక్షల కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో చితికి పోయి రోడ్డున పడే అవకాశం ఉంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa