కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. అయితే ఈ లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం అనేక రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం - మరణాలు సంభవిస్తుండడంతో లాక్ డౌన్ పొడిగించాలని రాష్ట్రాలే కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. శనివారం సాయంత్రంలోగా కొత్త మార్గదర్శకాలతో స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ పొడిగిస్తే కొన్ని పరిణామాలు చోటుచేసుకునే ప్రభావం ఉంది. భారత్ కన్నా వైద్యరంగంలో ఎంతో ముందున్న దేశాలు కరోనా వైరస్ తో వణికిపోతున్న సమయంలోనూ భారత్ మొద్దు నిద్ర వీడలేదని, కేవలం మీడియా ప్రచారం చేసిందే కానీ టెస్టులు చేయటంలో భారత సామర్థ్యాన్ని పెంచుకోలేకపోయిందని, వైద్యులకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. ఎంతో కీలకమైన 21 రోజుల లాక్ డౌన్ పూర్తయ్యే సమయానికి కూడా భారత్ లో రోజుకు 15వేల టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని, అదే ఇతర దేశాల్లో రోజుకు లక్షకు పైగా టెస్టులు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం టెస్ట్, టెస్ట్, టెస్ట్ అనే నినాదంతో పనిచేయాలని సూచించినా ఇప్పటికీ వైరస్ సోకిన వారికి, వారి సంబంధీకులకు టెస్టులు నిర్వహిస్తున్నారే కానీ హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించి, నిర్బంధ పరీక్షలు చేయలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పుడు మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించినా టెస్టుల సామర్థ్యం పెంచకపోతే పెద్దగా ప్రయోజనం ఉండదని, అప్పుడు కూడా పొడిగించే సాహసం ప్రభుత్వం చేయగలుగుతుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భారత్ పేదరికం, నిరుద్యోగం వైపు వేగంగా ప్రయాణిస్తోంది. ఏప్రిల్ తర్వాత లాక్ డౌన్ ను తట్టుకునే స్థితి ఇండియాకు లేదు. ఈ లోపే చేయాల్సినవన్నీ చేయాలి. లేదంటే అటు ఆర్థికంగానూ, ఇటు ప్రజారోగ్యం విషయంలోనూ రెంటింకీ చెడ్డ రేవడిలా పరిస్థితి చేయిదాటిపోతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. కర్నాటక సీఎం యెడియూరప్ప లాక్ డౌన్ ను మరో 15 రోజులపాటు పొడిగించాలని మంత్రులకు సూచించారు. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, గోవా, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని అంటున్నాయి. దేశ ప్రజలను కాపాడుకోవాలంటే లాక్ డౌన్ ను పొడిగించడం కన్నా వేరే మార్గం లేదని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో లాక్ డౌన్ పొడిగింపుకు ప్రభుత్వం మొగ్గుచూపడం లేదనే అంచనాలే నిజమయ్యాయి. ఇప్పటికే ప్రధానితో ఓసారి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలని కోరగా ఇవాళ సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మంత్రివర్గ కమిటీ సిఫార్సులు తీసుకున్నాక ప్రధాని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa