ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవ్యాంధ్ర నిర్మాణానికి కంకణబద్ధులమౌదాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 09, 2017, 12:12 AM

మహాసంకల్ప సభలో చంద్రబాబు 


కాకినాడ, మేజర్‌న్యూస్‌ : రాష్ట్ర విభజన జరిగిన, అన్యాయం, అవమానాలకు చెలరేగిన కసితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు నిశ్చయసంకల్పం చేపడదామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మహా సంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నవ్యాంధ్ర నిర్మాణానికి కంకణబద్ధులమౌతామని రాష్ట్ర స్ధాయి మహాసంకల్పం చేయించారు. అలాగే శాసన మండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా స్ధాయి సంకల్పాన్ని చేయించారు. ఈ సందర్భంగా స్ధానిక శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కాకినాడలో నిర్వహించిన మహాసంకల్పం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కాకినాడను దేశంలోనే ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచే విధంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని, ఇందుకు రైతులు రూ.40 వేల కోట్ల విలువ చేసే, 33,500 ఎకరాలు రైతులు ఉచితంగా ఇచ్చారని, ఇది జాతి గర్వించదగ్గ విషయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు జాతికి జీవనాడైన పోలవరం నుండి 2018 నాటికి పోలవరం ప్రోజెక్ట్‌ ద్వారా గ్రావిటీతో నీరు అందిస్తామని, 2019కి పూర్తి చేసి జాతికి అందిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో 14 శాతం అభివృద్ది సాధించామని ముఖ్యమంత్రి అన్నారు. వివిధ ప్రోజెక్ట్‌ల నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. పోలవరం ప్రోజెక్ట్‌పై 27 సార్లు సమీక్షలు నిర్వహించామని, 18 సార్లు క్షేత్ర సందర్శన చేసామని ముఖ్యమంత్రి తెలిపారు. పురుషోత్తపట్నం ప్రోజెక్ట్‌ను ఈ సంవత్సరం పూర్తి చేసి, ఆగస్టు 15 నాటికి ఏలేరు ప్రోజెక్ట్‌కు నీరు అందిస్తామన్నారు. ప్రపంచ సాగర దినోత్సవాన్ని పురష్కరించుకుని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో 70 శాతం సముద్రముందని, అపారమైన మత్స్యసంపద, పెట్రోలియం, గ్యాస్‌, ఖనిజ సంపద అధికంగా ఉందని, దీనిని సమాజానికి ప్రజలకు వినియోగిస్తే ఆర్ధికంగా ముందుకు పోవచ్చన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలన్నదే నా లక్ష్యమని ఇందుకు నా చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసంక్షేమానికే వినియోగిస్తానని సియం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24వేల కోట్లు రైతుల ఋణమాఫీ చేసిందని, ప్రతి డ్వాక్రా సంఘానికి 10 వేల ఋణం మాఫీ చేసి, వడ్డీని మాఫీ చేయడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆదాయం సంపాదించేలా వివిధ రకాల పనులు చేపట్టి, సహకారం అందిస్తుందన్నారు. 47 లక్షల మంది పేదలకు పింఛన్లు ప్రభుత్వం అందిస్తుందని, పేదలకు ఆహార రక్షణలో భాగంగా కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ ఐదు కేజీల బియ్యం, ప్రమాద భద్రత, ఐదులక్షల బీమా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతి కుటుంబానికి గ్యాస్‌ కనెక్షన్‌ అందించి, పొగరహిత రాష్టమ్రే లక్ష్యంగా గ్యాస్‌ భద్రత కల్పించామన్నారు. ఈ జిల్లాలో సగం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగిందని, మిగిలిన వాటిని కూడా బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం జరుగుతుందన్నారు. నీతివంతమైన పాలన ప్రజలకు అందించడం జరుగుతుందని, ఈ సంవత్సరం ఆరువేల కిమీ సీసీరోడ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలు, స్మశాన వాటికలు, వర్మీ కంపోస్టు యూనిట్లు నిర్మించడం జరుగుతుందన్నారు. ఎల్‌ఈడి బల్బులు పంపిణీ చేశామని, పంచాయతీల్లో రాబోయే సంవత్సరం పూర్తి ఎల్‌ఇడి బల్బులు అందజేస్తామన్నారు. తాగునీటి భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నామని, అన్ని పట్టణ ప్రాంతాలలో ప్రతీ ఇంటికి కుళాయిల ద్వారా నీరు అందిస్తామన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో 16వేల కోట్లతో 10లక్షల ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా రూపుదిద్దుతామని, అన్ని సిటీలను స్మార్ట్‌సిటీలుగా తయారుచేసి, దానిని ఉద్యమ స్ఫూర్తి చేసి, అభివృద్ధిలో ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పోర్టుల స్థాపనకు 16లక్షల కోట్ల రూపాయలతో ఎంఓయు చేయడం జరిగిందని, పరిశ్రమలు వచ్చినట్లైయితే ఆరులక్షల మందికి ఉద్యోగాలొస్తాయన్నారు. నిరుద్యోగ భృతి త్వరలో ప్రవేశపెట్టి యువతను ఆదుకుంటామన్నారు. పసుపు, మిరప, ఉల్లి వంటి పంటలకు ధర పడిపోతే మద్దతు ఇచ్చి ఆదుకున్నామని, భవిష్యత్తులో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేజోన్లు ఏర్పాటు ద్వారా ఆర్ధికాభివృద్ధి జరుగుతుందని అన్నారు. మోతుగూడెంలో కొత్త పిహెచ్‌సీకి విలీన మండలాల్లోని ఎర్రంపేటలో సిపిడబ్ల్యూస్కీమ్‌, నెల్లిపాకలో జూనియర్‌ కాలేజీ, చింతూరు/కూనవరంలో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఏజెన్సీ విలీన మండలాల్లో పనిచేయని 53 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లు పునరుద్ధరించేందుకు తొమ్మిది కోట్లు నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. గురువారం చేపట్టిన మహా సంకల్పాన్ని ప్రతీ ఒక్కరూ భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌లలా భావించి, పవిత్ర రాష్ట్ర పునర్మిణానికి అంకిత భావానికి ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించిన యువతీ, యువకుల బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించి, వీరి విజయం అన్నిటా రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అలాగే నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న, వివిధ మిషన్లు అమలులో విశేష కృషి చేసిన రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు ముఖ్యమంత్రి అవార్డులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, పౌరసరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కాకినాడ పార్లమెంటు సభ్యులు తోట నరసింహం, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎన్‌జివో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌బాబు, సెక్రటరియేట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపి డాక్టర్‌ పండుల రవీంద్రబాబు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నామన రాంబాబు, గుడా చైర్మన్‌ గన్నికృష్ణ, ఎమ్మెల్సీలు రవికిరణ్‌వర్మ, ఎ.లక్ష్మి శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావు, చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మీ, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, పులపర్తి నారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యారావు, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎన్‌.రామకృష్ణారెడ్డి, పెందుర్తి వెంకటేష్‌, డిసిసిబి చైర్మన్‌ వరుపుల రాజా, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, ముఖ్యమంత్రి కార్యదర్శులు, రాజమహేంద్రవరం మేయర్‌ పంతం రజనీశేషసాయి, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎ.మల్లిఖార్జున, జెసి-2 జె.రాధాకృష్ణమూర్తి, కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ ఆలీంబాషా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com