కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. చైనాలో మొదలైన వైరస్ 145 దేశాలకు విస్తరించింది. నిమిషాల వ్యవధిలో అయా దేశాల్లో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. శవాలను ఖననం చేసేందుకు వారి బంధువులు క్యూలో నిలబడుతున్నారు. ఈ పరిస్థితి ఇటలీలో మరింత భయంకరంగా ఉంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్న పిల్లలు. భర్తలను కోల్పోయి వితంతువులు అవుతున్న మహిళలు. ఇలా ఏటు చూసిన చైనా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ వంటి దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో కుటుంబాలు చిద్రమౌతున్నాయి. ఇంతటి భయానక పరిస్థితులను ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నాం. మన దేశంలో కూడా ఢిల్లీలో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులను క్వారంటైన్ లో ఉంచి డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా కరోనా వ్యాపించడంతో స్కూళ్లు, కళాశాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను ఈనెల 31 వరకూ మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు చలోక్తులు విసరడంపై పలు విమర్శులు వస్తున్నాయి. సీఎంలు కరోనాపై చాలా సింపుల్ గా కామెంట్ చేయడంపై సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. రాష్ట్రంలో గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కరోనా ఎక్కడిది.. ఒక్క ప్యారాసెటమాల్ వేసుకుంటే చాలని ప్రకటించారు. ఇలాంటి ప్రకటన చేసి ప్రజల్లకు దైర్యం కల్పించే పనిచేశారని చెప్పవచ్చు. ఈ ప్రకటన చేసిన నాలుగు రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బంద్ చేయడంతో ప్యారాసెటమాల్ పై పలు కామెంట్లు చేస్తున్నారు. ప్యారాసెటమాల్ వేసుకోకుండా ఎందుకు బంద్ చేస్తున్నారని, అసెంబ్లీ సమావేశాలను ఎందుకు కుదించారని సోషల్ మీడియాలో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.
అటు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కరోనా ను సింపుల్ గా తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. దీంతో సీఎం జగన్ అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ఏకంగా రమేష్ కుమార్ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ మీడియాలో కామెంట్ చేశారు. కరోనాకు ప్యారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుందని వెల్లడించారు. అంటే జ్వరానికి ప్యారాసెటమాల్, క్లీనింగ్ కు బ్లీచింగ్ పౌడర్ వాడితే సరిపోతుందని జగన్ మాటల్లో అర్థం. దీన్నిబట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల సీఎంలు కరోనాను చాలా సింపుల్ గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రపంచమంతా వణికి పోతుంటే వీరు ఎందుకు ఈ విధంగా ప్రకటనలు చేశారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కరోనాపై తెలుగు సీఎంలకు అవగాహన లేదా? వైద్యాధికారులు బ్రిఫీంగ్ ఇవ్వలేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సీఎంలకు అవగాహన లేకున్నప్పటికీ అధికారులు వారిని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. కానీ కరోనాపై వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు ఎన్నడు లేనంతగా పరిశోధనలు చేస్తున్నాను. జర్మనీ వాళ్లు వ్యాక్సిన్ ను కనుక్కున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ రేపో, మాపో ట్రయల్ రన్ గా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ప్రపంచమంతా సీరియస్ గా తీసుకుంటే మన సీఎంలు లైట్ గా తీసుకోవడంలో అంతర్యామేమిటని సోషల్ మీడియాలో పలు కామెంట్లు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సీఎం స్థాయి వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.