ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2020, 05:19 PM

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కరోనా కల్లోలం, విద్యార్థులకు పరీక్షల కారణంగా ఎన్నికలను ఇప్పుడే జరపొద్దని ప్రతిపక్షాలన్నీ కోరినా ఫలితం లేకపోయింది. హడావుడిగా ఎన్నికలకు రంగం సిద్ధమైంది. వీటికోసం పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వైసీపీ మినహా మిగతా పార్టీల నాయకులు ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. కరోనా వైరస్ అనుమానిత కేసులు పెరుగుతున్న సమయంలో ఎన్నికలు, ప్రచారంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. అలాగే కీలకమైన పదో తరగతి పరీక్షలను వాయిదా వేసి మరీ ఎన్నికలు జరపాల్సినంత అత్యవసర పరిస్థితి లేదని వారు గుర్తుచేశారు. కానీ ఎన్నికల నిర్వహణకే కమిషన్ నిర్ణయించింది. జగన్ ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలను ముగించాలనే ఉద్దేశంతో ఉంది. జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ఈనెల 21న జరుగుతుంది. 29న లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల కోసం ఈనెల 9న నామినేషన్ల పర్వం మొదలవుతుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 23 జరుగుతుంది. 27న ఓట్లను లెక్కిస్తారు. 27, 29 తేదీల్లో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలను ఎన్నికల రోజే వెల్లడించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలన్నీ మూడు వారాల్లో ముగించాలని నిర్ణయించడం పెను సంచలనం. బహుశా ఇలా ఏకధాటిగా ఎన్నికల నిర్వహణ ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదు. అధికార యంత్రాంగానికి ఇది తలకు మించిన భారం. కలెక్టర్ల నుంచి పోలింగ్ డ్యూటీ చేసే టీచర్లు, ఇతర ఉద్యోగుల వరకు ఊపిరి సలపని పని ఒత్తిడి ఉంటుంది. అయినా జగన్ సర్కార్ ఎంపిటిసి, జడ్పిటిసి, పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు ఏకకాలంలో వెళ్లడానికి సిద్ధపడింది. దీనిద్వారా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల ఊపును ఈ ఎన్నికల్లోనూ కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ ఇప్పుడు ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డెందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఇప్పటికే చంద్రబాబు జిల్లాలను చుట్టేస్తున్నారు. మరోవైపు జనసేన- బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి... ఏపీలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను ఇప్పటికే మొదలుపెట్టింది. స్థానిక ఎన్నికలకు ముందు పలువురు టీడీపీ నేతలను పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ వేశారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నిన్న మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌తోపాటు మరో మాజీ ఎమ్మెల్యే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంకెవరు పార్టీని వీడతారో అని ఆలోచిస్తుండగానే... మరో ఇద్దరు టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి, దర్శికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. వీరిలో కదిరి బాబూరావు చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు కావడం మరో విశేషం. అయితే వైసీపీలోకి టీడీపీ నేతలు ఈరకంగా క్యూ కట్టడం వెనుక మరో ప్రధానమైన కారణం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో టీడీపీ నేతలను వైసీపీ తమ పార్టీలో చేర్చుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఎన్నికలకు ముందు నేతలు పార్టీని వీడటం వల్ల టీడీపీ ఆత్మరక్షణలో పడిపోతుందని వైసీపీ భావిస్తోంది. ఈ కారణంగానే టీడీపీ నుంచి వైసీపీలోకి ఉన్నట్టుండి చేరికలు మొదలయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని దెబ్బకొట్టేందుకు సీఎం జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే... మార్చి ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa