న్యూఢిల్లీ: అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుస్తుంది.. కళ్లు కూడా సరిగా తెరవదు.. ఇదే కదా అందరికీ తెలిసిన నిజం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో మాత్రం నమ్మశక్యం కాని విషయాన్ని కళ్లకు కడుతున్నది. అప్పుడే పుట్టిన ఓ పసికందు.. ఓ నర్స్ చేయి పట్టుకొని నడుస్తుండటం విశేషం. మే 26న ఫేస్బుక్లో ఈ వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పటికే 70 లక్షల వ్యూస్ వచ్చాయి. 15 లక్షల మందికిపైగా షేర్ చేశారు. మూడు లక్షలకుపైగా రియాక్షన్స్ వచ్చాయి. బ్రెజిల్‌కు చెందిన అర్లీట్ అరంటెస్ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ తీశారన్నది మాత్రం తెలియలేదు.
అయితే అప్పుడే పుట్టిన పసికందులు నడవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ అభిప్రాయపడింది. దీనిని స్టెప్పింగ్ రిఫ్లెక్స్ లేదా డ్యాన్స్ రిఫ్లెక్స్ అంటారు. గట్టి ఉపరితలానికి వాళ్ల కాళ్లు తొలిసారి తగిలినపుడు ఇలా చేస్తారని ఆ సెంటర్ వైద్యులు వెల్లడించారు. రెండు నెలల వరకు వాళ్లలో ఈ రిఫ్లెక్స్ ఉంటుంది.