ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమ్ముళ్లు తలోదారి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 01:49 AM

 అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : తెలుగు తమ్ముళ్లు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారు. స్వయానా అధిష్టానం హెచ్చరికలను సైతం బేఖాతలు చేస్తున్నారు. తమ్ముళ్ల లొల్లి పార్టీ నేతకు కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది. అంతర్గత విబేధాలతో సెగలు పొగలు రేగుతున్నాయి. నేతల మధ్వ సమన్వయం లేక కొత్త సమస్యలు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే మినీమహానాడు పూర్తి చేసు కుని 27 నుంచి విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహా నాడు పండుగకు ముస్తాబవుతున్న తరుణంలో పార్టీ నేతల తీరు అధినేతకు విసుగుపుట్టిస్తోంది. కాగా మంగళవారం జరిగిన ప్రకాశం జిల్లా అధ్యక్ష ఎన్నికలో మంత్రుల ఎదుటే ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్ర బాబుతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.


   వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు అంశంపై టీడీపీ నేతలు చేస్తున్న  వ్యాఖ్యలు పార్టీ అధ్యక్షునికి ఆగ్రహం తెప్పించాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసనసభ్యుడు రాధాకృష్ణ వ్యవహారంపై ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆగ్రహంతో ఉన్నారు. జిల్లా ఎస్పీకి వ్యతిరేకంగా, బహిరంగంగా గళం విప్పడంతోపాటు తనకు గన్‌ మెన్‌ అక్కర్లేదని తిప్పి పంపుతున్నామన్న ప్రకటన పార్టీ అధినేతకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ వారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో నేతలు అక్కడకు వస్తారని తెలుసుకున్న ఆయన ఎవరూ తనను కలిసేందుకు ఇక్కడకు రావద్దని మంత్రి ద్వారా సమాచారం పంపారు. మరోవైపు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితిని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే లు వివరించనున్నారు. అయితే అద్దంకి ఎమ్మెల్యే మాత్రం తాను ఏ తప్పు చేయ నందున ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఈ కేసులో తనదే తప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ భావిస్తే ఎమ్మెల్యే పదవిని సైతం త్యజిస్తానని రాధాకృష్ణ ప్రకటిం చారు.


తణుకు టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు 


  పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం ఎస్‌ఐ, రైటర్‌లను నిర్భంధించిన విషయంలో తణు కు టీడీపీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణపై పోలీసు కేసు నమో దైంది. ఇంటికి పిలిపించి నిర్భంధించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించి నందుకు ఐపీసీ సెక్షన్‌ 342, 353 రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. తణుకు రూరల్‌ పోలీస్‌స్టేషన్లో నమోదైన ఈ కేసులో ఎమ్మెల్యే రాధాకృష్ణను ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు. మరోవైపు తణుకు ఘటనపై పోలీసు అధికా రుల సంఘం కూడా సీరియస్‌ అయింది. పోలీసుల మీద దౌర్జన్యాలకు దిగు తున్న ఘటనలు పశ్చిమగోదావరిలో తరచు జరుగుతున్నాయని, తాజా ఘటనపై తాము ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్‌లతోపాటు శాసనసభ ఎథిక్స్‌ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 


నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం


  మరోవైపు విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌లు చేసిన వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సీనియర్‌ నేతలతో సమావేశమైన ఆయన పార్టీ నేతలు ఇష్టానుసారం నోరు జారవద్దని హితవు పలికారు. అలాగే ఇష్టానుసారంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించనని కూడా ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల్లో పొత్తుల అంశాన్ని పార్టీ అధిష్టానం చూసు కుంటుందని, కేంద్రమంత్రివర్గంలో మనం భాగస్వాములుగా ఉన్నామని, అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ నేతలు ఉన్నారని, నాయకులు పరస్పరం స్నేహభావంతో మెలగాలని సూచించినట్లు సమాచారం.


సొంత వ్యాఖ్యలు వద్దు


   పొత్తులపై పార్టీ నాయకులు ఎవరూ సొంత వ్యాఖ్యలు చేయవద్దని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బీజేపీతో పొత్తు లేకుంటే తన మెజారిటీ పెరిగేదని విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పు పట్టారు. కేంద్ర, రాష్ట్రాల్లో కలిసి ఉన్నపుడు రెండు పార్టీల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలని, పొత్తుల విషయం తాము చూసుకుంటామని స్పష్టం చేశారు. మిగిలిన నాయకులు ఎవరూ కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ భారతీయ జనతాపార్టీపై చేసిన వ్యాఖ్యలు కూడా సరికావన్నారు.


కడప టీడీపీలోనూ రచ్చ రచ్చ...


  ఇటీవల ప్రొద్దుటూరు, జమ్మలమడుగు టీడీపీలో రచ్చ చోటుచేసుకుంది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల అంతర్గత కలహాలకు కారణాలు తెలియడం లేదు. తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు కన్నెర్ర చేసిన వారి వైఖరిలో మాత్రం మార్పు రావడంలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని ఎలాగైనా కట్టడి చేయాలన్న బాబు ఆలోచనకు నేతలు విరుద్ధంగా వ్యవహరి స్తున్నారు. జగన్‌ కోటలో ఎక్కువ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకో వడం కోసం వ్యూహాలు పన్ని కడప జిల్ల తెలుగుదేశం నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. కానీ ఏ మాత్రం ప్రయోజనం కనిపించడంలేదు.  కడప జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అన్ని చోట్లా తెలుగుదేశం పార్టీకి ఇద ేపరిస్థితి.  కడప జిల్లాలో ఒకరు జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి, మరొకరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, పార్లమెంట్‌ ఇన్‌ఛార్జిగా నియ మితులైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముగ్గురు మంత్రులు జిల్లాలో తరచుగా పర్యటిస్తున్నా తమ్ముళ్లు మాత్రం రూటు మార్చుకోకపోవడం విశేషం.


తూర్పు జడ్పీపైనా జగడం...


   తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన 24 మంది జడ్పీటీసీ సభ్యులు నిరసనగళం వినిపిస్తున్నారు. జడ్‌పి ఛైర్మన్‌ పదవి నుంచి నామన రాంబాబును తప్పించి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్‌కు కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంక ట్రావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జడ్‌పీటీసీ సభ్యులకు నచ్చచెప్పేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు చేరింది. ఈ జిల్లా పరిషత్‌లో టీడీపీ సభ్యుల సంఖ్య 45కాగా 24 మంది జడ్‌పీ ఛైర్మన్‌ మార్పును వ్యతిరేకిస్తూ కళా వెంక ట్రావుకు లేఖ రాశారు. జడ్‌పీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలిచిన నవీన్‌ జిల్లా పరిషత్‌లో ప్రతిపక్ష నేతగా ఉండేవారు. గత ఏడాది ఆయన తండ్రితో పాటు టీడీపీలో చేరారు. 30 సంవత్సరాలుగా పార్టీలో ఉంటున్నాం...చిన్న కుర్రాళ్లప్పటి నుంచి వేరే పార్టీ వైపు చూడకుండా ఉంటున్న వారిని పట్టించు కోకుండా ఇటీవల పార్టీలు మారిన వారికి జడ్పీ పీఠం కట్టబెడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళాయని, కొందరి స్వార్థ రాజకీయాల వల్ల జిల్లాలో పార్టీ మనుగడ దెబ్బ తింటుందని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాని జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కూడా జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న నామన రాంబాబుకు కాకుండా వేరేవారికి ఇవ్వాలంటూ ఐ.పోలవరం జడ్‌పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్‌ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును కోరుతూ 24 మంది జడ్‌పీ టీసీల సంతకాలతో కూడిన లేఖను ఇచ్చారు. ఈ 24 మందితోపాటు మరో 10 మంది కూడా జడ్పీ ఛైర్మన్‌ మార్పును వ్యతిరేకిస్తున్నారని రాజశేఖర్‌ తెలిపారు.


ప్రకాశం అధ్యక్ష ఎన్నిక రసాభాస...


   తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి.  ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎన్నికల పరిశీల కులుగా వచ్చిన మంత్రులు నారాయణ, సునీత, శిద్ధా రాఘవరావుల సమక్షం లోనే వైరివర్గాలు తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు తమ్ముళ్ల కు బాబు ఏం దిశా నిర్దేశం చేస్తోరో వేచి చూడాల్సిందే మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com