ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారి డ్రెస్‌ పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 11:28 AM

ట్టావా: సాధారణంగా సరస్సులు, సముద్రాల్లో చేపలు, జలచరాలు కనబడగానే వాటికి ఏదో ఒక ఆహారాన్ని విసరడం మనలో చాలామందికి ఉన్న అలవాటు. మన చేతిలో ఉన్న ఆహారాన్ని చూసి అవి దగ్గరకు వస్తుంటాయి. కెనడాలోని వాంకోవర్‌లో కూడా కొందరు వ్యక్తులు ఇలాగే సముద్ర జీవులకు ఆహారాన్ని విసిరారు. అది కాస్తా బెడిసికొట్టి.. చిన్నారిని నీళ్లలోకి లాక్కెళ్లింది ఓ సముద్ర జంతువు. అసలేం జరిగిందంటే..





కెనడా వెస్టర్న్‌ కోస్ట్‌లోని స్టీవెస్టన్‌ సముద్ర తీరానికి కొందరు పర్యాటకులు వచ్చారు. అక్కడ సముద్ర అందాలను చూసేందుకు ఓ వంతెన లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. వంతెన సమీపం వద్ద ఈదుతున్న ఓ సీల్‌ను చూడగానే.. కొందరు వ్యక్తులు నీళ్లలోకి ఆహారాన్ని విసిరారు. అది చూసిన సీల్‌ వంతెన పక్కకు వచ్చింది. ఓ చిన్నారి నీటిలోకి చూస్తుండగా.. సీల్‌ చిన్నారి సమీపానికి వచ్చి ఎగిరి మళ్లీ వెంటనే వెనక్కి వెళ్లిపోయింది.


హమ్మయ్యా.. అనుకుని ఆ చిన్నారి వంతెనపై కూర్చుంది. ఇంతలోనే మళ్లీ వచ్చిన ఆ సీల్‌.. చిన్నారి డ్రెస్‌ పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది. ఇది చూసిన ఓ వ్యక్తి వెంటనే దూకి చిన్నారిని రక్షించి పైకి తీసుకొచ్చాడు. ఈ ప్రమాదంలో చిన్నారికి గానీ ఆ వ్యక్తికి గానీ ఎలాంటి హానీ జరగలేదు. వూహించని పరిణామానికి చిన్నారి కుటుంబం షాక్‌కు గురైంది. వెంటనే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఈ ఘటనంతా మైఖెల్‌ ఫుజివారా అనే వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయగా.. ఇది కాస్తా వైరల్‌ అయింది. ఆ చిన్నారి అదృష్టం బాగుంది అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేయగా.. మరికొందరేమో విమర్శలు చేస్తున్నారు. ఆహారం వేసి వాటికి అలా ఆశచూపించడం ప్రమాదమని, చిన్నారి డ్రెస్‌ను కూడా తినే పదార్థం అనుకుని సీల్‌ లాక్కెళ్లి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com