ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండో- రష్యన్‌ అణుబంధం మరింత పటిష్ఠం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 20, 2017, 02:38 AM

న్యూఢిల్లీ: ఇండియా- రష్యాల మధ్య పలు రంగాల్లో స్నేహ పూర్వక అనుబంధం కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతూనే ఉంది. చరిత్రలోకి వెళ్లి ఒకసారి చూస్తే 6 దశాబ్ధాల క్రితం ఇండియా అప్పటి సోవియట్‌ యూనియన్‌ల మధ్య పలు అంశాల్లో వ్యూహాత్మక ఒప్పందాలు  కుదురడంతోపాటు, రక్షణ, ఆర్థిక తదితర రంగాల్లో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. యుఎస్‌ఎస్‌ఆర్‌ కోట బీటలువారిన తరువాత రష్యాతో భారత్‌కు మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో భారత్‌ పలు పాశ్చాత్య దేశాలతో అనుబంధాలను మరింత దృఢం చేసుకుంది. కాగా ఇటీవలే వాణిజ్య కలాపాలు ప్రారంభించిన వెయ్యి మెగావాట్ల కూడంకుళం న్యూక్లియర్‌ వవర్‌ప్లాంట్‌ యూనిట్‌-2 కూడా ఇండో- రష్యన్‌ల స్నేహబంధం మధ్యనే రూపుదిద్దుకుంది. ఇది తమిళనాడులో ఉంది. ఇది 2017, మార్చి 31 నుండి కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో భారత్‌ 6780 మెగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తిని సాధించే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. కూడంకుళంలోని అణు విద్యుత్‌ ఉత్పాదక కేంద్రాన్ని పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్మించారు. ఎంతో కాలంగా ఇండో- రష్యన్‌ల మధ్య రక్షణ, పౌర అణు ఇంధన శక్తి, ఉగ్రవాద నిర్మూలన, స్పేస్‌ టెక్నాలజీ రంగాల్లో పటిష్టమైన అనుబంధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఆర్థిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య గల అనుబంధంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. అలాగే 2025 నాటికి 30 బిలియన్‌ డాలర్ల మేరకు దె్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. దీనికితోడు ఇరు దేశాలు పలు అంతర్జాతీయ సంస్థలలో సభ్యభాగస్వామ్యం కలిగిఉన్నాయి. ఫలితంగా పలు అంశాల్లో ఒకే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య  సమితి, బ్రిక్స్‌, జి20, ఎస్‌సిఓ కూటములలో భారత్‌, రష్యాలు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని కలిగిఉన్నాయి. అదేవిధంగా యునైటెడ్‌ నేషన్స్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని రష్యా ఎప్పటి నుండో విజ్ఞప్తి చేస్తోంది. దీనికితోడు సార్క్‌కు వ్యవస్థాపక సభ్యత్వదేశంగా ఉన్న భారత్‌కు మద్దతు పలుకుతూ, సార్క్‌లో పర్యవేక్షణ హోదా కలిగిన దేశంగా చేరేందుకు రష్యా ఆసక్తి చూపిస్తోంది. భారత్‌, రష్యాల మధ్య తొలిసారిగా పౌర అణు ఒప్పందం ఇంటర్‌ గవర్నమెంటల్‌ అగ్రిమెంట్‌(ఐజిఎ) 1988 నవంబర్‌లో కుదిరింది. దీనిపై రష్యన్‌ ఫెడరేషన్‌ సంతకం చేసింది.  అణు విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటులో సాంకేతిక సహాయం లక్ష్యంగా ఇరు దేశాల భాగస్వామ్యంతో ఐజిఎ ఏర్పాటైంది. కాగా ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌ - రష్యాల మధ్య భాగస్వామ్యాన్ని చారిత్రక ఘనతగా పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. భారత్‌కు రక్షణ రంగానికి సంబంధించి సలహాలు అందిస్తోంది. కాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న పౌర అణు విద్యుత్‌ భాగస్వామ్య సహకారం స్నేహ సంబంధాలను వెల్లివిరిసేలా చేస్తోంది. దీనికితోడు భారత్‌లో అణు విద్యుత్‌ ఉత్పత్తి శాంతియుత కార్యకలాపాలకు వినియోగమయ్యేలా చూడడంలో రష్యా ప్రధాన పాత్ర పోషిస్తోంది. రష్యా.. నాన్‌ ప్రొలిఫెరేషన్‌ ట్రీటీ(ఎన్‌పిటి), న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌(ఎన్‌ఎస్‌జి)లలో సభ్యదేశంగా ఉంది. ఈ నేపధ్యంలో రష్యా భారత్‌ను ఎప్పడు తప్పుపట్టలేదు. భారత్‌ 1998లో అణు ప్రయోగం చేసినప్పుడు కూడా రష్యా భారత్‌కు మద్దతు పలికింది. ఇదిలా ఉండగా 1988లో సోవియట్‌ యూనియన్‌, భారత్‌లు రష్యన్‌ టెక్నాలజీతో రూపొందిన వెయ్యి మెగావాట్ల వివిఇఆర్‌ రియాక్టర్లను తమిళనాడులోని కూడంకుళంలో నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇద ఇరు దేశాలమధ్య సన్నిహిత సంబంధాలకు చిహ్నంగా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com