గుంటూరు-గుంతకల్లు రైలుమార్గం డబ్లింగ్‌

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:31 AM
 

   (అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి) : రాష్ర్టం అభివద్ధిలో మౌలిక సదుపాయాల పాత్ర కీలకం. అందులోనూ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకుని, పునాదుల నుంచి అభివద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్‌లో వీటికి మరింత ప్రాధా న్యం ఉంటుంది. మౌళిక సదుపాయాల్లో ముఖ్యమైన ప్రజారవాణాలో చవకైన, ప్రయాణికుల్ని వేగంగా గమ్యస్థానాలకు చేర్చే రైల్వే రంగం పాత్ర మరింత కీలక మైంది. అలాంటి రైల్వేలో గుంటూరు నుంచి గుంతకల్లు మార్గం 401.47 కి.మీ డబ్లింగ్‌, విద్యుదీకరణకు రూ.3,631 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల ఉపాధి అవకాశాలు మొదలుకుని, ప్రధాన నగరాలు, పట్టణాలకు రైళ్ల సంఖ్య, కనెక్టివిటీ పెరగడంతోపాటు పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివద్ధి చెందుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, గోవాతోపాటు రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి నేరుగా వేగంగా రావడానికి ఈ మార్గం ఎంతో ప్రయోజనకరం కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తికి ఐదేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. గుంటూరు-గుంతకల్లు మార్గం డబ్లింగ్‌, విద్యుదీకరణ పూర్తయితే గుంటూరు రైల్వే డివిజన్‌ అభివద్ధి పథంలో కొత్త పుంతలు తొక్కుతుంది. రైల్వేల ఆధాయం ప్రధానంగా సరకుల రవాణా మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అన్ని మార్గాల నుంచి ఆదాయం సుమారు రూ.500 కోట్లు ఉంది. ఈ మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు రెట్టింపు అవుతుందని అధికారుల అంచనా. బెంగళూరు, గోవా నుంచి ముడి ఇనుము ఎక్కువగా ఈ మార్గానే రవాణా అవుతున్నందున రైల్వే పెట్టే పెట్టుబడి కేవలం నాలుగు సంవత్సరాల్లోనే తిరిగి వస్తుందని భావిస్తున్నారు. గోవా ఓడ రేవు నుంచి మచిలీపట్నం వరకు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా విస్తరిస్తాయని వివరిస్తున్నారు.


నవ్యాంధ్ర రాజధానికి...


  రాయలసీమ జిల్లాల నుంచి నవ్యాంధ్ర రాజధానికి వచ్చే ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది. ప్రస్తుతం ఒకేలైను ఉన్నందున ఎక్కువ రైళ్లు నడప లేకపోతున్నారు. అదేవిధంగా కొత్తగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించలేక పోతున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటున్నది. రెండవలైను, విద్యుదీకరణ పనులకు అనుమతి వచ్చినందున సూపర్‌ఫాస్ట్‌, ప్యాసింజర్‌, డెమో ఇలా పలు రైళ్లను నడిపేందుకు సౌలభ్యం ఏర్పడనుంది.


హైస్పీడ్‌ రైళ్లకు అవకాశం...


  గుంటూరు-గుంతకల్లు మార్గాన్ని ఎక్కువ వేగాన్ని తట్టుకునేలా పట్టాలను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రాయలసీమ జిల్లాల నుంచి రాజధాని అమరావతి మధ్య వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ పనుల అనుమతి కోసం రైల్వేశాఖపై ఒత్తిడి తెచ్చారు. ఈ మార్గం ప్రాధాన్యతను ద ష్టిలో ఉంచు కుని రైల్వే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇప్పటికే టెండర్లు ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే పనులను గుత్తేదారునికి అప్పగించేందుకు దస్త్రాన్ని సిద్ధం చేసి ఉంచారు. అనుమతి వచ్చే వరకూ వేచి ఉంటే నాలుగు నెలలు సమయం వృధా అయ్యేది. అదేవిధంగా నంద్యాల సమీపంలో 100 కి.మీ మేర అటవీ భూమి ఉంది. అక్కడే పెద్దపెద్ద సొరంగాలు తవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న సింగిల్‌లైనులో చలమ రైల్వే స్టేషన్‌ వద్ద ఇటువంటివి రెండు సొరంగాలు తవ్విన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. రిజర్వ్‌ఫారెస్ట్‌ ప్రాంతంలో పనులు చేయాలంటే కేంద్రప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీనికోసం ఇప్పటికే లేఖ కూడా రాశారు. అందువల్ల ఆ 100 కి.మీ మేర టెండర్లు పిలవకుండా నిలిపివేశారు. దీనికి రెండువ్కెపులా పనులు చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేనందున టెండర్లు పిలిచారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గాన్ని నిర్మించి, విద్యుదీకరించడానికి కేంద్రమంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 401.47 కి.మీ. మార్గం డబ్లింగ్‌ పను లకు రూ.3631 కోట్లు ఖర్చవుతాయని అంచనా. దీనిని రైల్వే మంత్రిత్వశాఖ, రాష్ర్టం చెరిసగం చొప్పున భరించనున్నాయి. అయిదేళ్లలో ఈ పనులు పూర్తవు తాయని సమావేశానంతరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ విలేకరులకు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిని రాయలసీమ ప్రాంతంతో అనుసంధా నం చేస్తూ రైలు మార్గం నిర్మిస్తామని పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దానిని ఇప్పుడు నెరవేరుస్తున్నారు. గుంటూరు-గుంతకల్లు మార్గం డబ్లింగ్‌ వల్ల ఇప్పటికే జరుగుతున్న సరకు రవాణాకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా దీనిని మరింత పెంచుకోవడం వీలవుతుంది. ఈ మార్గంలో గుంటూ రు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉంటాయి. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు ఇది అత్యంత దగ్గర దారి కానుంది.


వెంకయ్యనాయుడు హర్షం...


   గుంటూరు-గుంతకల్లు మధ్య డబ్లింగ్‌ పనులకు కేబినెట్‌ ఆమోదం లభించడం పట్ల కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మార్గం వల్ల రాయలసీమ ప్రాంత సామాజిక, ఆర్థికాభివద్ధికి వూతం లభిస్తుందన్నారు. పారిశ్రామికంగానూ వద్ధి చెందడానికి ఆస్కారం ఉందనీ, ఈ పనుల వల్ల 80.29 లక్షల పనిదినాల మేర ఉపాధి లభిస్తుందనీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల్ని తీర్చడానికి నరేంద్రమోదీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. విజయవాడను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివద్ధి చెందిం చేలా ఇటీవలి కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపామని గుర్తుచేశారు.