తాగు నీటి సమస్య పరిష్కారం కోసమే కాల్‌ సెంటర్‌

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:30 AM
 

త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి : మంత్రి నారా లోకేష్‌


విజయవాడ, మేజర్‌న్యూస్‌ : తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించేం దుకు వీలుగా ఈ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. జలవాణి కాల్‌ సెంటర్‌తో  త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ లో ముఖ్యమంత్రి ఆదేశాలననుసరించి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం విజయవాడ వుండవల్లి లోని తన  నివాసం లో జలవాణి కాల్‌ సెంటరును  ప్రారంభించారని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు.  ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా  చంద్రబాబునాయుడు గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్యల పరిష్కారం కోసం జలవాణి కాల్‌ సెంటరును రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌లో భాగంగా తీసుకురావాలని ఆదేశించారని , అందులో భాగంగానే జలవాణి కాల్‌ సెంటరును తీసుకువచ్చామన్నారు. గత 6 నెలల నుంచి ఈ కాల్‌ సెంటర్‌ ను పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నామని,అది విజయవంతం కావడంతో శుక్రవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా కాల్‌ సెంటరును పూర్తిస్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటి వరకు ఈ కాల్‌ సెంటరుకు 3,294 సమస్యలు వచ్చాయని అందులో 60 శాతం సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు.  ప్రింట్‌ మీడియా కథనాల ద్వారా 707 ఫిర్యాదులు స్వీకరించామని అందులో 453 పరిష్కారం లభించిం దన్నారు. 254 పనులకు సంబంధించి పనులు ప్రారంభించామన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా వచ్చిన వార్తల్లో 11 ఫిర్యాదుల్లో 9 పరిష్కరిం చామని, మరో రెండు ఫిర్యాదులకు సంబంధించి పనులు ప్రారంభమ య్యాయని తెలిపారు. ఇక జిల్లాల నుండి కాల్‌ సెంటర్‌కు 2576 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అందులో 1067 పరిష్కరించామని, 791 ఫిర్యాదులకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇతర శాఖలతో సమన్వయం త్వరగా పూర్తి చేసి సమస్యలను త్వరితంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు కాల్‌ సెంటర్‌ ద్వారా పరిష్కారం అయిన సమస్యల పై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజాభిప్రాయ  సేకరణలో 77 శాతం ప్రజలు నీటి సరఫరా బాగుందని, సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారన్నారు.  ఐవిఆర్‌ఎస్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామాల నుంచి వచ్చే కాల్స్‌ను తీసుకున్న అనంతరం మళ్లీ పర్యవేక్షణ ఉంటుందన్నారు. త్రాగునీటి సమస్యపై ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరిం చిన అనంతరం సమస్య తీవ్రతను బట్టి పరిష్కరించేందుకు కాలవ్యవదిని నిర్థేశించామన్నారు.  తాగునీటి సమస్యల తీవ్రతను భట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని అందుబాటులో ఉంచడం, బోర్‌వెల్స్‌ రిపేరు తదితరమైనవి అయితే  స్వల్ప వ్యవధిలో పరిష్కారం లభించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కాల్‌ సెంటరు ద్వారా వచ్చిన ఫిర్యాదులను వాటి  పరిష్కారానికి వచ్చిన నివేదికలు తగిన వ్యవధిలో పరిష్కరిస్తా మన్నారు. రాబోయే కాలంలో ఉపాధి హామీ పనులు, పెన్షన్లలను రియల్‌ టైమ్‌ గవర్నన్స్‌ కింద తీసుకురావాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని దాని ప్రకారం రాబోయే 2,3 నెలల కాల వ్యవధిలో వీటిని కూడా రియల్‌టైమ్‌ లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపినట్టు మంత్రి చెప్పారు. గ్రామాలలో నీటి సమస్య ఉన్నవారు కాల్స్‌ చేయాల్సిన ఫోన్‌ నెంబర్‌  వివరాలు అందించారు. ఫోన్‌ నెం. 1800 425 1899 కు ఫోన్‌ చేయాలన్నారు. ప్రతి రోజు ఇప్పటి వరకు 200 కాల్స్‌ వచ్చాయని ఇవి మున్ముందు 40 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో కాల్‌ సెంటరుకు వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు.