ప్రభుత్వంపై వంశధార నిర్వాసితుల ఆగ్రహం

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:22 AM
 

హిరమండలం, మేజర్‌న్యూస్‌: నష్టపరిహారం విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని వంశధార ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా ఉండేందుకు వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వద్ద బాధితులు తమ గోడును వెలబోసుకొన్నారు. మీకు అండగా ఉంటానని జగన్‌ ఈ సందర్భంగా నిర్వాసితులకు హామీ ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు కింద పరిహారం రూపేణా నూజివీడులో ఎకరాకు రూ. 52లక్షలు ఇస్తే, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు మాత్రం కేవలం లక్ష రూపాయలే ఇచ్చారని, వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను మరింత వెనక్కి నెట్టేస్తున్నారని నిర్వాసితులు వాపోయారు. శుక్రవారం నాడు వంశధార నిర్వాసితులతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వహించిన ముఖాముఖిలో పలువురు తమ సమస్యలను వెల్లడించారు. ఇళ్లు కూల్చేయాలని మంత్రి బెదిరిస్తున్నారని బాధితులు వివరించారు. ‘‘2004లో వైఎస్‌ వచ్చాక వంశధార ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి ఎకరాకు లక్ష చొప్పున నష్టపరిహారం ఇచ్చారు. ఆ తర్వాత పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలి’’ అని నిర్వాసితులు వాపోయారు. పట్టిసీమ నిర్వాసితులకు మాకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం ద్వంద్వ విధానం పాటిస్తోందని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు వాపోయారు. ‘‘మాకు ఎకరాకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు పట్టిసీమకు సంబంధించి నూజివీడులో ఎకరాకు 52 లక్షలు ఇచ్చారు. కేవలం శ్రీకాకుళం జిల్లా అని ఇలా వివక్ష చూపిస్తున్నారు. మేం కొనాలంటే ఇప్పుడు 15 లక్షలకు కూడా దొరకదు. ఇక్కడ ఉన్నవాళ్లంతా 2, 3 ఎకరాలున్న చిన్న, సన్నకారు రైతులే. రైతులంతా ఇప్పుడు కూలీలుగా మారిపో యారు. 2004 నుంచి ఇప్పటివరకు విడతల వారీగా ఇవ్వడంతో అవన్నీ ఖర్చయిపోయాయి తప్ప ఎవరిదగ్గరా పైసా లేదు’’ అని నిర్వాసితులు వాపోయారు.