పొగరహిత రాష్ర్టంగా నవ్యాంధ్ర

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:17 AM
 

(అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి): నవ్యాంధ్రప్రదేశ్‌ వచ్చే నెల 8 నాటికి పొగరహిత రాష్ర్టంగా అవతరించనుంది. మరో 17.50 లక్షల కుటుంబాలకు కొత్తగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేస్తే రాష్ర్టంలో 100 శాతం ఇచ్చినట్లవుతుందని పౌరసరఫరాల శాఖ తేల్చింది. ఈ మేరకు పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆ శాఖ కమిషనర్‌ రాజశేఖర్‌, సంచాలకుడు జి.రవిబాబు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి  విజయవాడ నుంచి జిల్లాల సంయుక్త కలెక్టర్లు, డీఎస్‌ఓలతో సమావేశం నిర్వహించారు. జిల్లాల్లోని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మంత్రి పుల్లారావు వివరాలు వెల్లడించారు. తెలుపు రంగు కార్డులున్న వారందరికీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉందా లేదా అనే విషయంపై క్ష్త్రేస్థాయిలో పరిశీలించి కొత్త కనెక్షన్లను జారీ చేయాలని నిర్ణయించారు. రేషన్‌కార్డు ఉన్నప్పటికీ ఉమ్మడి కుటుంబం, తల్లిదండ్రులతో కలిసి ఉండటం వంటి కారణాల వల్ల తమకు ప్రత్యేకంగా గ్యాస్‌ కనెక్షన్‌ అక్కర్లేదని చాలామంది వద్దంటుండగా, ప్రభుత్వం ఇచ్చే రాయితీపోగా మిగతా వ్యయాన్ని భరించలేమని మరికొందరు చెబుతున్నారు.


పశ్చిమగోదావరి, క ష్ణాలో పరిష్కారం చేశారిలా...


ఈ తరహా కారణాలతో కొత్తగా కనెక్షన్‌ వద్దనేవారు స్వయంగా ధ్రువీకరిస్తూ ప్రమాణపత్రాన్ని పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలనే నిర్ణయాన్ని పశ్చిమగోదావరి జిల్లా అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 1.58 లక్షల మంది కార్డుదారుల నుంచి ప్రమాణపత్రాలు సేకరించారు, మిగిలినవారికే కొత్త కనెక్షన్లు పంపిణీ చేశారు. దీంతో రాష్ర్టంలో వందశాతం గ్యాస్‌ కనెక్షన్లున్న మొదటి జిల్లాగా పశ్చిమగోదావరి అవతరించిందని మంత్రి పుల్లారావు ప్రకటించారు. రాయితీపోగా మిగతా సొమ్మును 5 సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించుకునేలా లబ్ధిదారులకు మండల మహిళా సంఘాలు, గ్రామైక్య సంఘాల ద్వారా రుణాలిచ్చేలా చేసి కష్ణా జిల్లా అధికారులు మరో పరిష్కారం చూపారు. ఈ రెండు పద్ధతులను రాష్ర్టవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా జూన్‌ 8 నాటికి వందశాతం గ్యాస్‌ కనెక్షన్ల లక్ష్యాన్ని సాధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


మరో 17.50 లక్షల కనెక్షన్లు


ప్రజాసాధికారిక సర్వే ప్రకారం గ్యాస్‌ కనెక్షన్లు లేవని గుర్తించిన 45 లక్షల గహాల వివరాలను జిల్లాలవారీగా తుది ఖరారు చేసేందుకు పౌరసరఫరాల శాఖ కలెక్టర్లకు పంపింది. ఇంటింటి సర్వే ద్వారా ఈ సంఖ్యను వడపోసే కార్యక్రమం చేపట్టారు. వీరిలో 1.50 లక్షల మందికి ఇప్పటికే కనెక్షన్లు ఇవ్వగా, మంజూరైన వాటిని అందజేస్తున్నారు. జిల్లాల్లో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన గ్యాస్‌ కనెక్షన్లు, ఇంకా ఇవ్వాల్సిన వాటి వివరాలను సమావేశంలో జిల్లాల నుంచి అధికారులు తేల్చిచెప్పిన గణాంకాల ప్రకారం మరో 17.50 లక్షల గ్యాస్‌కనెక్షన్లు పంపిణీ చేస్తే వందశాతం లక్ష్యం నెరవేరుతుందని తేల్చారు.


జూన్‌లో కిరోసిన్‌ లేదు


జూన్‌ 8 నాటికి 100శాతం గ్యాస్‌ కనెక్షన్లను ఇవ్వనున్న నేపథ్యంలో జూన్‌ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్‌ పంపిణీ చేయబోమని, ఆ నెల కోటా కూడా విడుదల చేయడం లేదని మంత్రి పుల్లారావు ప్రకటించారు. వచ్చే నెలలో రాయితీపై చక్కెర పంపిణీ కొనసాగించే విషయంపై నేడో రేపో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. రేషన్‌ డీలర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను కల్పించేందుకు రాజస్థాన్‌ తరహాలో బియ్యంతోపాటు ఇతర సరకులను అమ్మించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.