అమెరికాలో హాట్‌ టాపిక్‌ ఇదే!

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:01 AM
 

అణుబాంబు దాడుల నుంచి రక్షణ ఎలా?


వాషింగ్టన్‌ : అమెరికాలో ఎవరిని కదిలించినా, ఎక్కడ చర్చ జరిగినా ఉత్తర కొరియా గురించిన టాపిక్కే ఉంటోంది. తాజాగా, ఉత్తర కొరియా న్యూక్లియర్‌ క్షిపణిని ప్రయోగించిన అనంతరం అమెరికన్లలో అణు బాంబుల భయం పెరిగిపోయిం దని అమెరికాలో ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రాబర్ట్‌ లెవిన్‌ చెబుతున్నారు. అయితే, దురదృష్టవశాత్తు యుద్ధం వస్తే, ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు. అణు బాంబు నుంచి రక్షణ కల్పించుకునే విషయంలో ఇతర రాష్ట్రాల ప్రజల కంటే కాలిఫోర్నియా వాసులు ముందంజలో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అణు బాంబు దాడి జరిగినప్పుడు బంకర్లలో దాక్కునే అవకాశం అందరికీ ఉండదని చెప్పిన ఆయన, అలాంటి వారు ఇంటి నుంచి బయటకు రాకూడదని, ప్రధానంగా బాత్‌ రూమ్‌ నుంచి అస్సలు బయటకు రాకూడదని చెబుతున్నారు. తాము ఉంటున్న ప్రాంతానికి సమీపంలో బాంబు పడితే ఆలస్యం చేయకుండా వెంటనే దుస్తులు మార్చుకో వాలని సూచించారు. సబ్బుతో లేదా షాంపూతో గాని స్నానం చేయాలని తెలిపారు. ఇది అణు బాంబు ప్రభావం నుంచి దూరం చేస్తుందని ఆయన చెబుతున్నారు. అయితే, దీనిపై బ్రెయిన్‌ ఫ్లోవర్‌ అనే వ్యాపారవేత్త పెదవి విరుస్తున్నారు. అణు బాంబు దాడి ఏ క్షణంలో జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ఆ సమయంలో ఇంటిలోనే ఉంటామన్న గ్యారెంటీ కూడా ఉండదని ఆయన చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో 20 అడుగుల లోతులో స్టీలు షెల్టర్లను నిర్మించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇలాంటి స్టీలు షెల్టర్లు అమెరికాలో విరివిగా దొరుకుతున్నాయని ఆయన సలహా ఇస్తున్నారు. ఆ షెల్టర్లలోనే స్నానం చేసేందుకు షవర్స్‌ కూడా అందుబాటులో ఉంటాయని ఆయన చెబుతున్నారు. స్టీలు షెల్టర్లే న్యూక్లియర్‌ దాడుల నుంచి రక్షించగలవని ఆయన స్పష్టం చేస్తున్నారు.