హిందూ మతం స్వీకరిస్తా.. లేదంటే ఆత్మహత్యే శరణ్యం ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతిపై ముస్లిం మహిళ

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 01:59 AM
 

డెహ్రాడూన్‌ : ‘ఇక లాభం లేదు.. హిందూ మతం స్వీకరిస్తా.. లేదంటే ఆత్మహత్యే నా సమస్యకు పరిష్కారం’ అంటూ ఓ ముస్లిం మహిళ చేసిన వ్యాఖ్యలు ఆమె ఎంతగా నలిగిపోతోందో తెలుపుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఉద్దమ్‌ సింగ్‌ నగర్‌ గదార్‌పూర్‌లో ఆ మహిళకు ఆమె భర్త తలాక్‌ చెప్పి వెళ్లిపోయాడు. పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ కాపురం చేసి, మళ్లీ తలాక్‌ చెప్పి వెళ్లిపోయాడు. పోలీస్‌ స్టేషన్‌లో ఆ మహిళ ఫిర్యాదు చేయగా అక్కడకు విచారణ కోసం వచ్చిన సదరు భర్త పోలీసుల ముందు కూడా తన భార్యకు తలాక్‌ చెప్పి వెళ్లిపోయాడు. దీంతో జహాన్‌ అనే ఆ మహిళ  ఆవేదన వ్యక్తం చేస్తూ తన వ్యక్తిగత అనుభవాన్ని బట్టి హిందూ మతంలోకి మారిపోతే బాగుంటుందని అనిపిస్తోందని తెలిపింది. హిందూ మతంలో ఇలాంటి ఆచారం లేదని చెప్పింది. ఒకవేళ మతం మారే అవకాశం రాకపోతే కనుక తాను ఆత్మహత్యకైనా సిద్ధమేనని పేర్కొంది. తాను ఇప్పటికే చాలా బాధలు పడ్డానని, ఇక తన వల్ల కాదని వాపోయింది.12 ఏళ్ల క్రితం తనకు వివాహం జరిగిందని, తన భర్త పేరు ఆసిఫ్‌ అని చెప్పింది. తనకు తన భర్త నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేశాడని, అనంతరం మళ్లీ వచ్చి కాపురం చేసినా మళ్లీ తలాక్‌ అంటూ వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.