ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా వద్ద ‘ప్లాన్‌ ఏ’ ఉంది... ఫెయిలైతే ‘ప్లాన్‌ బి’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 20, 2017, 01:58 AM

న్యూఢిల్లీ : పాక్‌ చేతికి చిక్కి మరణ శిక్షకు గురికాబడిన మాజీ నేవీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఊరట పొంది న భారత్‌, ఇప్పుడు అతన్ని ఎలాగైనా భారత్‌ చేర్చాలని ఆలోచిస్తోంది. ఈ కేసు లో ఇండియా తరఫున వాదనలను సమర్థంగా వినిపించిన మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీష్‌ సాల్వే 46 ఏళ్ల జాదవ్‌ను విడిపించే విషయంలో తమ వద్ద రెండు ప్లాన్‌లు ఉన్నాయని తెలిపారు. తొలుత ప్లాన్‌ ‘ఏ’ను అమలు చేస్తామని, అది విఫలమైతే ప్లాన్‌ ‘బీ’ని అమలు చేస్తామని తెలిపారు. ప్లాన్‌ ‘ఏ’లో భాగంగా, న్యాయ మీమాంశను తెరపైకి తెచ్చి, తక్షణం జాదవ్‌ను విడుదల చేయాలని పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేస్తామని ఆయన అన్నారు. ఒకవేళ, ఈ మార్గంలో జాదవ్‌ విడుదల కుదరకుంటే, రెండో ప్రణాళిక అమలు చేస్తామని, అది దీర్ఘ కాలం సాగుతుందని, పాకిస్తాన్‌ కోర్టుల్లోనే విషయాన్ని తేల్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. జాదవ్‌ నిర్దోషిత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో నిరూపించే వీలు ఉండదని స్పష్టం చేసిన ఆయన, దాన్ని పాకిస్తాన్‌ కోర్టుల్లోనే నిరూపించాల్సి ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉన్న పరిమితుల దృష్ట్యా, జాదవ్‌ను ఇండియాకు అప్పగించాలన్న తీర్పు వచ్చే అవకాశాలు ఉండవని తెలిపారు. ఏది ఏమైనా జాదవ్‌ను తిరిగి ఇండియాకు తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తామని వెల్లడించారు.


మీ వైఖరితో దేశ పరువును తీశారు పాలకులను నిలదీస్తున్న పాక్‌ ప్రజలు


కుల్‌భూషణ్‌ జాదవ్‌ విషయంలో పాక్‌ పాలకుల వైఖరి కారణంగానే అంతర్జాతీయ న్యాయస్థానం ముందు పరువు పోయిందని ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాక్‌ జైలులో ఉన్న కుల్‌భూషణ్‌కు న్యాయ సహాయాన్ని అందజేయని కారణంగానే ఇండియా ఇంటర్నేషనల్‌ కోర్టుకు ఎక్కిందని, ఇక్కడే ఓ లాయర్‌ను ఏర్పాటు చేస్తే, ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు పాక్‌ వాసులు వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం మార్చిలో జాదవ్‌ను పాకిస్తాన్‌ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆపై దౌత్యాధికారులు అతన్ని కలిసేం దుకు అనుమతించాలని, ఓ న్యాయవాదిని ఏర్పాటు చేసి సాయపడేందుకు సహకరించాలని ఇండియా సుమారు 16 సార్లు విజ్ఞప్తి చేసింది. పాక్‌ ప్రభుత్వం జాదవ్‌కు న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్‌ ఆశ్రయించింది. అసలు జాదవ్‌కు న్యాయ సహాయం వద్దన్నది ఎవరు? ఆదిలోనే ఓ న్యాయవాదిని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని పాక్‌ హక్కుల కార్యకర్త అస్మా జహంగీర్‌ వ్యాఖ్యానించినట్టు ‘డాన్‌’ పత్రిక తెలిపింది. భారత జైళ్లలో ఎంతో మంది పాకిస్తానీలు మగ్గుతున్నారని గుర్తు చేసిన ఆమె వారి విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగలరా అని ప్రశ్నించారు. ఇదే విషయమై పాక్‌ ప్రముఖ న్యాయవాది యాసిర్‌ లతీఫ్‌ హమ్దానీ స్పందిస్తూ, జాదవ్‌కు మొదట్లోనే ఓ న్యాయవాదిని ఏర్పాటు చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ది హేగ్‌ కోర్టులో ఏ కేసూ ఎక్కువ కాలం సాగదని గుర్తు చేసిన ఆయన కేవలం 10 రోజుల్లోనే పాక్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా చూడడంలో ఇండియా సఫలమైందని, పాక్‌ న్యాయవ్యవస్థ వైఫల్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.


పాకిస్తాన్‌కు షాక్‌ తగిలింది: ‘డాన్‌’ పత్రిక


పాకిస్తాన్‌ ఆర్మీ కోర్టు మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తమ దేశానికి షాక్‌ తగిలినట్లు అయిందని పాక్‌ పత్రిక ‘డాన్‌’ పేర్కొంది. అంతర్జాతీయ న్యాయస్థాన నిర్ణయం తమ దేశానికి దిగ్భ్రాంతి, అసంతృప్తి కలిగించిందని తెలిపింది. అయితే, పాక్‌ ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షపై స్టే విధించే అధికారం ఆ న్యాయస్థానానికి లేదని పాక్‌ విశ్లేషకులు అంటున్నారని పేర్కొంది. పాకిస్తాన్‌ తరఫున వాదించిన వారు సమర్థంగా వాదనలు వినిపించలేకపోవడంతోనే ఆ తీర్పు ఇండియాకు అనుకూలంగా వచ్చిందని పేర్కొంటున్నారని ఆ పత్రిక తెలిపింది. అసలు అంత ర్జాతీయ న్యాయస్థానం ముందు హాజరై, తమ దేశం తప్పు చేసిందని పాక్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ షాయిఖ్‌ ఉస్మానీ అన్నారు. ఇక ఆ న్యాయస్థానంలో స్టే కొనసాగినంత కాలం జాదవ్‌కు మరణ శిక్ష అమలు చేయడానికి వీలు లేదని చెప్పారు. ఈ కేసులో తమ న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించలేకపోయారని ఆయన విమర్శించారు. ఐసీజే నిర్ణయానికి చట్టబద్ధంగా కట్టుబడాల్సిన అవసరం లేదని తమ దేశ విశ్లేషకులు భావిస్తున్నట్లు ‘డాన్‌’ తెలిపింది. అయితే, నైతికంగా మాత్రమే అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నారని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com