మమతా బెనర్జీనే బెస్ట్‌! పొగడ్తలు కురిపించిన రాష్టప్రతి

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 01:56 AM
 

కోలకతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. సమర్థమైన పాలనను మమత అందిస్తోందని కితాబు ఇచ్చారు. ఆరోగ్యం, విద్య, తదితర రంగాల్లో మమత ప్రభుత్వం అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోందని అన్నారు. వైద్య ఖర్చులను సామాన్యుడు భరించలేని స్థితిలో ఉన్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తిన వెంటనే మమత చాలా వేగంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. గత 50 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజకీయాల్లో తాను ఉన్నానని, రాష్టప్రతి అయిన తరువాత కూడా తాను చాలా సార్లు రాష్ట్రానికి వచ్చానని, తాను చూసిన గత ప్రభుత్వాల కంటే మమత ప్రభుత్వమే మెరుగైన పాలన అందిస్తోందని చెప్పారు. వయసులో తన కంటే చిన్నదైన మమతను తాను ఆశీర్వదిస్తున్నానని తెలిపారు. ‘ఎలాంటి చింత లేకుండా ముందుకు వెళ్లండి... ఆ భగవంతుడే మీకు సహాయం చేస్తాడు’ అని మమతను రాష్టప్రతి దీవించారు. కాలేయ వ్యాధుల కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ డైజెస్టివ్‌ సైన్సెస్‌ను గురువారం రాష్టప్రతి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మమత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్టప్రతి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.