భువితో కలిసి డిన్నర్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది

  Written by : Suryaa Desk Updated: Fri, May 19, 2017, 06:24 PM
 

హైదరాబాద్‌: ఐపీఎల్‌-10వ సీజన్‌ మధ్యలో జహీర్‌ఖాన్‌ బాలీవుడ్‌ నటి సాగరికతో తనకు నిశ్చితార్థం అయినట్లు వెల్లడించాడు. బాలీవుడ్‌ నటి అనుష్కతో విరాట్‌ కోహ్లీ ప్రేమలో ఉన్నాడు. ప్రస్తుతం ఇదే దారిలో ఉన్నాడు భారతజట్టు యువ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. తాజాగా భువి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్టు చేసి ‘రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేస్తున్న ఫొటో ఇది. డిన్నర్‌ డేట్‌.. పూర్తి చిత్రం త్వరలో’ అని పేర్కొన్నాడు. వెంటనే అభిమానులు ఎవరా లక్కీగర్ల్‌ అంటూ కామెంట్లు పెట్టారు.ఈ ఫొటోలో ఒకవైపు భువి కూర్చుని ఉండగా మరోవైపు ఎవరు కూర్చున్నారో సస్పెన్స్‌లో పెట్టాడు. ఇప్పుడు భువితో కలిసి డిన్నర్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్‌, టాలీవుడ్‌ నటి అనుస్మృతి సర్కార్‌. వీరిద్దరూ కలిసి కారులో వెళ్తూ అభిమానుల కంటపడ్డారు. ఇంకేముంది వారు వెంటనే తమ ఫోన్లకు పని చెప్పి ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో భువి లక్కీగర్ల్‌ ఈమె అంటూ వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. తెలుగులో ఈ భామ 2011లో వచ్చిన వంకాయ్‌ఫ్రై చిత్రంలో పూజ క్యారెక్టర్‌లో కనిపించింది. ఆ తర్వాత 2014లో ఇష్టసఖి, 2015లో హీరోయిన్‌ చిత్రాల్లో సందడి చేసింది. ఈ భామ ఇప్పటి వరకు నాలుగు బెంగాలీ చిత్రాల్లో చేశారు. ప్రస్తుతం ముంబయిలో మకాం వేసిన ఈమె బాలీవుడ్‌లో ఎంట్రీ కోసం వేచి చూస్తోంది. నాలుగు సినిమాలకు సంతకాలు చేసినట్లు సమాచారం.ఐపీఎల్‌-10వ సీజన్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ముంబయి చేతిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయి టోర్నీ నుంచి తప్పుకుంది. భువనేశ్వర్‌ సన్‌రైజర్స్‌ కు నేతృత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో 26వికెట్లు తీసిన భువి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.