ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిరప రైతుకు అభయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 18, 2017, 02:36 AM

(వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : రైతుల వద్ద మిగిలిపోయిన మిర్చిని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో యార్డుకు ముందస్తుగా ప్రకటించిన సెలవులను ప్రభుత్వం రద్దుచేసింది. వేసవి వడగాడ్పుల నేపథ్యంలో ఏటా మే నెల నుంచి సెలవులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మే నెల వచ్చేసరికి రైతులకు యార్డుకు తెచ్చే సరుకు తగ్గిపోవడం, ఎండలు పెరగడంతో సెలవులు ప్రకటించేవారు. ప్రస్తుతం యార్డుకు సెలవులు ప్రకటించినా 70వేల టిక్కీలు రావడం గమనార్హం. రైతుల వద్ద ఇంకా సరుకు మిగిలిపోవడంతో యార్డు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో కమీషన్‌ ఏజెంట్లు సహకరించి కొనుగోళ్లు చేస్తేనే రైతులకు అదనపు సాయం పథకం ప్రయోజనం రైతులకు అందుతుంది. దీనికితోడు యార్డు యంత్రాంగం అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు హమాలీలు ఎక్కువమంది పనులకు వచ్చేలా వారికి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఇదే సమయంలో యార్డులో చెత్త పేరుకుపోకుండా రోజువారీగా శుభ్రం చేసి యార్డును శుభ్రంగా ఉంచాల్సి ఉంది. ఎగుమతి వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు వెంటనే లోడింగ్‌ చేసి బయటకి తరలించడం, రైతుల తీసుకువచ్చిన సరుకు అన్‌లోడింగ్‌ చేసి దుకాణాల్లోనే నిల్వచేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు ప్రణాళికయుతంగా, రోజువారీ సమీక్షించుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటేనే ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది.


రైతుకు తోడ్పాటు అందిస్తేనే...


ఆసియాలోనే పెద్దదయిన గుంటూరు మిర్చియార్డులో రైతుల తెచ్చే మిర్చి కేంద్రంగా మొత్తం కార్యకలాపాలు జరుగుతున్నాయి. యార్డుకు తెచ్చే మిర్చి వల్ల కమీషన్‌ ఏజెంట్లు, ఎగుమతి వ్యాపారులు, హమాలీలు, యార్డులో పనిచేసే వివిధ విభాగాల సిబ్బంది, మార్కెటింగ్‌ శాఖ యంత్రాంగానికి మొత్తానికి రైతులు తీసుకువచ్చే మిర్చి ఆధారం. దీనిని దష్టిలో ఉంచుకుని రైతులకు అన్నివిభాగాల వారు సహకారం అందించాలి. రైతు ఇబ్బందుల్లో ఉన్నందున వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అదనపు సాయం పథకం అమలులోకి తెచ్చింది. దీనివల్ల రైతులకు లబ్ధి కలగాలంటే అందరూ పనిచేస్తేనే ఫలితం లభిస్తుంది. రైతుపై ఆధారపడి ఉన్నందున ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఆదుకోకుంటే రైతులు మిర్చి సాగు తగ్గిస్తే ఆప్రభావం అందరిపై పడుతుంది. ఈవిషయాన్ని గుర్తించి అందరూ రైతులకు సహకారం అందించాల్సి ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన కర్షకులు మార్కెట్‌కు తీసుకువస్తే అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కేంద్రంగా లబ్ధిపొందుతున్న యార్డు యంత్రాంగం నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టి వారికి తోడ్పాటు అందించాలి. ఈ సూేర్తిని పనిచేసేవారిలోనూ ఉన్నతాధికారులు నింపాలి. ఇందుకు యార్డులో పనిచేసే హమాలీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలి. జూన్‌ నెల తొలివారం వరకు ప్రత్యేక సదుపాయలు కల్పించడంతో పాటు రాత్రివేళ యార్డులో కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి.


అనుక్షణం అప్రమత్తం...


పగటి ఉష్ణోగ్రతలు 47డిగ్రీల వరకు నమోదవుతున్న నేపథ్యంలో యార్డు యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలి. యార్డులోని నీటిట్యాంకులో ఎల్లవేళలా సామర్థ్యం మేరకు నీటినిల్వలు అందుబాటులో ఉంచుకోవాలి. యార్డు మొత్తం రోజువారీగా శుభ్రం చేసి ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా చూడాలి. ఎగుమతి వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకును యుద్ధప్రాతిపదికన బయటికి తీసుకెళ్లేలా చూడాలి. రైతులు తెచ్చిన సరుకు దుకాణాల లోపల నిల్వచేసుకునే సౌకర్యం కల్పించాలి. యార్డు యంత్రాంగం దుకాణాల ముందు సరుకు నిల్వచేసుకోవడానికి అనుమతించిన ప్రాంతానికే టిక్కీలు పరిమితం చేయాలి. గీత దాటి టిక్కీలు నిల్వచేయకుండా చూడటంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో నీటిని విడుదల చేసే పైపులు ఉన్న ప్రాంతంలో టిక్కీలు లేకుండా చూడాలి. యార్డులో అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచుకోవడంతోపాటు ప్రతిక్షణం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. రైతులు ఇళ్ల నుంచి మిర్చి తెచ్చే క్రమంలో కొందరు పొటాష్‌ ఎరువుల సంచుల్లో కూడా తెస్తుంటారు. అలాంటి వాటిని గుర్తించి వెంటనే ఇతర సంచుల్లోకి మార్చుకోవాలి. ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటే క్రయవిక్రయాలు సజావుగా కొనసాగుతాయి. సెలవులు రద్దు చేసినందున కమీషన్‌ ఏజెంట్లు మొత్తం యార్డుకు వచ్చి క్రయవిక్రయాలు చేసేలా చూడాలి.


20లక్షల టిక్కీలపైగా నిల్వలు...


జిల్లాలో రైతుల వద్ద ఇంకా 20లక్షల పైగా టిక్కీలు నిల్వ ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మిరపకాయలను 40డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో శీతలగోదాముల్లో కాకుండా ఎక్కడ నిల్వచేసినా కాయలు నల్లరంగులోకి మారే ప్రమాదం ఉంది. దీనిని దష్టిలో ఉంచుకుని రైతులు యార్డుకు సరుకు తరలిస్తున్నారు. కిలో రూ.25ల నుంచి రూ.30లకే వస్తున్నందున వ్యాపారులు కొనుగోలు చేసి ఏరాష్ర్టంలో శీతలగోదాముల్లో ఖాళీ ఉంటే అక్కడికి తీసుకెళ్లి నిల్వచేస్తున్నారు. ఇంత తక్కువ ధరకు మిర్చి లభిస్తున్నందున భవిష్యత్తులో ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో కొనుగోళ్లు చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం అదనపు సాయం పథకం కింద క్వింటాకు రూ.1500లు ఇస్తుండటంతో రైతులు క్వింటా రూ.3వేలకు విక్రయించినా రూ.4500లు లభిస్తుందన్న భరోసాతో యార్డుకు వస్తున్నారు. రైతులు ఆత్మఈస్థైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే యార్డులో క్రయవిక్రయాలు కొనసాగిల్సిందే.


రికార్డుస్థాయిలో సరకు...


గతేడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ర్టవ్యాప్తంగా 19శాతం విస్తీర్ణం పెరగగా ఒక్క గుంటూరు జిల్లాలోనే ఈఏడాది 37శాతం మిర్చి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈసారి దిగుబడులు కూడా సగటున 27 నుంచి 29శాతం పెరిగాయి. దీంతో గుంటూరు యార్డుకు సరకు పోటెత్తింది. దీనికితోడు ప్రభుత్వం ప్రకటించిన అదనపు సాయం పథకం గుంటూరు యార్డులోనే అమలుచేయడంతో లక్షల టిక్కీల సరుకు వచ్చింది. యార్డులో ఖాళీ లేక పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో నిల్వచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యార్డు ఆదాయం రూ.65కోట్లు లక్ష్యం నిర్దేశించగా లక్ష్యాన్ని మించి రూ.66.07 కోట్లు ఆదాయం సమకూరింది.


ఈ సీజన్‌లో నెలవారీగా క్రయవిక్రయాలు ఇలా... 


(క్వింటాళ్లలో) (రూ.లక్షల్లో...) 


 జనవరి 5,74,077 405.86 


- పిబ్రవరి 9,71,028 331.88 


- మార్చి 9,77,298 1022.77 


- ఏప్రిల్‌ 9,43,776 523.43 


గుంటూరు మిర్చియార్డుకు వచ్చిన సరకు, ఆదాయం గణంకాల వివరాలు...


- ఈ ఏడాది సీజన్‌లో అమ్మకం జరిగిన మిర్చి: 43,18,452 క్వింటాళ్లు 


- గతేడాది సీజన్‌లో అమ్మకం జరిగిన మిర్చి : 32,29,693 క్వింటాళ్లు 


- ఈ ఏడాది యార్డుకు వచ్చిన ఆదాయం: రూ.66.07 కోట్లు 


- గతేడాది యార్డుకు వచ్చిన ఆదాయం: రూ.56.58 కోట్లు 


- అదనపు సాయం పథకం ప్రకటన తర్వాత జరిగిన మొత్తం కొనుగోళ్లు: 8,44,887 క్వింటాళ్ళు 


- రూ.1500లు పథకం కింద జరిగిన కొనుగోళ్ళు: 2,35,741 క్వింటాళ్లు 


- పథకం కింద ఇప్పటి వరకు లబ్ధి పొందిన రైతులు: 14,147 


- రైతులకు మొత్తం చెల్లించాల్సిన సొమ్ము: రూ.35.37కోట్లు 


- ఇప్పటి వరకు 2132 మంది రైతులకు రూ.5,04,79,262 కోట్లు జమ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com