స్నేహితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : మోదీ

  Written by : Suryaa Desk Updated: Fri, May 05, 2017, 07:10 PM
 

దిల్లీ : ఇస్రో చేపట్టిన చారిత్రక జీశాట్‌-9 ప్రయోగం విజయవంతమవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. ఈ ప్రయోగం భారత్‌ను దక్షిణాసియాలో నాయకత్వ స్థానంలో నిలిపిందని పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలకు ఈ ప్రయోగం ఎంతో ప్రయోజనకరమని అన్నారు.ఈరోజు దక్షిణాసియాకు చరిత్రాత్మక దినమని మోదీ పేర్కొన్నారు. స్నేహితులకు భారత్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. పరిధులు లేని స్నేహానికి ఈ రోజు నాంది పడిందని.. దక్షిణాసియా దేశాల మధ్య ఆకాశమంత సహకారానికి ఇది చిన్న నిదర్శనమని పేర్కొన్నారు. మన ప్రాంత ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈ ప్రయోగం చేపట్టామని వెల్లడించారు.దక్షిణాసియా దేశాల అభివృద్ధి కోసం ఓ ఉపగ్రహాన్ని తయారు చేసి కానుకగా ఇస్తామని గతంలో మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన , అప్గానిస్థాన్‌ అధ్యక్షుడు అప్రాఫ్‌ ఘని, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, నేపాల్‌ ప్రధాని ప్రచండ, మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.