బాబు బాగా బిజీ మూవీ రివ్యూ...బాబు బాగా స్లో..

  Written by : Suryaa Desk Updated: Fri, May 05, 2017, 03:14 PM
 

Rating: 2.5/5


బలం, బలహీనతలు:నెగిటివ్ పాయింట్స్  
కథ, కథనం
మ్యూజిక్
ఎడిటింగ్పాజిటివ్ పాయింట్స్:


కొంతలో కొంత అవసరాల, సుప్రియ యాక్టింగ్


మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ నటించిన, దర్శకత్వం వహించిన చిత్రాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయి. ఆయన ఎంచుకునే సినిమాలు కూడా అదే రుజువు చేశాయి. అలాడీసెంట్ ఇమేజ్ ఉన్న అవసరాల ఒక్కసారిగా రూట్ మార్చి అడల్డ్ రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తున్నారనగానే చాలా మంది ఒకరకమైన షాక్ గురయ్యారు. తాజాగా ఆయన ఎంచుకొన్న బాబు బాగా బిజీ అనేసినిమా బాలీవుడ్‌లో ఓ మోస్తారుగా ఆడిన హంటర్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం మే 5 తేదీ (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడల్ట్ రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకుఒప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..మాధవ్ (అవసరాల శ్రీనివాస్) చిన్నతనం నుంచి తుంటరి. స్కూల్ కెళ్లే వయసు నుంచే పెద్దలకు మాత్రమే లాంటి సినిమాలు చూడటం, స్వాతి వార పత్రికలో శృంగార సమస్యలకు పరిష్కారం లాంటి శీర్షికలు చదవడం అలవాటు. అలా పెద్ద పెరిగిన తర్వాత ఏ అమ్మాయి కనిపించినా వెంటపడటం, మచ్చిక చేసుకొని సుఖాన్ని పొందడం వెన్నతోపెట్టిన విద్య. కాలేజీ, రెంట్‌కు ఉంటే అపార్ట్‌మెంట్, పార్కులు, పబ్లిక్ ప్లేసులు, ఆఫీస్ ఇలాంటి ఏ ప్లేస్ అయినా అమ్మాయిలకు వల వేయడంలో నెంబర్‌వన్ మాధవ్. ఇలా అనేక విధాలుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. పెళ్లి అనేది జీవితంలో వేస్ట్ అనే భావనతో ఉంటాడు.
సమస్యలు.. పరిష్కారం..కానీ ఓ దశలో మాధవ్‌కు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఆ క్రమంలో పెళ్లి చూపులు తంతు మొదలవుతుంది. తన జీవితం గురించి నిజాలు చెప్పి వారిని ఆకట్టుకోవడంలో విఫలమవుతాడు. ఆ క్రమంలో ఓ అమ్మాయిని ఇష్టపడుతాడు. ఆ అమ్మాయికి అప్పటికే ఓ అఫైర్ ఉంటుంది. ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అవుతుంది. ఆ అమ్మాయికి నచ్చినా మాధవ్‌ను పెళ్లి చేసుకోవడంపై క్లారిటీ ఇవ్వదు. చివరికి ఆ అమ్మాయికి మాధవ్‌కు పెళ్లి అయిందా? మాధవ్ జీవిత ప్రయాణంలో చంద్రిక (సుప్రియ) అనే గృహిణి, డాన్సర్, పారు (తేజస్విని), శోభ (శ్రీముఖి)లు ఎదురుపడుతారు. వారితో మాధవ్‌కు ఎదురైన సెక్స్ అనుభవాలు ఏమిటీ? వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే బాబు బాగా బిజీ.
బలహీనమైన కథ, కథనం..అడల్డ్ రొమాంటిక్ కామెడీలో బలమైన కథ ఉంటే తప్ప టాలీవుడ్‌లో సక్సెస్ అయిన సినిమాలు చాలా తక్కువ. దేశవ్యాప్తంగా సంచలనం విజయం సాధించిన విక్కీ డోనర్ సినిమాను తెలుగు రీమేక్ రూపొందిస్తే ఫలితం ఏమైందో తెలుసు. హిందీలో హంటర్ మెట్రో కల్చర్ ఉన్న సినిమా. బాలీవుడ్‌ పరిధి, ఆ ప్రేక్షకుల అభిరుచి కొంత భిన్నమైనది కాబట్టి అంతో ఇంతో ఆదరించారు. టాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ చాలా ట్రేడిషనల్. కథ ఏ మాత్రం గీత దాటినా ఆమోదించడానికి ఇష్టపడరు. అలాంటి చరిత్ర ఉన్న టాలీవుడ్‌లో బాబు బాగా బిజీ లాంటి సినిమాను అటెంప్ట్ చేయడం సాహసమే. ఫ్యామిలీ లుక్ ఉన్న అవసరాలను ఎంచుకోవడం మరో సాహసం. ఇలాంటి సాహసాలను భుజాన ఎత్తుకొని సినిమా తీశారంటే కథను ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగానైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందేమో. కథ చెప్పే విధానం ఆసక్తిగా ఉన్నా ప్రేక్షకుడిని ఆకట్టుకునేదేమో. పాత్రల క్యారెక్టరైజేషన్ చాలా పేలవంగా ఉండటం, నేపథ్య సంగీతం, పాటలు అంత గొప్పగా లేకపోవడం ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది.
పాత్రల చిత్రీకరణ ఇలా..ఇక బాబు బాగా బిజీ సినిమా అడల్ట్ రొమాంటిక్ కామెడీ సినిమాగా ఊదరగొట్టారు. అదే ఆశతో ప్రేక్షకుడు తీరా సినిమాలోకి వస్తే కనీసం ట్రైలర్ చూసిన మజా కూడా చిత్రంలో కనిపించదు. సినిమా చూసిన తర్వాత కులం చెడ్డా సుఖం దక్కలేదనే అభిప్రాయంతో ప్రేక్షకుడు బయటకు రావాల్సిన పరిస్థితి. రాధ పాత్ర ఎంటో ఎవరికీ అంతుపట్టదు. శోభ (శ్రీముఖి) పాత్ర ఎందుకు ప్రవేశపెట్టారో తెలీదు. తేజస్వి పాత్రకు క్లారిటీ ఉండదు. ఇలా కన్ఫూజన్‌తో సినిమాను చుట్టేశారనే భావన కలుగుతుంది. మధ్యలో సైనికుడుగా ఉత్తేజ్ ( రవి ప్రకాశ్) క్యారెక్టరైజేషన్ సరిగా లేదు. సైనికుడు అనే గొప్ప పాత్రను అమ్మాయిల పిచ్చి ఉన్న వ్యక్తిగా చూపించడం జీర్ణం చేసుకోవడం కష్టమే. పాత్ర మీద ఉన్న నెగిటివిటీని తుడిపేయడానికి గ్యాంగ్ రేప్ గురైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఉత్తేజ్ కశ్మీర్ సరిహద్దులో ప్రాణాలు కోల్పోవడం లాంటి అంశాలతో సెంటిమెంట్‌కు వాడుకోవాలని ప్రయత్నించినా ఫలితం శూన్యం లానే కనిపిస్తుంది. మొత్తంగా అటు అడల్డ్ కామెడీగా కాకుండా, ఇటు ఫ్యామిలీ సినిమా కాకుండా మధ్య రకంగా మిగిలిపోవడం ఓ నాసిరకం సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగిస్తుంది.


సెక్స్ ఎడిక్ట్‌ మాధవ్‌గా అవసరాల శ్రీనివాస్ నటించాడు. ఆ పాత్రకు అవసరాలకు అసలే సూట్ కాదు. ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమా చేయాల్సి వచ్చిందో అర్థంకాని విషయం. ప్రేక్షకుడిని మెప్పించే దమ్ము, ఉద్వేగం లేకపోవడం ప్రధాన లోపం. లేడిస్ టైలర్ లాంటి సినిమా (ప్రస్తావించడం అప్రస్తుతం అయినప్పటికీ)లో రాజేంద్ర ప్రసాద్ చేశాడంటే క్లైమాక్స్‌లో కనీసం ఆ పాత్రపై కొంతైనా సానుభూతి ఉంటుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓ రీజన్ ఉండాలి. అలా తలా తోక లేకుండా ఏదో నటించామని అనిపించుకొంటే అవసరలా కెరీర్‌కు, ఇమేజ్‌కు ముప్పు కలిగే అవకాశం ఉంటుంది.అవసరాల శ్రీనివాస్ మాయలో పడిన అమ్మాయిగా తేజస్విని నటించారు. ఒకట్రెండ్ సీన్లలో బోల్డ్‌గా నటించారు. కానీ ఇప్పటివరకు ఆమెకు ఉన్న కొంత సాఫ్ట్ కార్నర్ పోయే ప్రమాదం కనిపించింది. మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్న తేజస్వి ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం ఇబ్బందికరమైన పరిస్థితే.
ఒకట్రెండు సీన్లలో శ్రీముఖి..శోభ నటరాజన్ పాత్రలో టీవీ యాంకర్ శ్రీముఖి కనిపించారు. అంతగా ప్రాధాన్యం లేని ఒకట్రెండు సీన్లలో కనిపించినా అంతగా గుర్తుండిపోయే పాత్రమే కాదు. ప్రాధాన్యం లేని పాత్ర అయినా రిలీజ్‌కు మంచి పాపులారిటీని సంపాదించుకొన్నారు. నటిగా స్థిరపడటానికి ఉపయోగపడని పాత్రలో శ్రీముఖి నటించారని చెప్పవచ్చు.బాబు బాగా బిజీ సినిమాకు సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. ఆయన అందించిన పాటుల, నేపథ్యం సంగీతం గురించి పెద్దగా మాట్లాడుకునే స్థాయిలో లేవు. సాంకేతిక విభాగంలో కొంత మెరుగనిపించేది సినిమాటోగ్రఫి. మిగితా విభాగాలన్నీ పేరుకు మాత్రమే ఉన్నాయని అనిపించింది. దర్శకుడు నవీన్ మేడారంకు ఎలాంటి పరిమితులు ఉన్నాయో తెలియదు కానీ.. ప్రేక్షకుడిని కట్టిపడేసే విధంగా స్క్రీన్ ప్లే అందిచడంలో, కీలక విభాగాలపై కసరత్తు సరిగా చేయకపోవడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు.తెర ముందు.. తెర వెనుక..నటీనటులుః అవసరాల శ్రీనివాస్, మిస్తి చక్రవర్తి, శ్రీముఖి, తేజస్వి మదివాడ, సుప్రియ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు
దర్శకత్వంః నవీన్ మేడారం
రచయితః హర్షవర్ధన్ కులకర్ణి
సంగీతంః సునీల్ కశ్యప్
నిర్మాతః అభిషేక్ పిక్చర్స్