ఎంపీ కవితను కలిసిన 'పెళ్లిచూపులు' బృందం

  Written by : Suryaa Desk Updated: Fri, May 05, 2017, 02:59 PM
 

హైదరాబాద్: రెండు జాతీయ ఫిల్మ్‌ అవార్డులను అందుకున్న పెళ్లిచూపులు సినిమా బృందాన్ని ఎంపీ కవిత అభినందించారు. ఈమేరకు పెళ్లిచూపులు చిత్ర నిర్మాతలు యాష్‌రంగినేని, రాజ్‌ కందుకూరితో పాటు డైరెక్టర్‌ దాస్యం తరుణ్‌భాస్కర్‌, హీరో దేవరకొండ విజయ్‌, మాధవి, వర్ధన్‌ దేవరకొండ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివేక్‌సాగర్‌, అభయ్‌ తదితరులు గురువారం ఎంపీ కవితను ఆమె నివాసంలో కలిశారు. 64వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ స్ర్కీన్‌ప్లే-డైలాగ్స్‌ కేటగిరీల్లో పెళ్లి చూపులు సినిమా రెండు అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నుంచి అందుకున్న అవార్డులను వారు కవితకు చూపించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ కథాచిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని ఎంపీ కవిత పేర్కొన్నారు. మంచి సినిమాలు తీసేవారికి తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు.