ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కట్టప్ప బాహుబలిని ఎందుకు కిల్ చేసాడంటే..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2017, 01:50 PM

తన కడుపున పుట్టిన భళ్లాలదేవాను కాదని.. కాలకేయుడిపై విజయం సాధించి.. "మాహిష్మతి సామ్రాజ్యం" ప్రతిష్టను ఇనుమడింపజేసిన "అమరేంద్ర బాహుబలి"కి పట్టాభిషేకం చేసేందుకు సన్నాహాలు చేయాల్సిందిగా రాజమాత శివగామి శాసిస్తుంది. చిన్నతనంలోనే తల్లితండ్రుల్ని పోగొట్టుకొన్న తన బావ కుమారుడైన అమరేంద్రను తన సొంత బిడ్డ కన్నా మిన్నగా సాకుతుంది శివగామి. సొంత బిడ్డనైన తనను కాదని.. తన తల్లి శివగామి.. "అమరేంద్ర బాహుబలి"ని రాజుగా ప్రకటించడాన్ని భల్లాలదేవ జీర్ణించుకోలేకపోతాడు.పట్టాభిషిక్తుడు కాబోయేముందు.. రాజ్యంలో ఉన్న సమస్యలపై, ప్రజల కష్ట సుఖాలపై అవగాహన కలిగించుకొనేందుకు వీలుగా అమరేంద్రుడ్ని రాజ్యం మొత్తం పర్యటించమని సూచిస్తుంది శివగామి. కట్టప్పను వెంటబెట్టుకొని.. సాధారణ పౌరుడిలా దేశం మొత్తం తిరుగుతూ.. మాహిష్మతి సామంత రాజ్యం కుంతలకు చేరుకుంటాడు అమరేద్ర బాహుబలి. అక్కడ.. "అసాధారణ సాహసం-అద్వితీయ సౌందర్యం" కలగలిసిన దేవసేనను చూసి.. ఆమెపై మనసు పారేసుకుంటాడు అమరేంద్ర బాహుబలి. అయితే.. కాబోయే రాజుగా కాకుండా.. సాధారణ వ్యక్తిగానే ఆమె మనసు గెలుచుకోవాలని కోరుకొంటాడు.ఇక్కడ అంతఃపురంలో ఉన్న భల్లాలదేవ.. రాజ్య పర్యటనలో ఉన్న అమరేద్ర బాహుబలిపై ఓ కన్నేసి ఉంచి.. అతడి కదలికలపై ఎప్పటికప్పుడు కూపీ లాగుతుంటాడు. కుంతల దేశపు యువరాణి దేవసేన ప్రేమలో పడి.. ఓ సాధారణ యువకుడిలా ఆమెను మెప్పించాలని అమరేంద్ర బాహుబలి పడరాని పాట్లు పడుతున్నాడని వేగుల ద్వారా తెలుసుకున్న భల్లాలదేవ.. కుంతల దేశపు యువరాణి దేవసేనతో తనకు పెళ్లి జరిపించాల్సిందిగా తల్లి శివగామిని అభ్యర్థిస్తాడు.తన బిడ్డను రాజును చేయడం లేదన్న అపరాధ భావనతో ఉన్న శివగామి.. తన కొడుకు కోరిన దేవసేనతో వివాహం చేయిస్తానని వాగ్దానం చేస్తుంది. తన కుమారుడ్ని విహహం చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపిస్తూ.. ఓ లేఖ పంపడంతో పాటు.. ఓ కత్తిని కూడా పంపి.. ఆ కత్తితో దేవసేనకు వివాహం జరిపించాల్సిందిగా ఆదేశాలిస్తుంది. ఆ ఆదేశం.. ఆత్మాభిమానం మెండుగా కల దేవసేనను రెచ్చగొడతాయి. "నా ఇష్టంతోనూ, అంగీకారంతోనూ పని లేకుండా.. మీ కుమారుడ్ని పెళ్లి చేసుకోమని ఆదేశించాడు మీరు ఎవరు?" అంటూ రాజాజ్ఞను దేవసేన ధిక్కరిస్తుంది. తన ధిక్కారాన్ని లేఖ ద్వారా తెలియపరుస్తుంది. శివగామి పంపిన కానుకలు సైతం వెనక్కి పంపేస్తుంది.తన కుమారుడ్ని పెళ్లి చేసుకోవాల్సిందిగా రాజమాత కబురు పెట్టడాన్ని కట్టప్ప మరోలా అర్ధం చేసుకుంటాడు. దేవసేనను అమరేంద్ర బాహుబలి ప్రేమిస్తున్నదన్న విషయం తెలుసుకొని.. ఆమె ఈ కబురు పంపించి ఉంటుందని కట్టప్ప భావిస్తాడు. ఇదే విషయాన్ని బాహుబలికి కూడా చెబుతాడు. బాహుబలి దేశాటనకు బయలుదేరేటప్పుడు.. అతడ్ని ఆశీర్వదిస్తూ.. అతను తిరిగి వచ్చేలోపు.. అతని కోసం సర్వ సుగుణాలు కలిగిన సౌందర్యరాశిని వెతికి తీసుకువస్తానని శివగామి అంటుంది. దాంతో.. బాహుబలి కూడా.. తనకిచ్చిన మాట ప్రకారం.. దేవసేనను తన కోసం వెతికి పట్టుకుని.. తన తల్లి వివాహ ప్రతిపాదన పంపిందని.. కానీ తనతో ప్రేమలో ఉన్న దేవసేన.. ఆ పెళ్ళికొడుకును తానేనని తెలియక.. వివాహ ప్రతిపాదనను తోసిపుచ్చిందని భావిస్తాడు బాహుబలి.ఇక్కడ అంతఃపురంలో.. తాను చేసిన వివాహ ప్రతిపాదనను మొండిగా తోసిపుచ్చిన దేవసేనను బంధించి తీసుకురావాల్సిందిగా రాజమాత శివగామి ఆదేశిస్తుంది. అయితే.. ప్రస్తుతం బాహుబలి కుంతలా రాజ్యంలోనే పర్యటిస్తున్నాడని.. కాబట్టి ప్రత్యేకంగా సేనల్ని పంపించాల్సిన అవసరం లేదని.. బాహుబలికి వర్తమానం పంపితే సరిపోతుందని కుటిలబుద్ధి గల భల్లాలదేవ సూచిస్తాడు.రాజమాత వర్తమానం బాహుబలికి చేరుతుంది. తన ఆజ్ఞను ధిక్కరించిన దేవసేనను బంధించి తీసుకురమ్మంటున్నది తన కోసమేనని భావించి.. దేవసేనకు విషయం చెప్పి.. ఆమె ఆత్మాభిమానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వనని, జీవితాంతం ఆమెకు అండగా ఉంటానని మాటిచ్చి ఆమెను మాహిష్మతి సామ్రాజ్యానికి తీసుకువస్తాడు.దేవసేనను అమరేంద్ర ప్రేమించిన విషయం తెలియని శివగామి.. భళ్లాలదేవాను పెళ్లి చేసుకోవాల్సిందిగా దేవసేనను శాసిస్తుంది. అందుకు నిరాకరించిన దేవసేనని సభలోనే శిక్షించాలని సైనికులను ఆదేశిస్తుంది. కానీ.. దేవసేన ఒంటి మీద ఈగ సైతం వాలనివ్వనని మాటిచ్చిన అమరేంద్ర.. ఆమెకు కవచమై నిలుస్తాడు. దేవసేనకు రక్షణగా తన ఖడ్గాన్ని ఉంచి.. ఇది బాహుబలి ఖడ్గం. దీనిని ఎవరైనా తాకారో ఖబడ్దార్ అని హెచ్చరిస్తాడు.నిండు సభలో తనను ధిక్కరించడాన్ని శివగామి జీర్ణించుకోలేకపోతుంది. "రాజ్యం కావాలో.. దేవసేన కావాలో" తేల్చుకోమంటుంది. దేవసేన కోసం రాజ్యాధికారాన్ని గడ్డి పోచలా వదిలేస్తాడు అమరేంద్ర. అలా.. పెంచిన తల్లి శివగామి-అమరేంద్ర బాహుబలి మధ్య పొరపచ్చాలు మొదలవుతాయి. వాటిని భల్లాలదేవ అతని తండ్రి బిజ్జలదేవ ఇంకా ఇంకా పెద్దవయ్యేలా చేసి.. చివరికి అమరేంద్రను హతమార్చవలసిందిగా శివగామి తన నమ్మిన బంటు కట్టప్పను ఆదేశించేలా చేస్తారు తండ్రీకొడుకులు.ఆ ఆజ్ఞను శిరసావహించడానికి ససేమిరా అంటాడు కట్టప్ప. కానీ.. నువ్వు చేయకపోతే నేనే ఆ పని చేస్తానని అంటుంది రాజమాత. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాహుబలిని కట్టప్ప చంపేస్తాడు. ఆ తర్వాత శివగామి తన తప్పు తెలుసుకుంటుంది. తన ప్రాణత్యాగంతో.. దేవసేన-అమరేంద్ర బాహుబలి కి పుట్టిన బిడ్డను రక్షిస్తుంది. అంతకుముందే.. ఆ బిడ్డకు మహేంద్ర బాహుబలి అని నామకరణం చేయడంతోపాటు.. ఆ పసికూనను రాజుగా ప్రకటించి మరణిస్తుంది!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com