బాహుబలి 2 విడుదలతో ఇప్పుడు అందరి దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా... ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. అత్యధిక ధరకు శాటిలైట్, టీవీ హక్కులు విక్రయించడం... ఆ స్థాయిలోనే అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలు చేయడం వల్ల ఇలా విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది.ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అతిపెద్ద సినిమాగా తెరకెక్కి.. ఖండాంతరాల్లో సినీ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా కలెక్షన్లపై ట్రేడ్ పండితులేమంటున్నారంటే.... అన్ని భాషల్లో వచ్చే కలెక్షన్లను చూసి అంతగా ఆశ్యర్యమేమీ వ్యక్తం చేయడం లేదు. తొలిరోజే రూ. 70 కోట్లకు పైగా వసూలు చేసినా అంత విశేషమేమీ లేదు. మూడు రోజుల్లో రూ. 230 కోట్లకు పైగా వసూలు చేస్తుందా లేదా అనేది కొంత చర్చనీయాంశంగా ఉందంటున్నారు.వచ్చేది వీకెండ్... కొన్ని కంపెనీలు రికార్డు స్థాయిలో సింగిల్ షో టికెట్లను కొనుగోలు చేసి దిమ్మతిరిగే బిజినెస్ అయ్యేలా చేశాయి. దీంతోపాటు 24 గంటల్లో అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు రూ. 25 కోట్లు రావడాన్ని బట్టి.... వసూళ్లు అసాధారణంగానే ఉంటాయని భావిస్తున్నారు. ఇలాంటి క్రేజీ బాలీవుడ్ లో వచ్చిన దబాంగ్, ఏక్ థా టైగర్, భజరంగీ భాయీజాన్, చెన్నై ఎక్స్ ప్రెస్, దంగల్ వంటి సినిమాలను మించి ఓ ప్రాంతీయ చిత్రంగా తెరకెక్కి ఈ స్థాయిలో క్రేజ్‌ని సంపాదించుకోవడమనేది విస్మయానికి గురి చేస్తుందంటున్నారు.భాషతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాలకు చెందిన సూపర్ స్టార్లు లేకున్నా దూసుకుపోతుందంటే కథలో ఉన్న బలమేనని, అదే ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేస్తుందని దీంతో అనుకున్న కలెక్షన్లను సునాయాసంగా చేరుకోగలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్ లో అమీర్ నటించిన దంగల్ చిత్రాన్ని నిర్మించిన దానికంటే రూ. 400 కోట్లకు ఎక్కువ వసూళ్లు చేసి, దాదాపు రూ. 300 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది. ఇప్పటి వరకు ఈ సినిమా పేరిట ఉన్న గ్రాస్ కలెక్షన్ల రికార్డులను బాహుబలి చెరిపివేస్తుందని జోస్యం చెబుతున్నారు. అమెరికాలో దాదాపు 1000కి పైగా థియేటర్లలో విడుదలవ్వగా అడ్వాన్స్ బుకింగ్ లోనే 3 మిలియన్ యూఎస్ డాలర్లను గడించిన విషయం తెలిసిందే. అయితే సినిమాపై ఉన్న ఆసక్తి కొంత కాలంపాటు నిలబడితే కానీ 1000 కోట్ల మార్కును దాటే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా బాహుబలి కలెక్షన్లతో రికార్డుల మోత మోగిస్తే గనుక భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.