బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కర్నూల్ జిల్లా లోని మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాలు జలమయమయ్యాయి. మండలంలోని గుండాల వాగు, బానుముక్కల ఈదుల వాగు, ఇస్కాల గ్రామ సమీపంలో ఉన్న భవనాసి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంకలు ఉప్పొంగాయి. నేటి నుంచి రెండు, మూడు రోజుల వరకు ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్పందన కాల్ సెంటర్ నుంచి ప్రతి సెల్ కు సమాచారం అందజేశారు.
మండలంలోని రహదారులు బాగా దెబ్బతిన్నాయి. భారీ నష్టం జరగనప్పటికీ పంటపొలాలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాకాలంలో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో ఆరుగాలాల పాటు కష్టించి పనిచేసే రైతన్నకు ఈ ఖరీఫ్ సీజన్ లో పంటలు సైతం సమృద్ధిగా ఉండడం ఎంతో తృప్తిగా ఉన్నా ఇదే సమయంలో ఊహించని రీతిలో వర్షాలు కురుస్తుండడంతో చేతికొచ్చిన పంట అందకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. వేంపెంట, బానుముక్కల, బానకచెర్ల, చెలిమిళ, ఇస్కాల, పాములపాడు గ్రామాల్లో పసుపు, పత్తి, మొక్కజొన్న, మిరప, వరి పంటలు నీట మునిగాయి. గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో, ప్రాంతాలు సైతం నీట మునగడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.