ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాహుబలి 2: ది కంక్లూజన్ మూవీ రివ్యూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2017, 06:33 AM

చిత్రం: బాహుబలి: ది కన్‌క్లూజన్‌ 


నటీనటులు: ప్రభాస్‌.. రానా.. అనుష్క.. తమన్నా.. రమ్యకృష్ణ.. సత్యరాజ్‌.. నాజర్‌ తదితరులు 


ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌ 


కళ: సాబు సిరిల్‌ 


సంగీతం: ఎం.ఎం.కీరవాణి 


నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ 


సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌ 


స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి 


విడుదల తేదీ: 28-04-2017


రేటింగ్ : 4.5/5


దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి తొలిభాగం సంచలన విజయం సాధించింది. ఎలాంటి ఎమోషనల్ సీన్స్ లేకుండా కేవలం పాత్ర పరిచయాల కోసమే కేటాయించిన బాహుబలి తొలి భాగం భారీ విజయం సాధించటంతో అసలు కథ నడిచే బాహుబలి 2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. సుమారు 5 ఏళ్ళ పాటు రాజమౌళితో సహా 900 మంది కాస్ట్ అండ్ క్రూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రూ. 450 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీలో రెండవ, ఆఖరి భాగమైన ఈ చిత్రం శిఖరాగ్ర స్థాయి అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజే థియేటర్లలోకి అడుగుపెట్టింది. భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు తొలి భాగంలో మిస్ అయిన రాజమౌళి మార్క్ డ్రామా, ఎమోషన్స్ ను  సీక్వల్ లో చూడొచ్చన్న హైప్ క్రియేట్ చేశారు. మరి నిజంగా బాహుబలి 2 ఆ అంచనాలను అందుకుందా..? తొలి భాగాన్ని మించే విజయం సాధిస్తుందా..?


కథ :రాజుగా ప్రకటించిన తరువాత దేశంలోని పరిస్థితులను తెలుసుకొని రమ్మని బాహుబలి కి కట్టప్పను తోడుగా ఇచ్చి దేశాటనకు పంపిస్తుంది శివగామి దేవి. అలా దేశాటనకు బయలుదేరిన బాహుబలి కుంతల రాజ్య యువరాణి దేవసేన అందం, ధైర్యసాహసాలు నచ్చి తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. దేవసేన ప్రేమను గెలుచుకోవడానికి ఆమె రాజ్యంలోనే అతిథిలుగా ఉండిపోతారు. అయితే ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకు భల్లాలదేవుడు కూడా దేవసేనను సొంతం చేసుకోవాలనుకుంటాడు. బాహుబలి ప్రేమ విషయం రాజమాతకు చెప్పక ముందే తాను దేవసేనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఎలాగైన దేవసేనతో తన వివాహం జరిపించాలని శివగామి దగ్గర మాట తీసుకుంటాడు.కొడుకు కోరికను మన్నించిన శివగామి, దేవసేనను తన కొడలిగా చేసుకోవాలని భావిస్తున్నాని వర్తమానం పంపుతుంది. అయితే శివగామి వర్తమానం పంపిన తీరు నచ్చని దేవసేన, శివగామి పంపిన బహుమతులను తిప్పిపంపుతుంది. కానీ కుంతల రాజ్యంలోనే ఉన్న బాహుబలి, కట్టప్పలు మాత్రం రాజమాత... దేవసేనకు బాహుబలితో వివాహం చేయించనుందని భావిస్తారు. ఆ నమ్మకంతోనే నీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదని మాట ఇచ్చి దేవసేనను మాహిష్మతికి తీసుకువస్తాడు. మాహిష్మతికి వచ్చిన తరువాత అసలు నిజం తెలుస్తుంది.దేవసేన అభిప్రాయం తెలుసుకోకుండా రాజమాత తీసుకున్న నిర్ణయాన్ని బాహుబలి తప్పు పడతాడు. దీంతో బాహుబలి మీద కోపంతో రాజమాత శివగామి దేవి, భల్లాలదేవుడిని రాజుగా, బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత బాహుబలిని ఎలాగైన రాజమాతకు దూరం చేయాలనుకున్న భల్లాలదేవుడు, తండ్రి బిజ్జలదేవుడితో కలిసి కుట్రలు పన్ని బాహుబలి, దేవసేనలపై అంతఃపుర బహిష్కరణ శిక్ష వేయిస్తాడు. కోటకు దూరమైన బాహుబలి.. సామాన్యులతో కలిసి ఉంటూ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇది సహించలేని భల్లాలదేవుడు.. బాహుబలి బతికుండగా తనకు రాజుగా గుర్తింపు రాదని ఎలాగైన బాహుబలిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. బాహుబలి మామా అని ఆప్యాయంగా పిలుచుకునే కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడు. అసలు బాహుబలిని చంపడానికి కట్టప్ప ఎందుకు అంగీకరించాడు...? భల్లాలదేవుడు చేసిన మోసాలు రాజమాత శివగామి దేవికి తెలిసాయా..? భల్లాలదేవుడు శివగామిని ఎందుకు చంపాలనుకున్నాడు..? మహేంద్ర బాహుబలి, భల్లాలదేవుడ్ని ఎలా అంతమొందించాడు.? అన్నదే మిగతా కథ.


నటీనటులు : 


ప్రభాస్: రాజమౌళి నటీనటుల నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకోవడంలో పూర్తి విజయం సాధించారు. నటీనటుల ఒక్కొక్కరు తమ పాత్రల మేర ఎవరికి వారే పోటాపోటీగా నటించారు. ముందుగా ప్రధాన పాత్రధారి ప్రభాస్ విషయానికొస్తే ఫ్లాష్ బ్యాక్ లో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ రాజసాన్ని, మంచితనాన్ని, యుద్ధంలో వీరత్వాన్ని, అనుష్క సాన్నిహిత్యంలో ప్రేమను, ధర్మం కోసం తల్లినే ఎదిరించే కొడుకుగా తనలోని సంఘర్షణను చాలా బాగా వ్యక్తపరిచాడు. అలాగే ప్రస్తుతంలో దుష్టుడైన పెదనాన్నను పడగొట్టి, తల్లి పగను తీర్చి, తన తండ్రిని నమ్ముకున్న ప్రజలకు విముక్తి కలిగించే మహేంద్ర బాహుబలి అలియాజ్ శివుడి పాత్రలో కూడా వీరోచితమైన పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.


రానా దగ్గుబాటి: అలాగే భల్లాదేవుని పాత్రలో రానా చాలా బాగా నటించాడు. ఒక స్వార్థపూరితమైన వ్యక్తిగా, బలవంతుడిగా అతని నటన, హావభావాలు చాలా రోజుల తర్వాత అసలైన విలనిజం అంటే ఏమిటో చూపించాయి. ప్రభాస్ తో ముఖాముఖి తలపడే సన్నివేశాల్లో, యుద్ధ సన్నివేశాల్లో రానా బల ప్రదర్శన, బాడీ లాంగ్వేజ్, ఉద్రేకపూరితమైన నటన చాలా బాగున్నాయి. ప్రతి నాయకుడు బలంగా ఉంటేనే కథా నాయకుడి స్థాయి పెరిగి సినిమా పండుతుందనే ధర్మాన్ని చాలా ఖచ్చితంగా పాటించాడు రానా.


అనుష్క : కుంతలదేశపు యువరాణిగా అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కట్టిపడేసింది. ఒక అందమైన, ఆత్మగౌరవం, చిన్నపాటి అహంకారం కలిగిన యువరాణిగా ఆమె నటన చాలా బాగుంది. ఆమె ప్రభాస్ తో కలిసి యుద్ధంలో పోరాడే సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి.


రమ్య కృష్ణ : రాజమాత శివగామి దేవిగా రమ్యకృష్ణ రెండవ భాగంలో కూడా ఆకట్టుకుంది. శివగామి పాత్ర రమ్యకృష్ణ టెర్రిఫిక్. కళ్లతో తెరమీద పలికించిన హావభావాలు మరొకరికి సాధ్యం కావు అనే రేంజ్‌లో ఉన్నాయి. శివగామి పాత్రలో మరెవరూ కనిపించినా రమ్యకృష్ణను తలదన్నే వారా అనే సందేహం తప్పకుండా కలుగుతుంది. హుందాతనం, రాజసం, రౌద్రం, ప్రేమ, వేదన, అహంకారం ఇలాంటి అంశాలు అన్ని కలిపిన శివగామి పాత్రను ఒంటిచెత్తో నిలబెట్టింది. అద్భుతమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.


సత్యరాజ్ : కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయి నటించాడు. సినిమా ఆద్యంతం హీరోతో పాటే కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తూ మెప్పించాడు. మొదటి అర్థ భాగంలో ప్రభాస్ తో కలిసి మంచి హాస్యాన్ని కూడా పండించాడు. ఇక బాహుబలిని చంపే సన్నివేశంలో, చంపాక శివగామిదేవితో మాట్లాడే సన్నివేశంలో ఆయన గొప్ప స్థాయి నటనను కనబర్చారు.


నాజర్ : బాహుబలి2లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బిజ్జాలదేవ పాత్ర. ఈ పాత్రను నాజర్ ఎంతో ప్రభావవంతంగా పోషించాడు. ఈ పాత్రను పోషించడంలో ఏమాత్రం తడబడినా మిగితా పాత్రలు తేలిపోయే ప్రమాదం ఉండేది. కానీ సుదీర్ఘ అనుభవంతో నాజర్ బిజ్జాలదేవ పాత్రను లార్జర్ ద్యాన్ లైఫ్‌గా మార్చాడు. ఇలాంటి విలన్ పాత్రలు పోషించడం తనకు కొట్టిన పిండి అని చెప్పకనే చెప్పాడు.


సాంకేతిక నిపుణులు :


రాజమౌళి విజన్, డైరెక్షన్: రాజమౌళి తన ఆకాశమే హద్దుగా ఉండే తన ఊహల్లో ప్రతి సన్నివేశాన్ని ఎంత గొప్పగా అయితే ఊహించుకున్నాడో అంతే గొప్పగా తెరపై ఆవిష్కరించాడు. ఒక చారిత్రక నైపథ్యంలో ఉన్న కథకు డ్రామాతో పాటు నేటి వ్యాపార ప్రపంచంలో ముఖ్యమైన వాణిజ్య అంశాలైన హాస్యం, రొమాన్స్ వంటి వాటిని కలిపి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా తీయడమంటే మాటలు కాదు. కానీ రాజమౌళి అదే పని చేశాడు. తన ప్రధాన బలమైన హీరో యొక్క హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం దగ్గర నుండి గొప్ప కథను, గొప్ప కథనంతో ఎక్కడా ఆసక్తి తగ్గడం కాదు కదా సీను సీనుకి ఉత్కంఠ ఇంకా పెరిగేలా, కళ్ళు చెదిరే దృశ్యాలతో ప్రపంచస్థాయి సినిమాను చేశాడు. సినిమాకు కీలకమైన ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ లను అద్భుతంగా రూపొందించి సినిమా విజయాన్ని కత్తి దింపినట్టు ఖాయం చేసేశాడు.


అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్ : ముందుగానే చెప్పినట్టు ఆర్. సి. కమల్ కణ్ణన్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రపంచస్థాయిలో ఉంది కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. ఇలాంటి గ్రాఫికల్ వర్క్ ను ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ మనం చూడలేదు. నటీ నటులను ఎలివేట్ చేయడంలో, అద్భుతమైన మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆణువణువూ కళ్ళకు కట్టేలా చూపడంలో, పోరాట సన్నివేశాలని స్పష్టంగా చూపడంలో మంచి పనితనం కనబర్చారు విఎఫ్ఎక్స్ టీమ్. ముఖ్యంగా ‘హంస నావ’ పాటలోని విజువల్స్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయి.


సంగీతం : ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకున్నప్రధాన బలాల్లో ఒకటి. సందర్భానుసారంగా వచ్చే పాటలకు ఆయన చేసిన సంగీతం చాలా వినసొంపుగా ఉంది. ‘హంస నావ, దండాలయ్యా’ పాటల సంగీతం చాలా బాగుంది. ఇక ప్రభాస్ కనిపించే సీన్లలో బ్యాక్ గ్రౌండ్లో రన్ అయ్యే ‘హైస్స ముద్రస్స’ అనే పాట వినబడినప్పుడల్లా ఒళ్ళు పులకరించేలా చేసింది.


సినిమాటోగ్రఫీ: రాజమౌళి విజన్ ను ఖచ్చితంగా అర్థం చేసుకుని దాన్ని అలానే తన కెమెరాలో బందించి తెరపై ఆవిష్కరించగల సమర్థుడు సెంథిల్ కుమార్. అందుకే వీరి కలయిక బ్రహ్మాండమైన విజయాల్ని సాధించింది. ఈ సినిమాలో కూడా సెంథిల్ కుమార్ నటీ నటుల చిత్రం దగ్గర్నుంచి పరిసరాలు, వార్ సీన్స్ వంటి వాటిని చాలా హుందాగా చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లను బాగా క్యాప్చర్ చేశాడు.


నిర్మాణ విభాగం : నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లు సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడింది. ఒక చిత్రాన్ని అద్భుత స్థాయిలో ప్రేక్షకులకు అందివ్వడానికి నిర్మాతలు పడే తపన ఎటువంటిదో, అన్ని విభాగాలకు బడ్జెట్ పరంగా సమాన న్యాయం చేస్తే ఫలితం ఎంత గొప్ప స్థాయిలో ఉంటుందో ఈ సినిమా చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇక కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కూడా ఎక్కడా ఎక్కువ తక్కువలు లేకుండా బాగా కుదిరింది.  అలాగే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మొదటి అర్థ భాగంలో డిజైన్ చేసిన వార్ సీన్, క్లైమాక్స్ లో ప్రభాస్, రానా ల మధ్య కంపోజ్ చేసిన భీభత్సమైన పోరాటం ఆకట్టుకుంది.


తీర్పు: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతం అందరి ఊహలను అందుకుంటూ, ప్రపంచ స్థాయిలోనే ఉంది. ఆకట్టుకునే కథ కథనాలు, వాటిని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించిన తీరు, విజువల్స్ లో మాటల్లో చెప్పలేనంత భారీతనం, నటీనటుల గొప్ప నటన, ఆకట్టుకునే ఓపెనింగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్, ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో కట్టిపడేసే అంశాలు కాగా కాస్తంత అసంతృప్తిగా తోచిన క్లైమాక్స్ వార్ ఎపిసోడ్, పెద్దగా ప్రాముఖ్యతలేని తమన్నా పాత్రలు చిన్నపాటి లోటుగా కనిపించాయి. మొత్తం మీద చెప్పాలంటే రాజమౌళి సృష్టించిన ఈ అద్భుత దృశ్య కావ్యం అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచడమేగాక ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి, తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి ఖ్యాతిని తెచ్చిపెడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.


బలం, బలహీనతలు :


ప్లస్ పాయింట్స్: కథ, కథనం, డైరెక్షన్ సంగీతం ఫొటోగ్రఫీ, ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ యాక్టింగ్. 


మైనస్ పాయింట్స్: ఈ అద్భుత దృశ్య కావ్యంలో చెప్పుకోడానికి పెద్దగా పొరపాట్లేమీ లేవు. అంత జాగ్రత్తగా ప్రతి విభాగం చేత పనిచేయించాడు రాజమౌళి. అయినా కూడా సినిమాపై ఉన్న భారీ అంచనాలు కొన్ని చిన్న చిన్న పొరపాట్లని పట్టుకునేలా చేస్తాయి. అలాంటి పొరపాట్లలో ముఖ్యమైనది క్లైమాక్స్ వార్ ఎపిసోడ్. ఇందులో రానా, ప్రభాస్ ల మధ్య జరిగే పోరాటం భారీ స్థాయిలో గొప్పగానే ఉన్నా కూడా మిగిలిన సైన్యం చేసే యుద్ధం మొదటి భాగంలో క్లైమాక్స్ లో వచ్చే యుద్దమంత భీభత్సంగా అయితే లేదు. అలాగే సినిమా చివర్లో అనుష్క పాత్రకు ఇంకాస్త ఎమోషనల్ టచ్, తమన్నా పాత్రకు కనీసం డైలాగ్స్ చెప్పే ఛాన్స్ అయినా ఇచ్చి ఉంటే ఇంకాస్త ఎక్కువ సంతృప్తికరంగా ఉండేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com