ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్ లైన్ లో బాహుబలి 2 నకిలీ టికెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2017, 01:27 PM

బాహుబలి 2... ఈ సినిమా విడుదలకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్లలో కొన్ని థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్లను అమ్ముతున్నాయి. ఇప్పటికే ఆయా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో దాదాపుగా మొదటి 5 రోజుల వరకు టిక్కెట్లన్నీ బుక్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా కొన్ని థియేటర్స్ మాత్రం ఇంకా ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. ఒక వేళ చేసినా అవి హాట్ కేకుల్లానే అమ్ముడుపోనున్నాయి. ఈ క్రమంలోనే బాహుబలి 2 సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను ఆసరగా చేసుకుని కొందరు ప్రబుద్ధులు ఆ సినిమాకు గాను నకిలీ టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్లను క్రియేట్ చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్ పేర్లను ఆ సైట్లలో పెట్టి అన్ని షోలకు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. 
ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయించే సైట్ల గురించి తెలియని వారు ఈ నకిలీ సైట్ల బారిన పడుతున్నారు. ఇంటర్నెట్ బ్రౌజర్‌లో గూగుల్ లేదా ఇతర సెర్చ్ సైట్లు ఓపెన్ చేసి bahubali 2 movie tickets అని సెర్చ్ చేస్తే వాటిల్లో వచ్చే మొదటి పేజీల్లో దాదాపుగా మొత్తం నకిలీ సైట్లే కనిపిస్తున్నాయి. అలా వచ్చేలా ప్రత్యేకమైన ఏర్పాటు చేసి మరీ ప్రేక్షకులను మోసం చేస్తున్నారు. తాజాగా www.newtickets.in అనే ఓ నకిలీ వెబ్‌సైట్ గురించిన వార్త తెలిసింది. ఈ సైట్‌లో ఇప్పటికే పెద్ద మొత్తంలో టిక్కెట్లను విక్రయించినట్టు సమాచారం. హైదరాబాద్, చెన్నై, న్యూయార్క్, లండన్, సిడ్నీ, అబుధాబి తదితర ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్‌లో బాహుబలి 2 టిక్కెట్లను కావాలనుకునే వారు తమ వెబ్‌సైట్లో కొనుగోలు చేయాలంటూ ఈ వెబ్‌సైట్ ప్రచారం నిర్వహించింది. దీంతో నిజంగానే టిక్కెట్లు ఉన్నాయని నమ్మిన ప్రేక్షకులు ఆ సైట్‌లో టిక్కెట్లను కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ప్రముఖ టిక్కెట్ బుకింగ్ సైట్లలో బాహుబలి 2 టిక్కెట్లు అన్నీ అమ్ముడవడంతో న్యూ టిక్కెట్స్ సైట్‌లో ఇంకా టిక్కెట్లు ఉన్నట్టు చూపిస్తుండడాన్ని చూసిన పలువురికి అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అసలు విషయం తెలిసింది. సదరు సైట్ నకిలీదేనని, ఈ మధ్యే దాన్ని రిజిస్టర్ చేశారని, బాహుబలి 2కు ఉన్న క్రేజ్ దృష్ట్యా నకిలీ టిక్కెట్లను అమ్మి సొమ్ము చేసుకోవాలన్న దుర్భుద్ధితోనే ఆ సైట్‌ను ఓపెన్ చేశారని పోలీసులు గుర్తించారు. కాగా ఇప్పటికే ఆ సైట్‌లో ఒక్కో టిక్కెట్‌ను రూ.120 పెట్టి చాలా మంది ప్రేక్షకులు టిక్కెట్లు కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో మరో 3 రోజుల తరువాత విడుదల కానున్న బాహుబలి 2 సినిమాకు ఇలా నకిలీ టిక్కెట్లను కొన్నవారు వెళితే అప్పుడు పెద్ద సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది.బాహుబలి 2 సినిమాకు నకిలీ టిక్కెట్లను విక్రయిస్తున్న దృష్ట్యా ప్రేక్షకులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనేముందు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. టిక్కెట్ బుకింగ్ సమయంలో యూజర్ల ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు దుండగుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లను కొనే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని ఐటీ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com