ముంబై ఇండియన్స్‌ కు ఐపీఎల్‌ 10లో ఎదురులేదు ..

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 11:18 AM
 

ముంబై  ఇండియన్స్‌ కు ఐపీఎల్‌ 10లో ఎదురులేకుండా పోయింది. వరుస విజయాలతో  సత్తా  చాటుతున్న  రోహిత్  సేన.. మరో విక్టరీని తన ఖాతాలో  వేసుకుంది. ఇండోర్‌  వేదికగా.. పంజాబ్‌  కింగ్స్‌  ఎలెవన్‌ తో జరిగిన మ్యాచ్‌లో  ముంబై 8 వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది.  77 రన్స్‌ తో ఆకాశమే హద్దుగా చేలరేగిన బట్లర్‌  ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైండు.


టాస్‌ ఓడి  ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేపట్టిన  పంజాబ్‌  కింగ్స్‌ ఎలెవన్‌.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198  పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్‌ ఆమ్లా 60 బాల్స్‌ లో 102 రన్స్‌ తో చే లరేగగా.. మరో ఎండ్‌ లో  కెప్టెన్‌ మ్యాక్స్‌ వెల్‌ తనదైన శైలిలో  విధ్వంసం సృష్టించాడు.  ఓపెనర్‌ మార్ష్‌తో పాటు సాహా అవుటైనా.. ఆమ్లా జోరు తగ్గించకుండా  ఇన్నింగ్స్‌ ను నడిపించాడు. 11 ఓవర్‌లో మ్యాక్స్‌ వెల్‌  క్రీజ్‌లోకి  రావడంతో  మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఆమ్లా, మ్యాక్స్‌ వెల్‌  ముంబై  బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 18 బాల్స్‌ లో మూడు సిక్సులు,  4 ఫోర్లతో 40  రన్స్‌  చేసి మ్యాక్స్‌ వెల్‌  అవుటైనా..  ఆమ్లా చివరి వరకు క్రీజ్‌ లో నిలిచి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు.


పరుగుల భారీ లక్ష్యంతో  బరిలోకి దిగిన ముంబై.. ఫస్ట్‌ ఓవర్‌ నుంచే దూకుడుగా  ఆడింది. పార్థివ్‌  పటేల్‌,  బట్లర్‌ ఆకాశమే  హద్దుగా చేలరేగడంతో  ముంబై  6 ఓవర్లలోనే  81 రన్స్‌ చేసింది. పార్ధివ్‌ 18 బాల్స్‌ లో 37రన్స్‌  చేసిన పార్థివ్‌ అవుట్‌ కావడంతో..  క్రీజ్‌లోకి వచ్చిన రాణా  బట్లర్‌ కు చక్కటి  సహకారం అందించాడు.  37 బాల్స్‌ లో  5 సిక్సులు,  7 ఫోర్లతో బట్లర్‌ 77 రన్స్‌ చేయగా  రాణా  34 బాల్స్‌ లో 7 సిక్సులతో  62 రన్స్‌ సాధించడంతో.. ముంబై విజయానికి చేరువైంది. ఈ దశలో బట్లర్‌  పెవిలియన్‌ చేరినా.. హార్ధిక్‌ పాండ్యా  సహకారంతో రాణా  ముంబై కి  విజయాన్ని  అందించాడు.


 


ముంబై బ్యాట్స్‌ మెన్ల దూకుడుతో.. పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఆకాశమే హద్దుగా  చేలరేగిన ముంబై బ్యాట్స్‌ మెన్లు.. సిక్సులు, ఫోర్లతో  విరుచుకుపడడంతో.. మరో  27  బాల్స్‌ మిగిలుండగానే.. ముంబై విజయాన్ని  సొంతం చేసుకుంది. అటు 77 రన్స్‌ తో  ముంబై విజయంలో కీలకపాత్ర పోషించిన బట్లర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైండు. అటు ఈ సీజన్‌లో 5వ విజయాన్ని సొంతం చేసుకున్న ముంబై.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.