హెలికాప్టర్‌తో ఫేస్‌బుక్‌ ఇంటర్నెట్‌ సేవలు

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 11:02 AM
 

అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం సరికొత్త ప్రయత్నం చేస్తోంది. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతిన్న సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో గగనతలం నుంచి ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అందుకోసం ప్రత్యేకంగా ‘టిథర్‌-టెన్నా’ అనే చిన్నపాటి హెలికాప్టర్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపింది.తుపాన్లు.. భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. సాంకేతికత సమస్యలు తలెత్తినప్పుడు ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడితే వెంటనే అక్కడికి ఈ హెలికాప్టర్‌ను పంపించొచ్చట. దాంతో గగనతలం నుంచి ఆ ప్రాంతంలో అప్పటికప్పుడు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించే వీలుంటుందని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇంటర్నెట్‌ అనేది నిత్యావసరంగా మారుతున్న నేపథ్యంలో ఈ హెలికాప్టర్‌ సేవలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.