ఏపిలో రక్తసేకరణ మెుబైల్‌ వాహనాలు

  Written by : IANS Updated: Fri, Apr 21, 2017, 01:31 AM
 

వెలగపూడి, సూర్య ప్రధాన ప్రతినిధి : రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 బ్లడ్‌ కలెక్షన్‌ వాహానాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా గన్నవరం విమానశ్రయంలో  శుక్రవారం ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ఒక్కొక్క వాహం రూ.40 లక్షల వ్యయంతో ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్వచ్చంద సంస్ధలు, కాలేజిలలో ఏర్పాటు చేసే రక్త దాన శిబిరాల నుండి రక్త సేకరణకు ఈ వాహానాలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రక్త సేకరణ మొబైల్‌ వాహనాలను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని వెద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో కామినేని శ్రీనివాస్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులను నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ పరిధిలోకి తెచ్చేలా ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఎన్‌ఏబీహెచ్‌ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రతి జిల్లాకు రూ.40లక్షల విలువచేసే ఒక వాహనాన్ని కేటాయిస్తున్నట్టు చెప్పారు. రోగులకు స్వచ్ఛమైన రక్తం అందించేలా ఈ రక్తనిధి సేకరణ వాహనాలు పనిచేస్తాయని వివరించారు.  వారు ఆసుపత్రులలో నిర్వహణ మరియు వసతులను పరిశీలించి రేటింగ్‌ ద్వారా అక్రిడేషన్‌ ఇస్తున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రి కామినేని శ్రీనివాస్‌ కార్యాలయంలో  ( నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పటల్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రోవైడర్స్‌ ) క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వారితో వైద్య,ఆరోగ్య శాఖ ఏంవోయు ఒప్పందం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో విభజనకు ముందు  గుర్తింపు పొందిన 18 ఆసుపత్రులు ఉండగా తెలంగాణలో 15, ఏపీలో 3 మాత్రమే ఉన్నట్లు మంత్రి తెలిపారు. డిఎంఈ పరిధిలో ఉన్న  15 టీచింగ్‌  ఆసుపత్రులలో మొదట దీనిని అమలుచేస్తున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ఆసుపత్రులను ఏజెన్సీకి ఇవ్వడం వల్ల వసతులు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్‌, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య,  ప్రతినిధులు సిఈవో డా.హరిష్‌ నాడ్కరిని, భూపేంద్ర కుమార్‌ రాణా, దీప్తి మోహన్‌, వైద్య, ఆరోగ్య శాఖా సలహదారుడు జితేందర్‌ శర్మ, డిఎమ్‌ఈ సుబ్బారావు, బాబ్జీ, ఎన్టీఆర్‌ వైద్య సేవ సిఈవో రవిశంకర్‌ అయ్యన్నర్‌, ఎపీఎంఐడిసి ఎండీ గోపినాధ్‌ పాల్గొన్నారు.