విజయవాడ, గూడూరు మధ్య మరో లైను

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 18, 2017, 12:08 AM
 

 -మూడో రైల్వే లైనుతో మహర్దశ


 -బడ్జెట్‌ రూ 200 కోట్లు కేటాయింపు


 -రాజధాని ప్రాంతానికి పెరగనున్న రైళ్ల కనెక్టివిటీ


దేశంలోనే అత్యంత కీలకమైన హౌరా-చెనై్న రైలు మార్గంలో మూడో లైను ఏర్పడనుంది. విజయవాడ - గూడూరు, విజయవాడ - దువ్వాడ మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. మూడో లైన్‌ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్‌ కీలకం కానుంది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకల స్వరూపం మారిపోనుంది.


గుంటూరు,సూర్యప్రతినిధి:  నవ్యాంధ్ర రాజధాని ఈ ప్రాంతంలో రావడంతో రాజధానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైన్లు, రైళ్ల కనెక్టివిటీ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా హౌరా - చెనై్న ప్రధాన రైలు మార్గంలో విజయవాడ- గూడూరు మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. గతంలోనే ఈ ప్రతిపాదన ఉంది. ఈ మార్గంలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని సరుకు రవాణా రైళ్లు, ప్రయాణికుల రైళ్లకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసి కారిడార్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పట్టాలు ఎక్కనున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడ మీదుగా దువ్వాడ నుంచి గూడూరు వరకు మూడో లైను మంజూరైనట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. మూడో లైన్‌ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్‌ రైల్వే అభివృద్ధికి కీలకం కానుంది. పలు రైళ్లు తెనాలి మీదుగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడనుంది. దీంతో పాటు తెనాలి రైల్వే స్టేషనను ఆధునికీకరణ జాబితాలో కూడా రైల్వే శాఖ చేర్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల 


స్వరూపం మారిపోనుంది.ప్రస్తుతం విజయవాడ - గూడూరు మార్గంలో రెండు లైన్లు ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలుతో పాటు గూడ్సు రైళ్లు అధిక సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గంలో రద్దీ కారణంగా రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో భవిష్యత్తులో రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని తట్టుకోవడానికి వీలుగా మూడో లైను ఏర్పాటు అవసరమని భావిసున్నారు. తెనాలి -విజయవాడ - గుంటూరును కలుపుతూ రాజధాని మీదుగా భవిష్యత్తులో కొత్త రైల్వే లైన్లు రానున్నాయి. రాజధానిని కలుపుతూ ఈ నగరాల మధ్య రైళ్ల కనెక్టివిటీ పెంచాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తెనాలి - గుంటూరు - విజయవాడ మధ్య సర్కు్యలర్‌ రైళ్లు నడుస్తున్నాయి. 


తెనాలి - గుంటూరు మధ్య డబ్లింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో వైపు రాజధాని అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడల మధ్య కొత్త లైన ఏర్పడనుంది. తెనాలి మీదుగా ఉన్న హౌరా- చెనై్న ప్రధాన రైలు మార్గాన్ని రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేస్తే పెరిగే ప్రయాణ అవసరాలకు తగిన విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యతలో ఈ మార్గంలో హై స్పీడ్‌ రైళ్లతో పాటు బుల్లెట్‌ ట్రైన్లను నడిపే ప్రతిపాదనను రైల్వే పరిశీలిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆయా మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.