ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగ యువతకు 6లక్షల ఉద్యోగావకాశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2017, 01:07 AM

కాకినాడ, మేజర్‌న్యూస్‌ : రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని యువతకు ఐటి రంగంలో లక్ష, పరిశ్రమల రంగంలో మరో 5 లక్షలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖామంత్రి నారా లోకేష్‌ తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖామంత్రి నారా లోకేష్‌, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పలతో కలిసి కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని వేళంగి, కరప, నడకుదురు, తూరంగి గ్రామాల్లో పర్యటించి పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తొలుత ఆయన వేళంగి గ్రామంలో రూ.12కోట్లు ఎస్‌ఆర్‌డిడబ్ల్యూపి, 13వ ఆర్ధిక సంఘం నిధులతో 8 గ్రామ పంచాయతీల పరిధిలో 25వేల జనాభా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. తదుపరి కరప గ్రామంలో రూ.12కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మరో సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి ఇంటా ఆనందంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడమే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిగా తన లక్ష్యమని తెలిపారు. ఇందుకు రానున్న రెండేళ్లలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు విస్తృతం చేసే కార్యక్రమాలను ప్రత్యేక ప్రాధాన్యతగా చేపడతామన్నారు. రూ.16వేల కోట్లు లోటుతో రాష్ట్ర విభజన జరిగినా, గత రెండేళ్లలో ఉపాధి హామీ, ఇతర నిధుల సమన్వయంతో అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలిచామన్నారు. దేశంలో జనాభా పరంగా 4 శాతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌, 9.2శాతం ఉపాధి హామీ నిధులు వినియోగించుకోవడం ముదావహమన్నారు. నిధుల కొతర ఉన్నా పాలనలోకి వచ్చిన 10 రోజుల్లోనే 24 గంటలు నిరంతరాయ విద్యుత్‌ భద్రతను ప్రజలకు కల్పించామన్నారు. చాలీచాలని 200 రూపాయల పింఛన్లను వెయ్యి కోట్ల రూపాయలకు తమ ప్రభుత్వం పెంచిందన్నారు. డ్వాక్రా మహిళల సాధికారత లక్ష్యంగా సభ్యులకు రూ.6వేలు పంపిణీ చేశామని, రైతులకు రూ.25వేల కోట్ల రుణ విమోచన కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న రెండేళ్లలో లక్ష మంది యువతకు ఐటి రంగంలోను, మరో 5లక్షల మందికి పారిశ్రామిక రంగంలోను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే ప్రముఖ సెల్‌ కంపెనీల పాక్స్కాన్‌ రాష్ట్రంలో తమ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసి 9500 మందికి ఉపాధి కల్పించిందని, అలాగే ప్రముఖ కియా మోటార్‌ సంస్థ నెలకొల్పనున్న యూనిట్‌ మరో 25వేల మందికి ఉపాధి కల్పించనుందన్నారు. కేంద్రంతో విభే ధించడం వల్ల రాష్ట్రాభివృద్ధి ప్రయోజనాలకు భంగం కలుగుతుందని, స్పెషల్‌ స్టేటస్‌ ఇచ్చే అవకాశం లేనందున, స్టేటస్‌ వల్ల వచ్చే నిధులను స్పెషల్‌ ప్యాకేజీ కింద రూ.45వేల కోట్లు రాష్ట్రాభివృద్ధికి ఇస్తోందన్నారు. కుల, మత, ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొడుతున్న పార్టీలు, పత్రికలు, చానళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండి, వాటి దుష్టయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపి తోట నరసింహం ప్రసంగిస్తూ నారా లోకేష సమర్ధ శాఖా నిర్వహణ ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు మహర్ధశను చవిచూడగలవన్నారు. స్థానిక శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మీ సత్యనారాయణమూర్తి, నియోజకవర్గంలోని 23 గ్రామాలకు గాను 5 మినహా అన్ని గ్రామాలకు తాగునీటి వసతులు కల్పించామని, ఇందుకు నిధులు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పర్యటనలో నడకుదురులో రూ.30లక్షల నిధులతో సామాజిక వికాస భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. అలాగే తూరంగిలో రూ.10కోట్ల అంచనాతో చేపట్టిన తాగునీటి పథకానికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో శానసమండల ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ బి.రామాంజనేయులు, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, చిక్కాల రామచంద్రరావు, రవివర్మ, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, ఎ.ఆనందరావు, గొల్లపల్లి సూర్యారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎం.వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com