ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితుల సంక్షేమం వైపు సర్కారు చూపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2017, 01:11 AM

వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : దళితుల సంక్షేమం వైపు సర్కారు దృష్టి సారించింది.  ప్రభుత్వం గత మూడేళ్లలో సాంఘిక, గిరిజన సంక్షేమం కింద 68 లక్షల 28 వేల మంది లబ్ధిదారులకు రూ. 8 వేల 130 కోట్ల విలువైన వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. దాంట్లో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 53 లక్షల 43 వేల 942 మందికి రూ. 6042 కోట్ల విలువైన లబ్ధిని అందించారు. అదే విధంగా షెడ్యూల్‌ తెగల సంక్షేమం కింద 14 లక్షల 84 వేల 111 మందికి రూ. 2,088 కోట్ల విలువైన లబ్ధిని అందించారు. విద్యరంగానికి సంబంధించి ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాల కింద 5 నుంచి 10 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు, మరియు బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీసంక్షేమ శాఖ ద్వారా మొత్తం 9 లక్షల 64 వేల 302 మంది విద్యార్థులకు రూ. 282 కోట్లను ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలుగా అందించడం జరిగింది. అలాగే పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు, అంబేద్కర్‌ ఓవరసీస్‌ విద్యా నిధి, స్కిల్‌ అప్‌ గ్రేడేషన్‌, బుక్‌ బ్యాంక్‌ స్కీమ్‌ స్కీముల కింద 10 లక్షల 94 వేల 892 మందికి రూ. 2104 కోట్లు అందించడం జరిగింది. ప్రీ మెట్రిక్‌ , పోస్ట్‌ మెట్రిక్‌ కింద హాస్టల్‌ విద్యార్థులకు, ఆశ్రమ, రెసిడెన్షియల్‌ స్కూళ్ల విద్యార్థులకు ఉపకార వేతనాలుగా11 లక్షల 2 వేల మందికి రూ. 2560 కోట్లు అందించారు. విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కింద హాస్టల్‌ భవనాల నిర్మాణం, రెసిడెన్షియల్‌, ఆశ్రమ స్కూళ్ల భవనాల నిర్మాణం కింద 1579 భవనాలకు రూ. 1048 కోట్లు మంజూరు చేశారు. లైవ్‌ లీ హూడ్‌ కార్యక్రమం కింద 2 లక్షల 16 వేల మందికి రూ. 1434 కోట్లు ఖర్చు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం కింద ఎస్సీ కార్పోరేషన్‌ మరియు ట్రైకార్‌, ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పోరేషన్‌, ఓకేషనలైజేషన్‌ ఆఫ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఎన్టీఆర్‌ విద్యోన్నతి, స్టడీ సర్కిల్స్‌ కింద లక్షా 44 వేల 274 మందికి రూ. 247 కోట్లు ఖర్చు చేశారు. సామాజిక భద్రత కార్యక్రమాల కింద  ఇళ్ల స్థలాలకు, భూసేకరణ, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, వెట్టిచాకిరి నిర్మూలన, జోగినీలు, తదితరులు సహాయర్థం 11 వేల 907 మందికి రూ. 232 కోట్లు ఖర్చు చేశారు. అదే విధంగా 32 లక్షల 92 వేల 391 మంది ఎస్సీ, ఎస్టీ గృహ లబ్ధిదారులకు రూ. 221 కోట్లు ప్రభుత్వమే భరించి విద్యుత్‌ సౌక ర్యాన్ని కల్పించడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ  ప్రజల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికై ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. 


అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ జరగనుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20 ఎకరాల స్థలంలో ఈ విగ్రహాన్ని నిర్మించ డంతోపాటు, అంబేద్కర్‌ జ్ఞాన మందిరం, యోగా కేంద్రం, కన్వెన్షన్‌ సెంటర్‌, లైబ్రరీ, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 97 కోట్ల 64 లక్షలు కేటాయించింది. ఐనవోలు- శాఖమూరు మధ్య విగ్రహ ప్రతిష్టకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా  భూమిపూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా 25 మంది ప్రముఖ బౌద్ధ భిక్షవులు పాల్గొంటారు. అంబేద్కర్‌ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌ లోని మౌ గ్రామం నుంచి పవిత్ర మట్టి, నీటిని సేకరించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 బౌద్ధ క్షేత్రాలైన ఘంటసాల, అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, శాలబీడు, కొలగొండ, అవుతు, గుంటుపల్లి తదితర ప్రాంతాల నుంచి మట్టిని, నీటిని సేకరించారు. అంబేద్కర్‌ వాదాన్ని, తత్వాన్ని, విధానాలను, ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.  ఈ కార్యక్ర మానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొననున్నాయి. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అంబేద్కర్‌ వాదులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. విగ్రహ ప్రతిష్ట జరిపిన తర్వాత సచివాలయ పరిసర ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి 40 నుంచి 50 వేల మంది వరకు హాజరుకానున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com