ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 13, 2017, 12:25 PM
 

అమరావతి: ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి.  విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్‌, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సర విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఫస్ట్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి అన్నారు. అలాగే ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్‌ విధానం అమలు చేశామన్నారు. రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. మే 15 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ ఫలితాల్లో కూడా గ్రేడింగ్‌ విధానం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా తెలిపారు. అలాగే 80 శాతం ఉత్తీర్ణతతో ఎప్పటిలాగే బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు 77శాతం ఉత్తీర్ణులు అయ్యారు.