టాప్ టెన్ న్యూస్

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 11, 2017, 12:05 PM
 

1. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం దిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు సహా భాజపా, అకాళీదల్‌ నేతలు హాజరయ్యారు.
2. గూఢచర్యం ఆరోపణలపై భారత్‌కు చెందిన మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్‌ మరణశిక్ష విధించింది. కుల్‌భూషణ్‌ పాక్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గత ఏడాది మార్చి 3న ఆయన్ను అరెస్టు చేసింది. మరోవైపు ఈనెల 12న విడుదల కావాల్సిన 12మంది పాకిస్థాన్‌ ఖైదీలను విడుదల చేయకూడదని భారత్‌ నిర్ణయించింది.
3. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం కలెక్టర్లతో సమావేశమయ్యారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పథకాల్లో తప్పులు జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. గొర్రె పిల్లల పంపిణీకి సంబంధించి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్న సీఎం.. గొర్రెల పెంపకం సహకార సంఘాల్లో రూ.51తో సభ్యత్వాలు చేయించాలన్నారు.
4. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌తో ప్రధాని మోదీ దిల్లీలోని హైదరాబాద్‌ భవన్‌లో సమావేశమయ్యారు. భారత్‌-ఆస్ట్రేలియా పౌర అణు ఒప్పందానికి సంబంధించి అన్ని విధానాలు, ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇరు దేశాల ప్రధానులు వెల్లడించారు. గతంలో కంటే మరింత సన్నిహితంగా భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు టర్న్‌బుల్‌ తెలిపారు. అనంతరం ఇద్దరు ప్రధానులు కలిసి దిల్లీ మెట్రో రైలులో అక్షర్‌ధామ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు.


5. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తెలంగాణ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, బీబీ పాటిల్‌ భేటీ అయి ఓ వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని షెడ్యూల్‌ 10లో పేర్కొన్న సంస్థల విభజనలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
6. ఐపీఎల్‌ పదో సీజన్‌లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 9 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.
7. ‘నీరు-ప్రగతి’ పురోగతిపై జిల్లా కలెక్టర్లు, సర్పంచులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏప్రిల్‌ 15 నుంచి జులై 15 వరకు జలసంరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
8. రాష్ట్రంలోని 5వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ‘అమ్మకు వందనం’ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కార్యక్రమం అమలుపై విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
9. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సభ్యులుగా సీనియర్‌ అధికారులు అజిత్‌కుమార్‌ శ్రీవాత్సవ, షబ్రీ భట్సాలీలు నియమితులయ్యారు. వీరి నియామకానికి కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ఆండ్‌ ట్రయినింగ్‌ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
10. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సింధూ జలాల ఒప్పందం రాజ్యాంగ విరుద్ధమని.. దాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. 1960 నాటి ఈ ఒప్పందం వల్ల సగానికి పైగా దేశానికి లాభం చేకూరుతోందని పేర్కొంది.